NRI-NRT

అరిజోనాలో రోడ్డు ప్రమాదం. ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం.

అరిజోనాలో రోడ్డు ప్రమాదం. ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం.

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. భారత కాలమానం ప్రకారం ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మృతి చెందిన ఇద్దరూ ఉన్నత చదువులకు అమెరికా వెళ్లినవారే. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన పార్శి గౌతమ్‌కుమార్‌(19), కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన ముక్క నివేశ్‌ (20) అమెరికాలోని అరిజోనా స్టేట్‌ వర్సిటీలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నారు. శని, ఆదివారాలు సెలవులు రావడంతో వీరిద్దరూ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో వాటర్‌ఫాల్స్‌ చూసేందుకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారును ఫినిక్స్‌ పరిధిలోని మెట్రోటౌన్‌ సెంటర్‌ వద్ద ఓ ట్రక్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో గౌతమ్, నివేశ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. ప్రస్తుతం వారు స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అరిజోనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గౌతమ్‌కుమార్‌ ఇండియాకు తిరిగి రావడానికి మే 22న టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. నెలరోజులైతే ఇంటికి వచ్చి తమతో సంతోషంగా గడిపేవాడని గౌతమ్‌తల్లిదండ్రులు పార్శి కమల్‌కుమార్‌గుప్తా – పద్మ కన్నీరుమున్నీరు అయ్యారు. కమల్‌కుమార్‌గుప్తా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు శివునిపల్లిలో బంగారం వ్యాపారం చేస్తూ కాజీపేటలోని వడ్డేపల్లిలో నివాసముంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, పెద్దకొడుకు గౌతమ్‌ మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి. నివేశ్‌ తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే: హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు ముక్క కృష్ణమూర్తికి నివేశ్‌ మనుమడు. నివేశ్‌ తల్లిదండ్రులు నవీన్, స్వాతి కూడా వైద్యవృత్తిలోనే కొనసాగుతున్నారు. వీరికి ఇద్దరు సంతానం కాగా, నివేశ్‌ పెద్దవాడు.

More Info: https://www.facebook.com/PeoriaPoliceAZ/posts/pfbid0vwtLb4midNhnfrhJBpWLdb9AMSPoq1W12XC4kNsLKSGbTC6mEwoJoVcB5pgQ6P49l

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z