Business

కోటక్ బ్యాంకు వినియోగదారులకు గమనిక-BusinessNews-Apr 24 2024

కోటక్ బ్యాంకు వినియోగదారులకు గమనిక-BusinessNews-Apr 24 2024

* ప్రైవేటు రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు (Kotak Mahindra Bank) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) షాకిచ్చింది. ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఛానల్స్‌ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆంక్షలు విధించింది. అలాగే కొత్తగా క్రెడిట్‌ కార్డుల జారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఐటీ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లో లోపాలు గుర్తించిన నేపథ్యంలో బుధవారం ఆర్‌బీఐ ఈ చర్యలు చేపట్టింది. 2022, 2023 సంవత్సరాల్లో రిజర్వ్ బ్యాంక్ ఐటీ పరిశీలనలో గుర్తించిన లోపాలను సమగ్రంగా, సమయానుకూలంగా పరిష్కరించడంలో బ్యాంకు విఫలమైనందున చర్యలు అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఐటీ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌, యూజర్‌ యాక్సస్‌ మేనేజ్‌మెంట్‌, వెండార్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, డేటా సెక్యూరిటీ అండ్‌ డేటా లీక్‌ ప్రివెన్షన్‌ స్ట్రాటజీ వంటి అంశాల్లో తీవ్రమైన లోపాలు గుర్తించినట్లు తన ప్రకటనలో తెలిపింది. ఐటీ రిస్క్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ గవర్నెన్స్‌ విషయంలో ఆ రెండు సంవత్సరాలు మార్గదర్శకాలను పాటించలేదని ఆర్‌బీఐ పేర్కొంది.

* ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) బుధవారం పబ్లిక్‌ నోటీసు జారీ చేసింది. ఎల్‌ఐసీతో పాటు, సంస్థకు చెందిన వ్యక్తుల పేరుతో వివిధ సామజిక మాధ్యమ ఖాతాల్లో మోసపూరిత ప్రకటనలు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఇలాంటి ప్రకటనలపై ప్రజలు, పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) వరుసగా నాలుగో రోజూ రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు మన మార్కెట్లను ముందుకు నడిపించాయి. ముఖ్యంగా మెటల్‌ స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆఖర్లో ఐటీ షేర్లలో అమ్మకాల కారణంగా స్వల్ప లాభాలకే సూచీలు పరిమితమయ్యాయి. నిఫ్టీ 22,400 ఎగువన ముగిసింది. ఉదయం 73,957.57 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. రోజంతా అదే ఒరవడిని కొనసాగించింది. ఇంట్రాడేలో 73,788.61 – 74,121.61 మధ్య కదలాడింది. చివరికి 114.49 పాయింట్ల లాభంతో 73,852.94 వద్ద ముగిసింది. నిఫ్టీ 34.40 పాయింట్ల లాభంతో 22,402.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.33గా ఉంది. సెన్సెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్ షేర్లు రాణించాయి. టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 88.14 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

* ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. ట్విటర్‌ను సొంతం చేసుకున్న తర్వాత అనేక మార్పులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌ (YouTube)కు దీటుగా ప్రత్యేక వేదికను తెచ్చేందుకు సిద్ధమయ్యారు. యూజర్లు హైక్వాలిటీ వీడియోలు అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా టీవీ యాప్‌ (X TV app)ను అందుబాటులోకి తేనున్నట్లు ‘ఎక్స్‌’ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. ఎక్స్‌ టీవీ యాప్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ కూడా యూట్యూబ్‌ మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.

* ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Airtel) కొత్త అంతర్జాతీయ రోమింగ్‌ ప్యాక్స్‌ను తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచే ఈ కొత్త ప్యాక్స్‌ లభిస్తాయని, వీటితో 184 దేశాల్లో కవరేజీ పొందొచ్చని కంపెనీ తెలిపింది. అధిక డేటా ప్రయోజనాలు, ఇన్‌ఫ్లైట్‌ కనెక్టివిటీ, 24/7 కస్టమర్‌ సపోర్ట్‌తో వీటిని తీసుకొచ్చినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 30 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న రూ.3999 ప్యాక్‌ను లెక్కించి రోజుకు సగటు ధరను ఎయిర్‌టెల్‌ పేర్కొంది. వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు గాను 184 దేశాలకు వేర్వేరు ప్యాకేజీలకు సబ్‌స్క్రైబ్‌ అవ్వాల్సిన అవసరం లేకుండా సింగిల్‌ ప్యాక్‌కు సబ్‌స్క్రైబ్‌ అవ్వొచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది. స్థానిక సిమ్‌ కార్డుల కంటే తక్కువ ధరకే ఈ ప్లాన్లు లభిస్తాయని పేర్కొంది. తరచూ ప్రయాణాలు చేసే వారికి ఆటో రెన్యువల్‌ సదుపాయం కూడా ఉందని తెలిపింది. ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే అంతర్జాతీయ రోమింగ్‌ ప్లాన్స్‌ రూ.649 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఒక రోజు వ్యాలిడిటీతో వస్తున్న ఈ ప్యాక్‌ ద్వారా.. 500 ఎంబీ డేటా, 100 నిమిషాల ఫ్రీ ఔట్‌ గోయింగ్ కాల్స్‌ లభిస్తాయి. గరిష్ఠంగా రూ.14,999 వరకు వివిధ రకాల రోమింగ్‌ ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z