NRI-NRT

సాహిత్యంలో హాస్య వ్యంగ్య కవిత్వంపై టాంటెక్స్ 201వ సదస్సు

సాహిత్యంలో హాస్య వ్యంగ్య కవిత్వంపై టాంటెక్స్ 201వ సదస్సు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 201వ సాహితీ సదస్సు “ఆధునిక సాహిత్యంలో హాస్య వ్యంగ్య కవిత్వం” అనే అంశంపై నిర్వహించారు. “వినరో భాగ్యము విష్ణు కథా” అన్నమయ్య కీర్తనను లెనిన్ వేముల ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముఖ్య అతిథి డా. పెరుగు రామకృష్ణను సభకు పరిచయం చేశారు. రామకృష్ణ తన ప్రసంగిస్తూ మహాకవి తిక్కన, దువ్వూరు రామిరెడ్డి, దీపాల పిచ్చయ్య శాస్త్రి, వేదం వెంకటరాయశర్మ వంటివారి నెల్లూరు జిల్లా వారేనని గుర్తు చేశారు. తన గురుతుల్యులు గుంటూరు శేషేంద్ర శర్మకు నివాళి అర్పించారు.

భారతీయ జీవనశైలికి, సైబీరియన్ పక్షుల జీవనశైలికి దగ్గర పోలికలున్న విధానాన్ని గమనించి తాను వ్రాసిన “ఫ్లెమింగో” కవితా సంపుటిలోని యాభై రెండులైన్ల కవితా భాగాన్ని ఏపీ ప్రభుత్వం 2023లో “కృష్ణ గీతికలు” శీర్షికతో తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్య అంశముగా ప్రవేశపెట్టడం తనకు సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. తెలుగులో హాసం అనే పదానికి నవ్వు అని అర్ధం వస్తుందన్నారు. ప్రతిభావంతమైన హాస్యం హృదయాలను రంజింప చేస్తుందన్నారు. తెలుగు సాహిత్యంలో ప్రాచీన కవుల నుండి జంధ్యాల వంటి నేటి ఆధునిక కవుల హాస్య కవిత్వ పరిణామ క్రమాన్ని వివరించారు. శ్రీనాధ మహాకవి, తెనాలి రామకృష్ణ, రాయలవారి “ఆముక్త మాల్యద”, ఆచార్య తూమాటి దోణప్ప రచనలు, మహాభారతం వంటి ప్రాచీన కావ్యాలను పరిశీలించినట్లయితే ఆకాలంలో వ్యంగ్య హాస్య కవిత్వానికి చాలా పరిమితంగా ప్రాధాన్యత ఇచ్చినట్లు గమనించవచ్చునన్నారు. జనార్ధన మహర్షి, కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీనరసింహం, తిరుపతి వేంకట కవులు, అనంత పంతుల రామలింగస్వామి, కృష్ణశాస్త్రి, భోగరాజు నారాయణమూర్తి, పానుగంటి లక్ష్మీ నరసింహారావు, గురజాడ అప్పారావు, వేదము వెంకటరాయశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, భమిడిపాటి కామేశ్వరరావు వ్యంగ్య సాహిత్య రచనలను ప్రస్తుతించారు. అనంతరం ఈయన్ను టాంటెక్స్ కార్యవర్గం సన్మానించింది.

అధ్యక్షులు సతీష్ బండారు, సమన్వయకర్త లక్ష్మినరసింహ పోపూరి, బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మెంబర్ దయాకర్ మాడా, డాక్టర్ యు.నరసింహారెడ్డి, కాశీనాధుని రాధ, గోవర్ధనరావు నిడిగంటి, గుళ్ళపల్లి రాజేంద్రప్రసాద్, తిరుపతి జిల్లా గూడూరు శ్రీ విజయ దుర్గ పీఠం నుండి డాక్టర్.సునీల్ కుమార్ కోట, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, వీర్నపు చిన్నసత్యం, మావిళ్ల రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z