టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు, విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ వై. సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియకు రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా మలిగి మధుసూదన రెడ్డిని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్ నియమించింది. సుజనా చౌదరి అప్పుల లెక్కలు తీయాలని ఆదేశించింది. సుజనా చౌదరి దివాలా పరిష్కార ప్రక్రియకు ఇప్పటికే అంగీకరించిన ఎస్‌సీఎల్‌టీ.. ఆ తీర్పు పూర్తి ప్రతిని తాజాగా విడుదల చేసింది. దివాలా ప్రక్రియ ముగిసే వరకు సుజనా (రుణ గ్రహీత) ఆస్తుల క్రయవిక్రయాలు, ఇతరుల పేరిట బదిలీ చేయడం లాంటివి చెల్లవని తేల్చిచెప్పింది. దివాలా ప్రక్రియ అంతా ఎలా నిర్వహించాలో ఎన్‌సీఎల్‌టీ జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్‌పూరి ధర్మాసనం రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కు స్పష్టంగా వివరించింది.
దివాలా ప్రక్రియకు వెళ్లిన స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎస్‌బీఐకి రూ. 562,84,30,310 (అసలు, వడ్డీ కలిపి) రుణ బకాయి పడిందని, దీనికి సుజనా చౌదరి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఇచ్చినందున, ఆయనను దివాలాదారునిగా ప్రకటించి, రుణ పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ బ్యాంకు 2021లో ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. దీనిపై విచారించిన ఎన్‌సీఎల్‌టీ మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషల్ (ఐఆర్‌పీ)గా మధుసూదన్ రెడ్డిని నియమించింది. వ్యకిగత హామీదారుకు రుణాల చెల్లింపు కోసం బ్యాంక్ సమయం ఇచ్చిందని, అయినా చెల్లించడంలో ఆయన విఫలమయ్యారని ఐఆర్‌పీ నివేదిక అందజేశారు. పిటిషన్‌ను అనుమతించి దివాలా ప్రక్రియను ప్రారంభించవచ్చని చెప్పారు. ఈ నివేదికను పరిశీలించి, ఇరుపక్షాల వాదనలు విన్న ఎన్‌సీఎల్‌టీ తీర్పు వెలువరించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z