‘మోదీ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగింది. భాజపా పదేళ్ల పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు. తీవ్ర నష్టం జరిగింది. మేకిన్ ఇండియా, సబ్‌కా సాథ్- సబ్‌కా వికాస్, బేటీ బచావో, బేటీ పఢావో లాంటి నినాదాలు తప్ప మోదీ రాష్ట్రానికి నిధులిచ్చింది లేదు. దేశవ్యాప్తంగా దళితులు, మహిళలపై దాడులు, నిరుద్యోగం, పేదరికం పెరిగాయి. 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏ ఒక్కటీ నింపలేదు. భాజపా ఓట్ల కోసం వస్తుంటే.. కాంగ్రెస్ ఒట్లతో వస్తోంది. యువత, రైతులు, మహిళలు ఆలోచించి పరిణతితో భారాసకు ఓటేయాలి’ అని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ‘పోరుబాట బస్సుయాత్ర’ రెండోరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగింది. భువనగిరిలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన రోడ్‌షోలో కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌కు మద్దతుగా నిర్వహించిన కూడలి సమావేశంలో ప్రసంగించారు. డాలర్‌తో రూపాయి విలువ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.83కి చేరిందని.. ఇదంతా భాజపా, మోదీ పాలన ఫలితమేనని కేసీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మైనార్టీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఓటేస్తే భాజపాకు ఓటేసినట్లేనని, భారాస లౌకిక పార్టీ అన్నారు. తన బిడ్డను అరెస్టు చేసినా భయపడటం లేదని, మోదీతో పోరాడతామని తెలిపారు. మళ్లీ భారాస సర్కారే వస్తుందని, మైనార్టీలకు గతంలో ఇచ్చిన అన్ని పథకాలనూ అందిస్తామన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z