* దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిలో రూ.3,877.8 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది మార్చిలో నమోదైన రూ.2,623.6 కోట్లతో పోలిస్తే లాభం 47.8 శాతం వృద్ధి చెందడం గమనార్హం. విక్రయాల్లో గణనీయమైన వృద్ధి నమోదవడంతో లాభాలు పెరగడానికి దోహదపడింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.13,209 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 64 శాతం పెరిగింది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 20 శాతం పెరిగి 1.40 లక్షల కోట్లకు చేరినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.125 చొప్పున తుది డివిడెండ్ ఇచ్చేందుకు బోర్డు సిఫార్సు చేసినట్లు కంపెనీ తెలిపింది.
* రేమండ్ గ్రూప్ (Raymond group) కంపెనీలైన జేకే ఇన్వెస్టర్స్, రేమండ్ కన్జ్యూమర్ కేర్, స్మార్ట్ అడ్వైజరీ అండ్ ఫిన్సర్వ్ నుంచి నవాజ్ మోదీ సింఘానియాను డైరెక్టర్‌గా తొలగించారు. ఈ విషయాన్ని ఆయా కంపెనీల అధికార ప్రతినిధులు గురువారం వెల్లడించారు. మార్చి 31న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.
* విమాన టికెట్ కొనుగోలు చేసేటప్పుడు పలు రకాల సర్వీసులను ఆ ధరలోనే కలిపేస్తారు. దీనివల్ల అవసరం లేని సేవలకు సైతం ప్రయాణికులు చెల్లించక తప్పని పరిస్థితి. ఇది అనవసర భారమనే చెప్పాలి. దీనికి పరిష్కారంగా ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)’ ఇటీవల ఓ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. ‘‘విమానయాన సంస్థలు ప్రయాణ ఛార్జీల్లో వారు అందించే కొన్ని సేవలను కూడా కలిపేస్తాయి. వివిధ వర్గాల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్ ప్రకారం.. చాలా సందర్భాల్లో ఆయా సేవలు ప్రయాణికులకు అవసరమై ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో వాటికి విడిగా రుసుము వసూలుచేసే విధానాన్ని తీసుకొస్తే మొత్తంగా టికెట్ ధర తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఈనేపథ్యంలోనే ఆయా సేవలను టికెట్ ప్రాథమిక ధర నుంచి వేరు చేయాలి. వాటిని ‘ఆప్ట్-ఇన్’ పద్ధతిన ఎంచుకునే అవకాశం ప్రయాణికులకు కల్పించాలి’’ అని డీజీసీఏ ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
* అమెరికా (USA)లో భారతీయులు (Indians) పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెట్టి (Eric Garcetti) అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. అగ్రరాజ్యంలో సంస్థ సీఈవో (CEO) అయ్యే అవకాశాలు భారతీయులకే ఎక్కువగా ఉంటున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు భారతీయులైతే అమెరికాలో సీఈవో కాలేరని గతంలో ఓ జోక్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేరనే విశ్లేషణలో ఎలాంటి సందేహం లేదు. గూగుల్, మైక్రోసాఫ్ట్, స్టార్‌బక్స్ లాంటి కంపెనీలే ఉదాహరణ. ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో ప్రతీ 10 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లలో ఒకరికంటే ఎక్కువ అమెరికాలో చదువుకున్న భారత వలసదారులే ఉన్నారు’’ అని గార్సెట్టి వ్యాఖ్యానించారు. ప్రపంచ అభివృద్ధి కోసం సాంకేతిక విప్లవానికి కేంద్రంగా భారత్-యూఎస్ నిలుస్తున్నాయని అన్నారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో వరుస లాభాల్లో దూసుకెళ్లిన మన మార్కెట్లు.. వారాంతంలో నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, కోటక్ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి. దీంతో సెన్సెక్స్ 600 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ మళ్లీ 22,400 స్థాయికి దిగొచ్చింది. సెన్సెక్స్ ఉదయం 74,509.31 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి వెళ్లింది. ఏ దశలోనూ కోలుకోలేదు సరికదా.. మరింత నష్టాల్లోకి జారుకుంది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో 73,616.65 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 609.28 పాయింట్ల నష్టంతో 73,730.16 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 150 పాయింట్లు నష్టపోయి 22,419.95 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.35గా ఉంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z