* రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఇదే కేసులో ఏ4గా ఉన్న రాధాకిషన్‌రావు కూడా ఇవాళ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాధాకిషన్‌రావు పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
* సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. అధికార పార్టీ నేతలు భారీగా మద్యం నిల్వ చేసినట్టు ఫిర్యాదులు అందడంతో శుక్రవారం రాత్రి ఎస్‌ఈబీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నాలుగు ప్రాంతాల్లో అక్రమ మద్యం నిల్వలు గుర్తించారు. పట్టణంలోని జగ్గయ్యచెరువు, సాలిపేట, వైఎస్‌ఆర్ గార్డెన్, కుమారపురం కాలనీల్లోని ఇళ్లలో నిల్వ చేసిన రూ.80 లక్షల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఇంట్లోనే 2,560 లీటర్లకు పైగా మద్యం పట్టుబడింది. వేల కొద్దీ రాయల్ బ్లూ బ్రాండ్, గోవా కిక్ మద్యం సీసాలు బస్తాల్లో నిల్వ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎస్‌ఈబీ అధికారి మహబూబ్ అలీ ఆధ్వర్యంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో పిఠాపురం నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకుంది. దీంతో ఎన్డీయే కూటమి, వైకాపా మధ్య గట్టిపోటీ నెలకొంది. వైకాపా నేతలు పెద్ద ఎత్తున మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.
* రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమను ఆనుకుని నూతనంగా నిర్మిస్తున్న షెడ్డులో వెల్డింగ్ పనులు జరుగుతుండగా.. మంటలు అంటుకున్నాయని కార్మికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కొందరు కార్మికులను కిటికీల్లోంచి నిచ్చెనల సాయంతో బయటకు తీసుకొచ్చారు.
* ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం జల్లేరు వాగు (Jalleru river) లో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి ముగ్గురు మృతి చెందారు. మృతులు ఊట్లపల్లి, దిబ్బగూడానికి చెందిన రేష్మ(24), మొహిషాద్(23), హసద్(14)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు (Police) గజ ఈతగాళ్లతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
* పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరిలో (wedding tent) అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించి ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బీహార్ (Bihar) రాష్ట్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దర్భంగా (Darbhanga)లోని బహెరా ప్రాంతంలోగల అలీనగర్‌లో గురువారం రాత్రి 11:15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వేడుకలో భాగంగా రాత్రి పటాకులు కాల్చారు. ఆ నిప్పు రవ్వలు పెళ్లి పందిరికి అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. లోపల ఉంచిన కొన్ని మండే పదార్థాల కారణంగా మంటలు వేగంగా మండపం మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సునీల్ పాశ్వాన్ (26), లీలాదేవి (23), కంచన్ దేవి (26), సిద్ధాంత్ కుమార్ (4), శశాంక్ కుమార్ (3), సాక్షి కుమారి (5)గా గుర్తించారు. అగ్ని ప్రమాదంలో మూడు ఆవులు కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z