* ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్‌ను అరెస్టు చేశారు. ఆ దేశంలో ఉన్న చైనా కంపెనీ యువకులతో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ‘సిరిసిల్ల పురపాలక సంఘం పరిధి పెద్దూరుకు చెందిన అతికం లక్ష్మి తన కుమారుడు అతికం శివ ప్రసాద్ కంబోడియాలో ఇబ్బంది పడుతున్నాడంటూ నాలుగు రోజుల క్రితం సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన కంచర్ల సాయిప్రసాద్ అనే ఏజెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపి, రూ.1.40 లక్షలు తీసుకుని శివ ప్రసాద్‌ను కంబోడియా దేశానికి పంపినట్టు తెలుసుకున్నాం. వాట్సప్‌లో శివప్రసాద్‌తో మాట్లాడాం. ‘అక్కడున్న చైనా దేశానికి చెందిన కంపెనీ కాల్ సెంటర్‌లో తాను పనిచేస్తున్నానని, కంపెనీ నిర్వాహకులు భారతీయుల ఫోన్ నంబర్లు ఇచ్చి లాటరీ, ఉద్యోగాల పేరుతో అమాయకులను మభ్యపెట్టి వారి ఖాతాల్లో డబ్బు దోచేసేలా తర్ఫీదు ఇచ్చారని, తనలాగే 500-600 మంది బాధితులు పనిచేస్తున్నారని, అందరితో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని’ ఆయన వివరించారు. అనంతరం కంబోడియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులకు సమాచారం అందించాం. అక్కడి పోలీసుల సహకారంతో శివ ప్రసాద్‌ను కాపాడాం. రెండు రోజుల్లో ఆయన భారత్‌కు చేరుకుంటారు. ఆయనతోపాటు అక్కడ ఉన్న బాధితులందర్నీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నాం’ అని ఎస్పీ తెలిపారు.
* ఆసుపత్రికి స్కూటీపై వెళుతున్న స్టాఫ్ నర్స్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జగద్గిరిగుట్టకు చెందిన ప్రశాంతి (37) భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేపీహెచ్‌బీ కాలనీలోని రవి హాస్పిటల్స్‌లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. శనివారం జగద్గిరిగుట్టలోని ఇంటి నుంచి ఆసుపత్రికి సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ నుండి వెళుతోంది. నెక్సాస్ షోరూమ్ వద్ద మలుపు వద్ద కూకట్‌పల్లి వైపు వేగంగా వెళుతున్న వెనుకనుంచి వచి్చన డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
* సాలాపువానిపాలెంలో ఓ యువకుడు శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ప్రియుడిపై మోజులో మరో ఇద్దరితో కలిసి కోడలే కడతేర్చిందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటన మండలంలోని గోటివాడ శివారు సాలాపువానిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ పిన్నింటి రమణ శనివారం సాయంత్రం వెల్లడించిన వివరాల ప్రకారం… సాలాపు శ్రీనివాసరావు (32) దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం దువ్వాడ సమీపంలోని మంగళపాలెంకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మికి అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతోపాటు పెద్దలు వద్ద పంచాయతీ నిర్వహించడం… అనంతరం కలిసి జీవించడం జరిగేది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో సాలాపు శ్రీనివాసరావు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఇంటికి వస్తుండగా… అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరి (22) కలిసి శ్రీనివాసరావును అడ్డుకుని మంచం కోడితో తలపై దాడి చేశారు. దీంతో పెద్దగా కేకలు వేయడంతో శ్రీనివాసరావు తండ్రి అప్పారావుతోపాటు గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని చూడగా… శ్రీనివాసరావు తీవ్ర గాయాలతో పడి వున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు సబ్బవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్ల వైద్యులు నిర్ధారించారు. కోడలు భాగ్యలక్ష్మితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి తమ కుమారుడు శ్రీనివాసరావును హత్య చేశారని మృతుని తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రీనివాసరావు తలపై మంచం కోడితో దాడి చేసిన తర్వాత… సుమారు 150 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహన్ని అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యకు పాల్పడిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరిని(22) అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భార్య భాగ్యలక్ష్మిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణ తెలిపారు.
* మాజీ నక్సలైట్, కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట మండల అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. ఎల్లయ్య అదృశ్యం.. దృశ్యం సినిమాను తలపిస్తోంది. ఎల్లయ్య విరోధులే పథకం ప్రకారం కిడ్నాప్ చేసి హత్య చేశారని కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మరికొంత మంది కోసం పోలీసులు గాలిస్తుస్తున్నారు.
* ఇద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. పెళ్లి చేసుకుని హాయిగా జీవితం కొనసాగించాలని భావించారు. కానీ వారి ప్రేమ పెళ్లికి కులం అడ్డుపడింది. దీంతో ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్ గౌడ్ వ్యవసాయ పనులతో పాటు సూర్యాపేటలో వాటర్ ఫూరిఫైయర్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన చల్లగుండ్ల నాగజ్యోతి నర్సింగ్ పూర్తి చేసి సూర్యాపేటలో ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తోంది. ఓకే గ్రామం కావడంతో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రతి రోజూ సూర్యాపేటకు వెళ్లే సంజయ్.. అక్కడే ఉంటున్న నాగజ్యోతితో నాలుగేళ్లుగా ప్రేమాయణం కొనసాగించాడు. ఇద్దరి కులాలు వేరైనప్పటికీ ప్రేమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రేమ పెళ్లి విషయాన్ని కుటుంబాల పెద్దలకు చెప్పారు. ఈ ప్రేమ పెళ్లికి కులం అడ్డుపడింది. సంజయ్ గౌడ సామాజిక వర్గానికి చెందగా, నాగజ్యోతి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతి. కులాలు వేరువేరు కావడంతో వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారు. ప్రేమ జంట.. పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ వివాహానికి అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో అర్ధరాత్రి గ్రామ శివారులో ప్రేమజంట పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. తెల్లవారు జామున మిగతా జీవులైన సంజయ్, నాగజ్యోతిలను గుర్తించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. ప్రేమికుల ఆత్మహత్య ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z