Politics

ఆనాటి ముస్లిం పాలకుల అరాచకాలపై మాట్లాడరెందుకు?-NewsRoundup-Apr 28 2024

ఆనాటి ముస్లిం పాలకుల అరాచకాలపై మాట్లాడరెందుకు?-NewsRoundup-Apr 28 2024

* తెదేపా హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరులోని షాదీ మంజిల్‌లో ఆయన ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పరిపాలన అంటే ప్రజారంజకంగా ఉండాలన్నారు. స్వార్థం కోసం దోపిడి చేసి మోసం చేస్తే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

* సీఎం జగన్‌ ఎక్కడ సభ పెట్టినా వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రోడ్లను బ్లాక్‌ చేయడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. తాజాగా ఆదివారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పట్టణంలో పలు రోడ్లను బ్లాక్‌ చేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

* పశ్చిమబెంగాల్లోని మమతా ప్రభుత్వం ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో గెలవాలనుకుంటుందా..? అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశ్నించారు. ఆయన సందేశ్‌ఖాలీలో ఆయుధాల స్వాధీనంపై స్పందిస్తూ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలో భాజపా 35 నుంచి 42 వరకు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. టీఎంసీ మాజీ నాయకుడు షాజహాన్‌ షేక్‌ అరాచకాలకు గురైన బాధిత మహిళలకు నడ్డా సంఘీభావం తెలిపారు.

* దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE) 10, 12వ తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాలు మే రెండోవారం నాటికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితాల విడుదలకు సంబంధించి కచ్చితమైన వివరాలను మాత్రం ఇంతవరకు బోర్డు అధికారికంగా ప్రకటించలేదు.

* రిజర్వేషన్ల అంశంపై ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమంటూ ఓ వీడియో వైరల్‌ అవుతోందని చెప్పారు. రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అవసరం ఉన్నంత వరకు వాటిని కొనసాగించాల్సిందేనన్నారు. హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

* హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం కాకుండా, రాజ్యాంగం మార్చకుండా అడ్డుకొనే శక్తి భారాసకే ఉందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. వేములవాడ నియోజకవర్గం బూత్‌ కమిటీ సభ్యుల సమావేశంలో కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌తో పాటు కేటీఆర్‌ పాల్గొన్నారు.

* ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్నాడు జిల్లా నరసరావుపేట తెదేపా అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు కుమార్తె అమూల్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఐదేళ్లుగా తండ్రి పడిన కష్టాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘ ప్రజల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అరవింద్‌బాబు నిలబడ్డారు. ఆర్థికంగా మా కుటుంబం ఎంతో నష్టపోయింది. నాకు, మా తమ్ముడు ఆదిత్యకి భవిష్యత్తు లేనంతగా నష్టపోయాం. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఎన్నికల్లో డబ్బు, రౌడీయిజాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలంతా కలిసికట్టుగా రౌడీయిజాన్ని అడ్డుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

* విరాట్‌ కోహ్లీతో తన అనుబంధంపై మీడియానే టీఆర్పీల కోసం తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేసిందని కోల్‌కతా జట్టు మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. సంచలనాల కోసమే తమ ఇద్దరి మధ్య ఏదో జరిగినట్లు చూపించిందని పేర్కొన్నాడు. ఇక స్ట్రైక్‌ రేట్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. ‘‘అదంతా టీఆర్పీల కోసమే. నేను ఎలాంటి వ్యక్తిని.. విరాట్‌ వ్యక్తిత్వం ఏమిటనేది మీడియాకు కనీస అవగాహన కూడా లేదు. మీడియా అనవసరంగా హైప్‌ సృష్టించింది. వాస్తవానికి పాజిటివ్‌గా కూడా హైప్‌ సృష్టించవచ్చు. జనాలకు మసాలా దొరక్కపోతే ఇలా చేస్తారని విరాట్‌ చెప్పిన మాటతో ఏకీభవిస్తాను. పరిపక్వత ఉన్న ఇద్దరి మధ్య బయటివారు ఎలాంటి ఇబ్బందులు సృష్టించలేరు. ఎందుకంటే అంతిమంగా బంధం వారి మధ్యే ఉంటుంది’’ అని గౌతీ వివరించాడు. విరాట్‌లా డ్యాన్స్‌, చమత్కారం తనకు సాధ్యం కాదని సరదాగా అంగీకరించాడు. ‘‘ఎంత అనుకున్నా విరాట్‌లా కనీసం ఒక్క స్టెప్‌ కూడా వేయలేను. నేను అతడి నుంచి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అది డ్యాన్స్‌ మాత్రమే’’ అని పేర్కొన్నాడు.

* టెక్‌ బిలియనీర్‌, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈఓ అంకుర్ జైన్ (Ankur Jain).. వరల్డ్ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) మాజీ మహిళా రెజ్లర్‌ ఎరికా హమ్మండ్‌ (Erika Hammond) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈజిప్టులో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. ఏప్రిల్‌ 26నే వివాహం జరగ్గా.. పెళ్లి ఫొటోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి.

* రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్‌సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలను వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించిన రాష్ట్ర ప్రైవేటు విద్యా సంస్థల ఐకాస సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకాపా పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎప్పుడు జమ అవుతుందో తెలియడం లేదని అన్నారు. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

* దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ (JEE Advanced 2024)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మెయిన్‌లో అర్హత సాధించిన వారిలో 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అవకాశం ఉండటంతో వారంతా మే 7వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.3200, మహిళలు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే రూ.1600లు చెల్లిస్తే (నాన్‌ రిఫండబుల్‌) సరిపోతుంది. మే 17 నుంచి 26వరకు అడ్మిట్‌ కార్డులు అందుబాటులో ఉంటాయి.

* వైకాపా ఎమ్మెల్యేలు సైతం సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసే పరిస్థితి ఉండదని మాజీ క్రికెటర్‌, జనసేన పార్టీ నాయకుడు అంబటి రాయుడు అన్నారు. రాచరికం, ఆధిపత్య ధోరణి తరహాలోనే ఆ పార్టీ పాలన సాగిందని విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో ఆయన శనివారం పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘గతంలో నేను వైకాపా వారి వద్దకు వెళ్లినప్పటికీ అక్కడి వాతావరణం చూశాక ప్రజాసేవకు ఇది వేదిక కాదనిపించింది. వెంటనే బయటకు వచ్చేశా. పవన్‌కల్యాణ్‌ నాయకత్వం, ఆయన ఆశయాలు నచ్చి జనసేనలోకి వచ్చా. రాష్ట్ర ప్రగతికి, యువతకు ఉపాధి కోసం కూటమి అభ్యర్థులను మనమంతా గెలిపించుకోవాల్సిన అవసరముంది’ అని పేర్కొన్నారు. ప్రతి ఓటు సద్వినియోగం కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆయన గ్రామంలోని ఆలయాల్లో పూజలు నిర్వహించారు.

* నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్‌ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. ప్రస్తుతానికి నాన్‌-జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్లు, ఈ-స్టాంప్‌ పేపర్లపైనా కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. క్రమంగా స్టాంప్‌ పేపర్ల స్థానంలో కేవలం ఈ-స్టాంప్‌ పేపర్ల పైనే లావాదేవీలు జరిగేలా చేసేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. రేయింబవళ్లు శ్రమించి.. సంపాదించిన డబ్బుతో జీవితంలో ఒకటి, రెండుసార్లు మాత్రమే జరిగే ఆస్తుల కొనుగోళ్ల రిజిస్ట్రేషన్లు కేవలం కాగితాలపైనే (జిరాక్స్‌ మాదిరిగా) చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి నాన్‌-జ్యుడిషియల్‌ స్టాంపు పేపర్లపైనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ కారణంగా పాత తేదీలతో పత్రాలు సృష్టించి వివాదాలు తెస్తున్నారని, నాసిక్‌ నుంచి స్టాంపులు రప్పించడం భద్రతాపరంగానూ కష్టంగా ఉందని సాకులు చెబుతూ వైకాపా ప్రభుత్వం ఈ-స్టాంపింగ్‌ విధానం అమలుకు తెరలేపింది. నిజానికి నాన్‌-జ్యుడిషియల్‌ స్టాంపు పేపర్లయితే ఎంతకాలమైనా దాచుకోడానికి వీలుగా ఉంటాయి. కానీ.. ఈ-స్టాంప్‌ల మన్నిక కూడా తక్కువ. ఇవి ఇంచుమించు జిరాక్స్‌ కాపీల్లాగే కనిపిస్తున్నాయి. విలువైన ఆస్తుల కొనుగోళ్ల విషయంలో ఇలాంటి ప్రయత్నాలు తగవని జనం మండిపడుతున్నారు.

* శంషాబాద్‌ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత నాగోల్‌ స్టేషన్‌ సమీపంలో మొదటి స్టేషన్‌తో మొదలై, నాగోల్‌ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీనగర్‌ కూడలి, సాగర్‌ రింగ్‌రోడ్డు, మైత్రీనగర్‌, కర్మన్‌ఘాట్‌, చంపాపేట రోడ్‌ కూడలి, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్‌డీవో, హఫీజ్‌ బాబానగర్‌, చాంద్రాయణగుట్ట ప్రాంతంలో స్టేషన్లు రాబోతున్నాయని వెల్లడించారు. ఈ మార్గంలో మెట్రోరైలు ఎలైన్‌మెంట్‌, స్టేషన్ల స్థానాలను ఖరారు చేసేందుకు శనివారం ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో కాలినడకన పరిశీలించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు.

* అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో జనతాదళ్‌ (సెక్యులర్‌) అగ్రనేత దేవెగౌడ (Deve Gowda) మనవడు, ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna) భారత్‌ వీడారు. ఆయన ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయల్దేరి వెళ్లారు. మరో వైపు కర్ణాటక ప్రభుత్వం ఈ వీడియోలపై దర్యాప్తు కోసం స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా హసన్‌ జిల్లాలో ఇవి ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా దీనిలో దర్యాప్తు చేస్తామన్నారు.

* కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ (Narendra Modi) విరుచుకుపడ్డారు. రాజులు, మహారాజులను అవమానించిన ఆయన.. బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తానుల అరాచకాలపై మౌనంగా ఉన్నారని అన్నారు. బెళగావిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను కాంగ్రెస్‌ రాయించిందన్నారు. ‘కాంగ్రెస్‌ యువరాజు నేటికీ ఆ పాపాలను కొనసాగిస్తున్నారు. రాజులు, మహారాజులు పేదల భూములను ఆక్రమించారని ఆయన (రాహుల్) ఆరోపించారు. తద్వారా ఛత్రపతి శివాజీ మహారాజ్‌, కిట్టూరు రాణి చెన్నమ్మ వంటి మహానుభావులను అవమానించారు. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసమే అటువంటి ప్రకటనలు చేశారు. కానీ, దేశ చరిత్రలో నవాబులు, నిజాంలు, సుల్తానులు, బాద్‌షాలు చేసిన దౌర్జన్యాలపై మాత్రం ఆయన నోరు మెదపలేదు’ అని మోదీ విమర్శించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z