DailyDose

విమనాశ్రయాలకు బాంబు బెదిరింపులు-CrimeNews-Apr 29 2024

విమనాశ్రయాలకు బాంబు బెదిరింపులు-CrimeNews-Apr 29 2024

* ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్‌ జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గొర్ల పుల్లయ్యగారి వీధికి చెందిన ఉమామహేశ్వరి, శ్రీహరికి 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు(17), కుమార్తె(16) ఉన్నారు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమామహేశ్వరి తన ఇద్దరు పిల్లలను తీసుకుని అదే ప్రాంతంలో భర్తకు దూరంగా నివాసం ఉంటోంది. గొడవలకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు కేసులతో పాటు భర్తకు దూరమయ్యాననే బాధతో ఆమెకు జీవితంపై విరక్తి ఏర్పడింది. దీంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటానని ఆదివారం సాయంత్రం ఇద్దరు పిల్లలను తీసుకెళ్లింది. భర్త శ్రీహరి ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో ఉమామహేశ్వరి, ఆమె కుమారుడు, కుమార్తె వల్లూరు మండల కేంద్రంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సోమవారం పోలీసులు గుర్తించారు.

* Chicken Shawarma | వీధుల్లో అమ్ముతున్న చికెన్‌ షావర్మా (Chicken Shawarma) తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai)లో చోటు చేసుకుంది. బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్‌ (Goregaon) ప్రాంతంలోని సంతోష్‌ నగర్‌లో శాటిలైట్‌ టవర్‌ వద్ద చికెన్‌ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అందులో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగానే వీరు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

* దేశంలోని పలు ఎయిర్‌పోర్టులకు సోమవారం బాంబు బెదిరింపు మెయిల్స్‌ రావడం కలకలం రేపింది. జైపూర్‌, కాన్పూర్‌, గోవా ఎయిర్‌పోర్టులకు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. దీంతో ఎయిర్‌పోర్టుల్లో భద్రత పెంచారు. బాంబుల కోసం తనిఖీలు చేపట్టారు. అయితే బాంబు బెదిరింపు మెయిల్స్‌ ఉత్తుత్తివే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం పలు ఎయిర్‌పోర్టులకు ఈ తరహాలోనే బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. ఈ మెయిల్స్‌ ఉత్తుత్తివేనని పోలీసులు ఇప్పటికే తేల్చారు.

* దేశంలోనే ‘కోచింగ్‌ హబ్‌’గా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువు ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నీట్‌పరీక్షకు సిద్ధమవుతున్న మరో విద్యార్థి తాజాగా తనువు చాలించాడు. హర్యానా రోహ్‌తక్‌కు చెందిన సుమిత్‌ అనే 20 ఏళ్ల విద్యార్థి నీట్‌ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. ఏడాదిగా కోటాలోని కున్హాడి ల్యాండ్‌మార్క్‌ సిటీలో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతను తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదివారం సుమిత్‌కు అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. అనుమానం వచ్చి వారు హాస్టల్‌ వార్డెన్‌కు ఫోన్‌ చేశారు. సిబ్బంది సుమిత్‌ గది వద్దకు వెళ్లి చూడగా.. డోర్‌ లాక్‌ చేసుకొని రూమ్‌లో ఉరేసుకొని కనిపించాడు. దీంతో హాస్టల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.కాగా కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు కలకలం రేపుతున్నాయి. తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్ధులు ప్రాణాలు విడిచారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z