* 2023-24 ఆర్థిక సంవత్సరానికి (2024-25 మదింపు సంవత్సరం)గాను ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్స్‌ను దాఖలు చేస్తున్న ట్యాక్స్‌పేయర్స్‌కు సూచన. పాత పన్ను విధానాన్ని ఎంచుకునేవారు జూలై 31లోగా ఐటీఆర్‌లను దాఖలు చేయాలి. లేకపోతే పాత పన్ను విధానం ఐటీ ప్రయోజనాలు రావు. ఆగస్టు 1 నుంచి దాఖలయ్యే ఐటీఆర్‌లు కొత్త పన్ను విధానానికి లోబడే ఉంటాయి. ఈ ఏప్రిల్ 1 నుంచే 2024-25 మదింపు సంవత్సరం కోసం ఐటీఆర్‌ల దాఖలు మొదలైంది. దీంతో ఈ ఏడాది జూలై 31లోగా జరిమానా లేకుండా ఐటీ రిటర్నులను దాఖలు చేసేవారికే పాత పన్ను ప్రయోజనాలు అందుతాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్తున్నది. ఆ తర్వాత మీ ఐటీఆర్‌లు డీఫాల్ట్‌గా కొత్త పన్ను విధానంలోకే వెళ్తాయంటున్నారు.
* వేసవిలో సూర్యుడి ప్రతాపం మూలంగా మనుషులే కాదు.. మనం నిత్యం వాడే స్మార్ట్ ఫోన్ మీద కూడా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మిగిలిన సీజన్లతో పోలిస్తే వేసవిలో స్మార్ట్ ఫోన్లు వేగంగా వేడెక్కుతుంటాయి. బ్రౌజింగ్ చేసినా, గేమ్స్ ఆడినా బ్యాక్ ప్యానెల్ మొత్తం హీటెక్కిపోతుంది. అంతేకాదు.. వేసవిలో స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ వేగంలో తేడానూ గుర్తించొచ్చు. మునుపటితో పోలిస్తే ఛార్జింగ్ స్పీడ్ తగ్గడం గమనించొచ్చు. ఇంతకీ వేసవికి, ఛార్జింగ్ వేగం తగ్గడానికి ఏమైనా సంబంధం ఉంటుందా? స్మార్ట్‌ఫోన్లు రోజురోజుకూ పవర్‌ఫుల్‌గా మారుతున్నాయి. వాటి వేగం, పనితీరులో ఏయేటికాయేడు చాలావరకు మార్పులు వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ వేగం పెరిగింది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ పెరిగింది. ఒకప్పుడు సన్‌లైట్‌లోకి తీసుకెళితే స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే కనిపించేది కాదు. ఇప్పుడు డిస్‌ప్లే బ్రైట్‌నెస్ ఆ స్థాయిలో మెరుగైంది. ఇవన్నీ స్మార్ట్‌ఫోన్ హీట్‌ను పెంచేవే. దీనికితోడు బీజీఎంఐ వంటి హై ఎండ్ గేమ్స్ ఆడడం వల్ల కూడా ఫోన్ హీట్ పెరుగుతుంది. సాధారణ రోజుల కంటే వేసవిలో వేడిమి కారణంగా స్మార్ట్‌ఫోన్లు మరింత వేగంగా హీటెక్కుతాయి. స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మెన్స్‌తో పాటు బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్ చాలావరకు పెరిగింది. నిమిషాల్లోనే బ్యాటరీని ఫుల్‌ఛార్జింగ్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయితే, వేడిమి కారణంగా ఫోన్ డ్యామేజీ కాకుండా ఉండేందుకు వీటిలో డిఫెన్స్ మెకానిజం కూడా ఉంటుంది. అంటే ఫోన్ వేడిగా ఉన్నప్పుడు ఇందులోని సెన్సార్లు గుర్తిస్తాయి. అవి ఫోన్ ఛార్జింగ్ వేగాన్ని తగ్గిస్తాయి. ఒక్కోసారి మళ్లీ స్మార్ట్‌ఫోన్ ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకునేవరకు పూర్తిగా ఛార్జింగ్ కూడా అవవు. ఇలాంటి సందర్భాల్లో ఫోన్ వేడెక్కితే చల్లబర్చడానికి వెనక ఉన్న కేస్ తొలగించడం మంచిది. ఒకవేళ వైర్‌లెస్ ఛార్జర్ వాడుతున్నట్లయితే వైర్ ఛార్జింగ్ ఆప్షన్ ఎంచుకోవడం బెటర్. ముఖ్యంగా ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు గేమ్స్‌కు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు.
* దేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలు గ్రామీణ ప్రాంతాలకూ పాకాయి. చిన్న చిన్న దుకాణాలు సైతం డిజిటల్ లావాదేవీలను అందిపుచ్చుకున్నాయి. అంతమాత్రాన నగదు వినియోగం తగ్గిందనుకుంటే పొరపాటే. పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016-17 ఆర్థిక సంవత్సరంలో 13.35 లక్షల కోట్లుగా ఉన్న నగదు చెలామణీ.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.35 లక్షల కోట్లకు చేరింది. నగదు విత్ డ్రా కూడా పెరిగినట్లు సీఎంఎస్ సంస్థ వెలువరించిన కన్జంప్షన్ రిపోర్ట్ వెల్లడించింది. దేశంలో మెజారిటీ ఏటీఎంలలో నగదు నిర్వహణ బాధ్యతలను ఈ కంపెనీనే చూస్తుంటుంది. దీని ఆధారంగా తాజాగా నివేదికను విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే నెలకు సగటున ఏటీఎంల నుంచి విత్‌డ్రా అయ్యే మొత్తం (అన్ని ఏటీఎంలలో సగటున విత్‌డ్రా అయిన మొత్తం) 5.51 శాతం మేర పెరిగినట్లు సీఎంస్ తన నివేదికలో పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.1.35 కోట్లుగా ఉన్న ఈ మొత్తం రూ.1.43 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ప్రజలు ఇప్పటికీ కొనుగోళ్లకు పెద్ద మొత్తంలో నగదు వెచ్చిస్తున్నారనేది ఈ ట్రెండ్ తెలియజేస్తోంది. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థలో పెరిగిన వినియోగాన్ని సూచిస్తోందని నివేదిక పేర్కొంది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. గత వారమంతా దాదాపు లాభాల్లో కొనసాగిన సూచీలకు చివరి ట్రేడింగ్ సెషన్‌లో నష్టాలు ఎదురయ్యాయి. ఒక్కరోజు విరామం తర్వాత సూచీలు మళ్లీ భారీగా పుంజుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లాయి. ఈక్రమంలో సెన్సెక్స్ 900కు పైగా పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,600 పాయింట్ల మార్కు ఎగువన ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 73,982.75 లాభాల్లో ప్రారంభమై ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 74,721.15 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 941.12 పాయింట్లు లాభపడి 74,671.28 వద్ద ముగిసింది. నిఫ్టీ 223.45 పాయింట్ల లాభంతో 22,643.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.48గా ఉంది. సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఐటీసీ, విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్ మినహా అన్ని షేర్లూ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 88.90గా ఉంది.
* విద్యుత్తు, ఫోన్, గ్యాస్, ఇంటి అద్దె వంటి యుటిలిటీ బిల్లులు క్రెడిట్ కార్డుతో (Credit Card) చెల్లిస్తే ఒకప్పుడు సంస్థలు రివార్డులు ఇచ్చేవి. క్రమంగా పరిస్థితి మారుతోంది. అద్దెపై ఇప్పటికే సేవా రుసుము వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇతర బిల్లులకూ దీన్ని వర్తింపజేసేందుకు కొన్ని బ్యాంకులు సిద్ధమయ్యాయి. యెస్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు 2024 మే 1 నుంచి క్రెడిట్ కార్డులతో (Credit Card) చెల్లించే యుటిలిటీ బిల్లులపై 1 శాతం రుసుము వసూలుచేయనున్నాయి. ఉదాహరణకు రూ.1,500 విద్యుత్తు బిల్లు యెస్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే రూ.15 రుసుము అదనంగా భరించాల్సి ఉంటుంది. ఇది అందరికీ వర్తించదు. యెస్ బ్యాంకులో అయితే నెలవారీ యుటిలిటీ బిల్లుల (Utility Bills) విలువ రూ.15,000 దాటితే ఒక శాతం అదనపు రుసుము వర్తిస్తుంది. అంటే ఫోన్, విద్యుత్తు, టీవీ, అద్దె ఇలా వివిధ యుటిలిటీ బిల్లుల చెల్లింపు మొత్తం రూ.15 వేలు దాటిందనుకుందాం. తర్వాత కూడా మళ్లీ ఏదైనా యుటిలిటీ బిల్లు చెల్లించాల్సి వస్తే అదనపు ఫీజు తప్పదు. ఐడీఎఫ్‌సీ బ్యాంకు విషయంలో ఈ పరిమితి రూ.20వేలుగా ఉంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z