సోనీ మరో కొత్త స్మార్ట్ గ్యాడ్జెట్‌ను ఇటీవల విడుదల చేసింది. ధరించగలిగే చిన్న ఏసీ (Wearable Air Conditioner) డివైజ్‌ను తీసుకొచ్చింది. మెడపై తగిలించుకొని ఎక్కడికైనా దీన్ని తీసుకెళ్లొచ్చు. ఇది చలి, వేసవి కాలాల్లో ఉపయోగకరంగా ఉంటుంది. రియాన్ పాకెట్-5 పేరిట దీన్ని ప్రవేశ పెట్టింది. రియాన్ పాకెట్‌ను ఆన్ చేయగానే అది మన శరీర, పరిసరాల ఉష్ణోగ్రతను సరిపోలుస్తుంది. ఆటోమేటిక్‌గా కూలింగ్ లేదా వార్మింగ్ టెంపరేచర్‌ను సెట్ చేస్తుంది. ప్రత్యేకంగా మనం నియంత్రించాల్సిన అవసరమేమీ ఉండదు. మన కదలికలకు బట్టి అక్కడి పరిసరాలకు అనుగుణంగా ఉష్ణోగ్రతలను మారుస్తుంది. కావాలనుకుంటే మొబైల్ యాప్‌లో ప్రత్యేకంగా కమాండ్స్ ఇచ్చే ఫీచర్ కూడా ఉంది.
ఈ డివైజ్‌ను ప్రత్యేకంగా ఆన్/ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. మెడపై పెట్టుకోగానే పనిచేయడం ప్రారంభిస్తుంది. తీసి పక్కనపెడితే ఆగిపోతుంది. ఉష్ణోగ్రత, తేమ, కదలికలను పసిగట్టడం కోసం రియాన్ పాకెట్‌లో మొత్తం ఐదు సెన్సర్లు ఉంటాయి. దీనితో పాటు ఒక పాకెట్ ట్యాగ్‌ను కూడా ఇస్తారు. దాన్ని ముందు జేబులో వేసుకుంటే చాలు. పరిసరాల్లో ఉష్ణోగ్రతను గుర్తించి రియాన్ పాకెట్‌కు చేరవేస్తుంది. ట్యాగ్ లేకున్నా ఈ డివైజ్ పనిచేస్తుంది. అది కేవలం ఉష్ణోగ్రతను మరింత కచ్చితత్వంతో అంచనా వేయడానికి మాత్రమే. ఈ డివైజ్ బ్యాటరీ లైఫ్ గరిష్ఠంగా 17 గంటలు. ధర 1,499 హాంకాంగ్ డాలర్లు (14940 Rupees). ప్రస్తుతానికి ఇది భారత్‌లో అందుబాటులో లేదు. నిజానికి దీన్ని సోనీ 2019లోనే తీసుకొచ్చింది. క్రమంగా అప్‌డేటెడ్ వెర్షన్లను విడుదల చేస్తోంది. అయితే, తీసుకొచ్చిన ప్రతిసారీ కొత్త మార్కెట్లలోకి విస్తరిస్తోంది. తాజా రియాన్ పాకెట్-5ను ఐరోపాలో విడుదల చేసింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z