* బంగారం ధరలు పెరిగినా.. కొనుగోళ్లు ఏమాత్రం తగ్గలేదు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశవ్యాప్తంగా పసిడి గిరాకీ వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరిగి 136.6 టన్నులకు చేరింది. బలమైన ఆర్థిక పరిస్థితులే అందుకు కారణమని ప్రపంచ స్వర్ణ మండలి (WGC) పేర్కొంది. ఆర్‌బీఐ పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం కూడా డిమాండ్ పుంజుకోవడానికి దోహదం చేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో బంగారం (Gold) డిమాండ్ విలువ పరంగా క్రితం ఏడాదితో పోలిస్తే 20 శాతం పెరిగి రూ.75,470 కోట్లకు చేరింది. మొత్తం పసిడి గిరాకీలో ఆభరణాల వాటా 95.5 టన్నులు. ఇది వార్షిక ప్రాతిపదికన నాలుగు శాతం పెరిగింది. పెట్టుబడుల కోసం కొనుగోలు చేసే బంగారం (కడ్డీలు, నాణేలు.. ఇతరత్రా) 19 శాతం పుంజుకొని 41.1 టన్నులకు చేరింది. భారత్‌లో కొనసాగుతున్న బలమైన స్థూల ఆర్థిక వాతావరణమే బంగారు ఆభరణాల గిరాకీకి దోహదం చేసిందని డబ్ల్యూజీసీ ఇండియా సీఈఓ సచిన్ జైన్ తెలిపారు. మార్చిలో ధరలు ఒక్కసారిగా పెరగటంతో చివర్లో విక్రయాలు నెమ్మదించాయని వెల్లడించారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం రాణించిన సూచీలు.. గరిష్ఠాల వద్ద మదుపరులు అమ్మకాలకు దిగడంతో ఆఖర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా చివరి అరగంటలో సూచీలు ఒక్కసారిగా భారీగా కుదుపునకు లోనయ్యాయి. దీంతో ఇంట్రాడేలో 22,783.35 వద్ద సరికొత్త గరిష్ఠాలకు అందుకున్న నిఫ్టీ మళ్లీ 22,600 స్థాయికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 74,800 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. దాదాపు రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 75,111.39 పాయింట్ల వద్ద గరిష్ఠాలను తాకిన సూచీ.. తర్వాత కుదేలైంది. చివరికి 188.50 పాయింట్ల నష్టంతో 74,482.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 38.55 పాయింట్ల నష్టంతో 22,604.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.43గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడగా.. టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సన్‌ఫార్మా ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 88.53 డాలర్లుగా కొనసాగుతోంది.
* ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రోకు (Wipro) కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా నియమితులయ్యారు. థియరీ డెలాపోర్టే రాజీనామా అనంతరం కంపెనీ కొత్త సీఈఓగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి 2025 జులై వరకు డెలాపోర్టే పదవీకాలం ఉండగా.. ఏడాదిముందే నిష్క్రమించారు. ఈనేపథ్యంలో కొత్త సీఈఓగా పల్లియా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా శ్రీనివాస్ వేతనం వివరాలు కంపెనీ సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడయ్యాయి. విప్రో కొత్త సీఈఓగా ఏడాదికి నగదు రూపంలో గరిష్ఠంగా 6 మిలియన్ డాలర్ల చొప్పున శ్రీనివాస్ పల్లియా వేతనం అందుకోనున్నారు. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.50 కోట్లు అన్నమాట. ఇందులో పల్లియా బేసిక్ వేతనం 1.75 మిలియన్ డాలర్ల నుంచి 3 డాలర్ల మధ్య ఉంటుంది. దీంతో పాటు వేరెబుల్‌పే రూపంలో 1.75 డాలర్ల నుంచి 3 మిలియన్ డాలర్ల మధ్య పొందనున్నారు. కంపెనీ సాధించిన ప్రగతి ఆధారంగా ఈ చెల్లింపులు రానున్నాయి. అంటే కంపెనీ ఆదాయం, లాభం, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం మేరకు ఈ చెల్లింపులు ఉంటాయి.
* వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాలను విక్రయించగా పొందిన లాభాలపై పన్ను మినహాయింపునకు అనుమతిస్తూ ఇటీవల ‘ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ITAT)’ బెంగళూరు బెంచ్ తీర్పు వెలువరించింది. సెక్షన్ 54ఎఫ్ (Section 54F) కింద ఓ వ్యక్తి చేసుకున్న క్లెయిమ్‌ను ఐటీ సమీక్షాధికారి తిరస్కరించగా.. ఐటీఏటీ దానిపై విచారణ జరిపింది. వారసత్వంగా వచ్చిన బంగారాన్ని విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని ఇంటి కొనుగోలుకు ఉపయోగిస్తే.. దానిపై దీర్ఘకాల మూలధన లాభాల (LTCG) పన్ను మినహాయింపు ఉంటుందని ఐటీఏటీ స్పష్టంచేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆదాయాన్ని ఇతర వనరుల నుంచి వచ్చిన మొత్తంగా పరిగణించడానికి వీల్లేదని తేల్చింది. పూర్వీకుల నుంచి వచ్చిన దీర్ఘకాల మూలధన ఆస్తిగానే లెక్కలోకి తీసుకోవాలని స్పష్టంచేసింది.
* మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఇండోనేషియా ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడానికి 1.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటాంచారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌తో కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో కీలక మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. మంగళవారం సత్యనాదెళ్ల ఆర్చిపెలాగో సంస్థ అధ్యక్షుడు జాన్‌ఫ్లడ్‌తో సమావేశం తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండోనేషియా ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. దాదాపు 28 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ఏఐ డేటా సెంటర్‌ల ఏర్పాటుకు డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దాంతో కంపెనీ ఈ చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇండోనేషియా పర్యటనలో భాగంగా సత్యనాదెళ్ల జకార్తా అధ్యక్షుడు జోకో విడోడోతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడారు. ‘ఇండోనేషియాలో దాదాపు 1.7 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్లు, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. తరువాతి తరం ఏఐ మౌలిక సదుపాయాలు భవిషత్తులో ఎంతో ఉపయోగపడనున్నాయి. ఇండోనేషియాలోని ప్రతి సంస్థ లార్జ్ ఏఐను సద్వినియోగం చేసుకోవాలి. సమీప భవిష్యత్తులో సంస్థ వేలమందికి ఏఐ శిక్షణ ఇవ్వబోతుంది. 2025 నాటికి ఏషియా ప్రాంతంలో దాదాపు 2.5 మిలియన్ల మందికి ఇందులో శిక్షణ ఇవ్వబోతున్నాం’ అని అన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z