యూకేలోని స్కాట్లాండ్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకే (TAS-UK) ఆధ్వర్యంలో ఏప్రిల్ 27న నిర్వహించిన వేడుకల్లో పెద్దసంఖ్యలో ఎన్నారైలు పాల్గొని సందడి చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా గడిపారు. అలాగే, 2024-26 కాలానికి కొత్తగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించారు. ఎడిన్బర్గ్ కాలేజ్ -గ్రాంటన్ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది తెలుగువారు హాజరై తమ ఐక్యతను చాటుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా భారత కాన్సుల్ జనరల్ బిజయ్ సెల్వరాజ్, లోథియన్ ప్రాంతానికి చెందిన ఎంఎస్పీలు సారా బోయాక్, ఫోయ్సోల్ చౌదరి, కొల్లిన్టన్ కౌన్సిలర్ స్కాట్ ఆర్థర్ సహా పలువురు ప్రముఖులు గౌరవ అతిథులుగా విచ్చేశారు. గొప్ప సాంస్కృతిక వైవిధ్యం ఉన్న ఎడిన్బర్గ్ లాంటి నగరంలో ఉగాదిని జరుపుకోవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సిలికానాంధ్ర వారి ‘మనబడి’ ద్వారా తెలుగు నేర్చుకునే పిల్లలు “మా తెలుగు తల్లికి” ప్రార్థనాగీతంతో వేడుకలు మొదలయ్యాయి. 2022-24 కాలానికి గాను సాంస్కృతిక కార్యదర్శిగా వ్యవహరించిన విజయ్ కుమార్ పర్రి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అతిథులు, ముఖ్యఅతిథులు, ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రూప్ డ్యాన్స్‌లు, సోలో గానం, తెలుగు కవితల పారాయణం, అనంత్ రామానంద్ గార్లపాటి చేసిన ముఖ్యమైన ఉగాది పంచాంగంతో సహా మంత్రముగ్దులను చేసే ప్రదర్శనలతో వేదిక ఆకర్షణీయంగా మారింది. ఐదుగురు గాయకులు, ఐదుగురు బ్యాండ్ ప్లేయర్లతో కూడిన స్థానిక భారతీయ బ్యాండ్ “వాయిస్ ఆఫ్ ఎకో” ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. హోస్ట్‌లుగా సత్య శ్యామ్ జయంతి, రంజిత్ నాగుబండి, శ్రుతి పల్లెమోని, స్రవంతి పొట్లూరి, హిమజా మాచిరాజు రోజంతా జరిగే ఈ కార్యక్రమంలో తమదైన నైపుణ్యంతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు. తమ చమత్కార పరిహాసం, ఆకర్షణీయమైన సంభాషణలతో వినోదభరిత వాతావరణాన్ని నింపారు.
సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు సంప్రదాయ, సమకాలీన దుస్తుల్లో వివిధ రుతువుల పోకడలను ప్రదర్శించేలా ఫ్యాషన్ షో ఏర్పాటుచేశారు. ఎడిన్బర్గ్ దీపావళి, కన్నడ అసోషియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ – ఎడిన్బర్గ్, ఎడిన్బర్గ్ హిందు మందిర్ అండ్ కల్చరల్ సెంటర్, ఇండియన్ ఆర్ట్స్ కనెక్షన్, 3 గుడ్ డీడ్స్, స్కాటిష్ ఇండియన్ ఆర్ట్స్ ఫోరం, ఒడిశా సొసైటీ ఆఫ్ స్కాట్లాండ్, బిహార్ కమ్యూనిటీ, స్కాటిష్ ఇండియన్ ముస్లిం అసోషియేషన్ వంటి ఇతర భారతీయ సంఘాల అతిథులు చేరడం ఔత్సాహికుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ వేడుకలు విజయవంతం కావడంలో ప్రధాన స్పాన్సర్లు బ్రైటర్ మార్ట్గేజెస్, బెల్లి ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్, సహ-స్పాన్సర్ అల్లి భవన్ కీలక పాత్ర పోషించారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఛైర్‌పర్సన్‌గా శివ చింపిరి ఎన్నిక కాగా.. అధ్యక్షుడిగా ఉదయ్ కుమార్ కుచాడి, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్ గడ్డం, సంయుక్త కార్యదర్శిగా నిరంజన్ నూక, కోశాధికారిగా విజయ్ కుమార్ పర్రి ఎన్నికయ్యారు. అలాగే, మాధవీలత దండూరి (మహిళా, ప్రాజెక్టుల కార్యదర్శి), పండరి జైన్ కుమార్ పోలిశెట్టి (కల్చరల్ సెక్రెటరీ), బాలాజీ కర్నాటి (క్రీడా కార్యదర్శి), రాజశేఖర్ సాంబ (యువజన శాఖ కార్యదర్శి), జాకీర్ షేక్ (ఐటీ కార్యదర్శి), నరేష్ దీకొండ (పీఆర్ కార్యదర్శి)లను సభ్యులకు పరిచయం చేశారు. మాజీ ఛైర్పర్సన్ మైథిలి కెంబూరి చేసిన గణనీయమైన కృషికి గుర్తింపుగా ఆమెను సత్కరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z