DailyDose

దిశా ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై చర్యలు వద్దు-CrimeNews-May 01 2024

దిశా ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై చర్యలు వద్దు-CrimeNews-May 01 2024

* ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన పోలీసు హోంగార్డు తాను పనిచేస్తోన్న పోలీస్‌స్టేషన్‌లోనే చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనీ పట్టణంలో జరిగింది. పట్టణ రెండో పోలీసు స్టేషన్లో వివిధ కేసుల్లో పట్టుబడిన నగదును బీరువా లాకర్లో భద్రపరుస్తుంటారు. ఆ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు మనోజ్‌.. పోలీసు అధికారులతో సన్నిహితంగా ఉండేవాడు. దీంతో బీరువా తాళాలు అతడికి ఇచ్చి ఫైల్స్‌ తీసుకురమ్మని చెప్పేవారు. ఈ క్రమంలో బీరువాలో ఉంచిన నగదును చూసిన మనోజ్‌.. అందులోని రూ.5.63లక్షలు కాజేశాడు. ఈ విషయం గుర్తించిన పోలీసులు హోంగార్డుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిందితుడి నుంచి రూ.3లక్షల నగదు రికవరీ చేసి, రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.

* దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో పోలీసులకు ఊరట లభించింది. సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికపై ఏడుగురు పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. పోలీసులు, షాద్‌నగర్‌ తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిర్పూర్కర్‌ కమిషన్‌ వేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించి పలువురిని విచారించిన కమిషన్‌.. ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సూచించింది. పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారించాలని పేర్కొంది. కమిషన్‌ నివేదిక సరిగ్గా లేదని పోలీసులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈమేరకు తీర్పు వెలువరించింది.

* ఐస్‌గా భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌నంద్‌గావ్‌ ప్రాంతంలో జరిగిన వివాహానికి మూడేళ్ల పిల్లాడు ఖుశాంత్ సాహు తన కుటుంబంతో కలిసివెళ్లాడు. వివాహ వేడుకలో స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం నిర్వాహకులు డ్రై ఐస్ ను ఉపయోగించారు. ఐస్‌గా భావించిన ఓ చిన్నారి దానిని తిన్నాడు. అనంతరం బాలుడు అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మరణించినట్లుగా వైద్యులు తెలిపారు.

* ఒక స్కూల్‌ హాస్టల్‌లో బాలికపై అత్యాచారం (Girl Raped) జరిగింది. బాలికకు డ్రగ్స్‌ ఇచ్చిన కొందరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సిట్‌ దర్యాప్తునకు సీఎం ఆదేశించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న 8 ఏళ్ల బాలికపై హాస్టల్‌లో అత్యాచారం జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేస్తామని చెప్పారు. బాలికకు డ్రగ్స్‌ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

* తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. సేలం (Salem)లోని ఏర్కాడ్‌లో ఓ ప్రైవేట్‌ బస్సు లోయలో పడిపోయింది (Bus Falls Into Gorge). ఈ ఘటనలో సుమారు నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు 56 మంది ప్రయాణికులతో ఏర్కాడ్‌ (Yercaud) నుంచి సేలం వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు 13వ హెయిర్‌పిన్‌ బెండ్‌ వద్దకు రాగానే డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు ఒక్కసారిగా సైడ్‌ వాల్‌ను ఢీ కొట్టి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 20 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏర్కాడ్‌ పోలీసులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z