Politics

ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు-NewsRoundup-May 02 2024

ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు-NewsRoundup-May 02 2024

* అనుకున్నట్లే జరిగింది. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ (Brij Bhushan)ను ఈ ఎన్నికల్లో (Lok Sabha Elections) భారతీయ జనతా పార్టీ (BJP) పక్కనబెట్టింది. అయితే ఆ స్థానంలో ఆయన కుమారుడికి టికెట్‌ కల్పించింది. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ స్థానం నుంచి కరణ్‌ భూషణ్‌ సింగ్‌ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక రాయబరేలీ (Raebareli) నుంచి దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ను నిలబెట్టింది.

* రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌మీనా తెలిపారు. విజయవాడలోని ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్టు చెప్పారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు అవకాశం కల్పిస్తాం’’ అని అన్నారు.

* అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్‌ వెళ్తోన్న కంటైనర్లను ముందస్తు సమాచారంతో పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఒక్కో కంటైనర్‌లో రూ.500 కోట్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. నాలుగు కంటైనర్లలో రూ.2వేల కోట్లు ఉన్నాయని వెల్లడించారు.

* మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని తీర్పునిచ్చింది. నాంపల్లి కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సవాల్‌ చేస్తూ.. భానుకిరణ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. కింది కోర్టు ఆదేశాలను సమర్థించింది. భానుకిరణ్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. యావజ్జీవ శిక్ష అమలుకు ఆదేశాలు జారీ చేసింది.

* ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్‌ సమయంలో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా కోరింది. మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో.. ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదని, స్వల్ప మార్పులు చేయాలని ఆ పార్టీ సీనియర్‌ నేత కనకమేడల రవీంద్రకుమార్‌ ఈసీకి లేఖ రాశారు.

* కొన్నేళ్ల క్రితం ఓ కుర్రాడు తన సంగీతం, రచనలతో ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అందరూ ఆ విషయం మర్చిపోయారు. ఇటీవల అతడు తన భార్యతో కలిసి హోలీ కార్యక్రమంలో ఉండగా అతడికి ఎంపీ టికెట్‌ ఖాయమైనట్లు తెలిసింది. హఠాత్తుగా శుభాకాంక్షలు వెల్లువెత్తడంతో ఏమిటా అని చూడగా.. తనకు ఎంపీ టికెట్‌ వచ్చినట్లు తెలిసి ఆశ్చర్యపోయాడు.

* పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని చూస్తోన్న భాజపా.. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అనేక నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అసన్‌సోల్‌ స్థానంపై దృష్టిసారించింది. నల్ల బంగారానికి (బొగ్గు గనులకు) నిలయమైన ఈ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోంది.

* వాట్సప్‌ కమ్యూనిటీ కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గ్రూప్ మెసేజ్‌లలో ఈవెంట్‌లను ప్లాన్ చేయడానికి, నిర్వహించడానికి వాట్సప్‌ (WhatsApp) కొత్త మార్గాన్ని తీసుకొచ్చింది. తద్వారా స్నేహితులు, స్కూళ్లు, సన్నిహితులతో వర్చువల్, వ్యక్తిగత సమావేశాలను సెటప్ చేయడాన్ని మరింత సులభతరం చేస్తోంది.

* ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా వెంకంపేటలో కూటమి అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. నదుల అనుసంధానానికి భాజపా కట్టుబడి ఉందని చెప్పారు

* ఐపీఎల్ 17వ సీజన్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇప్పటికే 500 పరుగులు రాబట్టాడు. బెంగళూరు భారీ స్కోరు సాధించడంలో అతడిదీ కీలక పాత్రే. మరోవైపు ప్లేఆఫ్స్‌ బెర్తుకు దాదాపు ఆర్సీబీ దూరమైంది. దీంతో విరాట్ తక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం వల్లే ఇదంతా అని విమర్శకులు తమ నోళ్లకు పనిజెప్పారు. ఇలాంటివాటికి బెంగళూరు ఒకప్పటి సహచరుడు, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ‘‘ఈ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ విరాట్ కోహ్లీ. రుతురాజ్‌ ఆరెంజ్‌ క్యాప్‌ అందుకోనంతవరకూ కోహ్లీ వద్దే ఉంది. అయినా, అతడి స్ట్రైక్‌రేట్‌పై తీవ్రంగా విమర్శలు రావడం ఆశ్చర్యానికి గురి చేశాయి. టోర్నీ ఆరంభం నుంచీ ఇవే మాటలు విని విసిగిపోయా. ఈ విమర్శలపై ఘాటుగా స్పందించాలని అనుకుంటున్నా. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో కోహ్లీ ఒకరు. అతడి గణాంకాలను చూస్తే అర్థమైపోతుంది. కానీ, అతడి స్ట్రైక్‌రేట్‌ను విమర్శిస్తున్న చాలామంది క్రికెట్‌ పండితులు కనీసం కోహ్లీ ఆడిన మ్యాచుల్లో సగం కూడా ఆడి ఉండరు. ఆటపట్ల వారికి సరైన అవగాహన లేదనుకుంటా. అసలు ఎన్ని మ్యాచ్‌లు ఆడారు? ఐపీఎల్‌లో ఎన్ని సెంచరీలు చేశారు?’’ అని ఏబీడీ ప్రశ్నించాడు. టీ20 ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన జట్టులో విరాట్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే.

* నటి అదితిరావు హైదరీ (Aditi rao Hydari)-సిద్ధార్థ్‌ (Siddharth)ల నిశ్చితార్థం గత నెలలో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై అదితి స్పందించారు. మీడియా వాళ్లకు వెల్లడించడానికి గల కారణాన్ని తెలిపారు. తన తల్లి కోరికమేరకు నిశ్చితార్థం జరిగినట్లు పోస్ట్‌ పెట్టానన్నారు. ‘‘జీవితంలో జరిగే ముఖ్యమైన వాటిని ప్రత్యేక ప్రదేశంలో చేసుకోవాలని అందరూ అనుకుంటారు. నేను నా నిశ్చితార్థాన్ని 400 ఏళ్ల నాటి గుడిలో చేసుకున్నాను. ఆ దేవాలయంతో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. మా అమ్మ కారణంగానే ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను పోస్ట్‌ చేశాను. మా పెళ్లి గురించి తెలుసుకోవాలని ఎంతోమంది మా అమ్మకు ఫోన్లు చేశారు. నిరంతరం వచ్చిన కాల్స్‌కు ఆమె సమాధానం చెప్పలేకపోయింది. ‘దయచేసి నీ ఎంగేజ్‌మెంట్ విషయం మీడియాకు వెల్లడించు’ అని కోరింది. దీంతో నేను, సిద్ధార్థ్‌ దీనిపై పోస్ట్‌లు పెట్టాం’’ అని అదితిరావు తెలిపారు. మార్చి 27న వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, అతితక్కువమంది బంధువుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు.

* రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌మీనా తెలిపారు. విజయవాడలోని ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్టు చెప్పారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు అవకాశం కల్పిస్తాం. ఓటర్ల సంఖ్య 1500 దాటితే ఆక్సిలరీ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో 224 ఆక్సిలరీ పోలింగ్‌ కేంద్రాల కోసం ఈసీకి ప్రతిపాదనలు పంపాం.

* వృద్ధులు, వికలాంగులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వచ్చిన వృద్ధులు, వికలాంగుల్లో చాలా మందికి తమ ఖాతాల్లో పింఛన్‌ డబ్బు జమ కాకపోవడంతో లబోదిబో మంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో 7,989 పింఛన్లకుగాను 2,377 మంది లబ్ధిదారులకు ఇంటింటికీ అందజేశారు. మిగిలిన 5,612 మందికి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశామని చెప్పడంతో వారంతా బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు.

* మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, హసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)పై రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు 400 మంది మహిళలపై ప్రజ్వల్‌ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, వారి వీడియోలు చిత్రీకరించాడని అన్నారు. అటువంటి వ్యక్తికి ఓట్లు వేయాలని కోరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశ మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. శివమొగ్గలో జరిగిన ఎన్నికల (Lok Sabha Elections) ప్రచార సభలో పాల్గొన్న ఆయన ప్రజ్వల్‌ను మాస్‌ రేపిస్ట్‌ (Mass Rapist)గా పేర్కొన్నారు. ‘ప్రజ్వల్‌ రేవణ్ణ 400 మంది మహిళలపై అఘాయిత్యానికి (Rape) పాల్పడి, వారి వీడియోలు చిత్రీకరించాడు. ఇది సెక్స్‌ కుంభకోణం కాదు. ఇది అతిపెద్ద అత్యాచార ఘటన (Mass Rape). ఓట్ల గురించి వాళ్లు (భాజపా కూటమి) అడుగుతున్నప్పుడు ప్రజ్వల్‌ ఏం చేశాడో ప్రతీ మహిళ తెలుసుకోవాలి. అతడి గురించి ప్రధానికి ముందే తెలుసు. అటువంటి వ్యక్తికి కర్ణాటక వేదికగా మోదీ మద్దతు పలికారు’ అని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

* కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. జనసేన నేత కర్రి మహేశ్‌ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. గురువారం ఉదయం మచిలీపట్నం విశ్వబ్రాహ్మణ కాలనీలో పేర్ని క్రిష్ణమూర్తి(కిట్టు) ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ సమయంలో కొందరు వైకాపా కార్యకర్తలు మహేశ్‌ ఇంటి ఎదుట బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదేమిటని ప్రశ్నించిన మహేశ్‌ కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డారు. ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేయడంతో పాటు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న జనసేన, తెదేపా నాయకులు బాధితులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తెదేపా, జనసేన, మహేశ్‌ కుటుంబ సభ్యులు స్టేషన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధితులకు మచిలీపట్నం తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన నేత బండి రామకృష్ణ తదితరులు సంఘీభావం తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z