* టెక్ దిగ్గజం, ప్రముఖ సెర్చ్‌ఇంజిన్ గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపు (Google Layoff) కొనసాగుతున్నది. కాస్ట్ కటింగ్ పేరుతో పైథాన్ టీమ్ మొత్తాన్ని ఎత్తేసిన గూగుల్ తాజాగా సుమారు 200 మందిపై వేటువేసింది. వీరంతా కోర్ టీమ్‌లో సభ్యులని, గత నెల 25కు ముందే వీరందరిని తొలగించినట్లు ఓ నివేదిక పేర్కొంది. వీరిలో కాలిఫోర్నియా, సన్నీవేల్‌లోని ఆఫీసుల్లోని ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపింది. అమెరికా వెలుపల చౌకగా ఉద్యోగులు లభిస్తుండటంతో ఈ పోజిషన్లను భారత్, మెక్సికోకు బదిలీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పైథాన్, ఫ్లుట్టర్, డార్ట్‌లపై పనిచేసే బృందాల్లోని చాలా మంది ఉద్యోగులను గూగుల్ కంపెనీ తొలగించింది. వారికి కంపెనీలోనే ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించామని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
* వాహన అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. నూతన ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే వాహన అమ్మకాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటంతోపాటు సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో స్వల్పంగా ప్రభావం చూపాయి. మొత్తంగా గత నెలలో 3,38,341 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 3,32,468లతో పోలిస్తే 1.77 శాతం పెరిగాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్‌లు సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసుకోగా, టాటా మోటర్స్, టయోటా కిర్లోస్కర్ రెండంకెల వృద్ధిని సాధించాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
* తులం బంగారం ధర రూ.2 లక్షల మార్కును తాకబోతున్నదా?.. దేశీయ గోల్డ్ మార్కెట్‌ను ఈ అంచనా ఇప్పుడు షేక్ చేస్తున్నది. అవును.. ప్రస్తుతం రికార్డు స్థాయి దరిదాపుల్లో కదలాడుతున్న పసిడి రేట్లు.. మున్ముందు మరింత పెరుగుతాయంటున్నారు. ఈ క్రమంలోనే 10 గ్రాముల 24 క్యారెట్ పుత్తడి విలువ లక్ష రూపాయలు కాదు.. ఏకంగా రూ.2 లక్షలు పలుకుతుందని ట్రేడింగ్ వర్గాలు చెప్తుండటం గమనార్హం.
* విలాసవంతమైన గృహాల కార్యకలాపాల్లో హైదరాబాద్‌కు మూడో స్థానం లభించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మొదటి స్థానంలో ఉండగా, రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానం హైదరాబాద్‌కు దక్కిందని సీబీఆర్‌ఈ తాజాగా వెల్లడించింది. ఇండియా మార్కెట్ మానిటర్ క్యూ1-2024 పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. రూ.4 కోట్ల నుంచి రూ.20 కోట్ల లోపు విలువచేసే వ్యక్తిగత గృహాలు, అపార్ట్‌మెంట్లు అమ్మకాలు 10 శాతం వృద్ధిని సాధించాయి.
* యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ లావాదేవీలు 2024 మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో తగ్గాయి. మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్యలో నెలవారీగా 1 శాతం, మొత్తం విలువలో 0.7 శాతం తగ్గినట్లు ఎన్‌పీసీఐ వెల్లడించింది. మార్చిలో రూ.19.78 ట్రిలియన్లుగా నమోదైన యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ ఏప్రిల్‌లో రూ.19.64 ట్రిలియన్‌లకు చేరింది. మార్చిలో మొత్తం 13.44 బిలియన్ల సంఖ్యలో జరిగిన లావాదేవీలు ఏప్రిల్‌లో 13.3 బిలియన్లకు తగ్గింది. తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) లావాదేవీలు మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో 7 శాతం(రూ.6.35 ట్రిలియన్ల నుంచి రూ.5.92 ట్రిలియన్లు), విలువలో 5 శాతం(581 మిలియన్ల నుంచి 550 మిలియన్లు) తగ్గాయి. ఏప్రిల్‌లో ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలు విలువలో 3 శాతం (మార్చిలో రూ.5,939 కోట్ల నుంచి ఏప్రిల్‌లో రూ.5,592 కోట్లు) తగ్గాయి. వాల్యూమ్‌లో 6 శాతం.. మార్చిలో 339 మిలియన్లతో పోలిస్తే ఏప్రిల్‌లో 328 మిలియన్లకు తగ్గాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z