విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. అమెరికాలో ఫాల్ సీజన్‌కు సంబంధించిన సెమిస్టర్ ఆగస్టు-సెప్టెంబరు మధ్య ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు అమెరికా వెళుతుంటారు. వీసా ఇంటర్వ్యూ తేదీల కోసం గత కొంతకాలంగా ఎంతోమంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని రాయబార కార్యాలయంతోపాటు హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, ముంబయి కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థులకు సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ కార్యాలయం అధికారి ప్రతినిధి ‘ఈనాడు’కు తెలిపారు. ‘‘అమెరికా-భారత్ ప్రజల మధ్య ఉన్న లోతైన సంబంధాల దృష్ట్యా భారత్‌కు అమెరికా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2023లో రికార్డుస్థాయిలో 11 లక్షల నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను భారతీయులకు అమెరికా జారీచేసింది. 3.75 లక్షల మందికి పిటిషన్ ఆధారిత తాత్కాలిక ఉపాధి వీసాలను (హెచ్1బీ) కూడా జారీ చేసింది. భారతీయుల నుంచి వీసాల కోసం డిమాండ్ భారీగా ఉంటుంది. దాన్ని అధిగమించేందుకు హైదరాబాద్‌లో 300 మిలియన్ డాలర్ల వ్యయంతో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం.
స్టెమ్ కోర్సులతో పాటు పలు వినూత్న కోర్సులపైనా భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్, మెకానికల్, మైక్రో ఇంజినీరింగ్‌తోపాటు కంప్యూటర్ కోర్సులైన ఏఐ, రోబోటిక్స్‌లకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడిప్పుడే సైకాలజీ సబ్జెక్టుపైనా మొగ్గు చూపుతున్నారు. అమెరికా-భారతీయ విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్న డ్యూయల్ డిగ్రీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2022-23 గణాంకాల ప్రకారం అమెరికాలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కు సంబంధించి 69,062 మంది విద్యార్థులతో భారతదేశం అగ్రగామిగా ఉంది. వరుసగా మూడో సంవత్సరం కూడా ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ విద్యార్థులు పెద్దసంఖ్యలో అమెరికాలో చదువుకునేందుకు వెళ్లారు’’ అని అధికార ప్రతినిధి వివరించారు. అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య తాజాగా 2,68,923కు చేరింది. ఇది ఆల్‌టైమ్ రికార్డుగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలో చదువుకుంటున్న ప్రతి మిలియన్ విదేశీ విద్యార్థుల్లో 25% మంది భారతీయులే ఉంటున్నారు. 2023లో గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య 63% పెరిగింది. అండర్ గ్రాడ్యుయేట్స్ 16% పెరిగారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z