* వైకాపా ప్రభుత్వం యువతను గంజాయి మత్తుకు బానిస చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని, ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పవన్ ప్రసంగించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం గళమెత్తిన పార్టీ జనసేన అని తెలిపారు.
* మచిలీపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదైంది. గురువారం బందరు 8వ డివిజన్ విశ్వబ్రాహ్మణ కాలనీలో వైకాపా నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు చొరబడి దాడి చేశారు. ఈ ఘటనలో పేర్ని కిట్టుతో పాటు మొత్తం ఆరుగురిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
* భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయనకు రూ.50 వేల జరిమానా విధించింది.
* పింఛన్ పంపిణీలో వైకాపా ప్రభుత్వ కుట్రలకు రెండోరోజూ అవ్వాతాతలు అల్లాడిపోతున్నారు. మలమలమాడిపోయే ఎండలో పింఛన్ డబ్బుల కోసం బ్యాంకుల వద్ద విలవిల్లాడుతున్నారు. ఇంట్లోంచి కదల్లేని వారి పరిస్థితి దయనీయంగా ఉంది. పండుటాకుల్ని ప్రభుత్వం అవస్థలు పెడుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు.
* ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి తమ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ (Modi) వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాహుల్ కొత్త సీటు వెతుక్కుంటారని తాను ముందే చెప్పానని గుర్తుచేశారు. పశ్చిమ్ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
* వివేకా హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 16న జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
* సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి తెలిపారు. పంద్రాగస్టు లోగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేస్తే.. రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
* గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠకు కాంగ్రెస్ తెరదించింది. అమేఠీ పోటీ నుంచి గాంధీలు దూరం జరగ్గా.. రాయ్‌బరేలీ నుంచి మాత్రం రాహుల్ (Rahul Gandhi) సిద్ధమయ్యారు. ఇక్కడివరకు ఎలాఉన్నా.. ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) పోటీ చేయనున్నారనే వార్తలు వచ్చినప్పటికీ, ఈ ఎన్నికల బరిలో ఆమె నిలవలేదు.
* జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. కేవలం పవన్‌ను తిట్టించేందుకే సీఎం జగన్ తన తండ్రిని వాడుకుంటున్నారని విమర్శించారు. పిఠాపురంలో పవన్ విజయం కోసం కృషి చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానంటూ ఇటీవల ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రాంతి స్పందించారు.
* ప్లేఆఫ్స్ రేసులో కోల్‌కతా రెండో స్థానంలో ఉంది. తన ప్లేస్‌ను పదిలం చేసుకొనేందుకు సిద్ధమవుతోంది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబయితో తలపడనుంది. చివరిసారిగా పన్నెండేళ్ల కిందట ఈ మైదానంలో విజయం సాధించిన కేకేఆర్ ఇప్పటివరకు మళ్లీ గెలవలేదు. మరోవైపు ముంబయి పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. అయితే, ఐపీఎల్ చరిత్రలో తనను భయపెట్టిన బ్యాటర్ ముంబయి జట్టులోనే ఉన్నాడని కోల్‌కతా మెంటార్ గౌతమ్‌గంభీర్ (Gautam Gambhir) వెల్లడించాడు. ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ సహా చాలామంది క్రికెటర్లతో ఆడినప్పటికీ రోహిత్ శర్మను (Rohit Sharma) ఆపడం చాలా కష్టంగా ఉండేదని గంభీర్ గుర్తు చేసుకున్నాడు.
* దిల్లీ పీఠం దక్కించుకోవాలంటే ఎవరైనా సరే 80 పార్లమెంట్ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌పై పట్టు సాధించాల్సిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా ఇక్కడ తాను ఏమాత్రం తగ్గకూడదని నిర్ణయించుకొంది. ప్రత్యర్థులు తమపై చేస్తున్న ప్రచారానికి చెక్‌పెడుతూ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన తల్లి సోనియా (Sonia Gandhi) స్థానాన్ని నిలబెట్టుకొనేందుకు రాయ్‌బరేలీలో నేరుగా రంగంలోకి దిగారు.
* ఒక్క నెల ఓపిక పట్టండి.. మీ బిడ్డ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెడతా.. వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ప్రకాశం జిల్లా కనిగిరి బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్.. జగన్‌కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపు పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలకు ముగింపేనన్నారు. ‘‘రూ.వెయ్యి పెన్షన్‌ను రూ.3వేలు చేసింది మీ బిడ్డ జగన్. 39 లక్షల మందికి మాత్రమే బాబు పెన్షన్ ఇచ్చాడు.. మీ బిడ్డ జగన్.. 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాడు. లంచాలు, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తున్నాం. చంద్రబాబు పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి. నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్ అడ్డుకున్నాడు. బాబు హయాంలో పెన్షన్ల కోసం జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సివచ్చేది. చంద్రబాబు చేసిన పనివల్లే అవ్వాతాతలు ఎండలో బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు.. ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా పెన్షన్లు ఇచ్చాం. అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్ పంపించాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
* గురుగ్రామ్‌లోని టెస్లా పవర్ ఇండియా అనధికారికంగా తమ ట్రేడ్‌మార్క్‌ను వాడుకుంటోందని ఎలొన్‌మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా ఇంక్ గురువారం దిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేసింది. టెస్లా పవర్.. టెస్లా ఇంక్ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని సంస్థ తరఫు న్యాయవాది చందర్ లాల్ కోర్టును అభ్యర్థించారు.
* దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతేడాది తొలి త్రైమాసికంలో ఆఫీస్ స్థలాల లీజింగ్‌లో వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. టాప్ ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ లీజింగ్ డేటాను విడుదల చేసింది. 2024 జనవరి-మార్చిలో ఆఫీస్ లీజింగ్ 13 శాతం పెరిగి 134 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఇది సంవత్సరం క్రితం ఇదే కాలంలో 118.5 లక్షల చదరపు అడుగులు ఉండేది. అయితే 2023 నాల్గవ త్రైమాసికంలో గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 31 శాతం తగ్గింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z