* గుంటూరులోని నెహ్రూనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అడ్డొచ్చిన వారిని కొడుతూ బీభత్సం సృష్టించింది. మహిళలు, వృద్ధులనీ చూడకుండా మత్తులో ఉన్న 15 మంది దాడులకు తెగబడ్డారు. శ్రీను అనే యువకుడిని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఏమి జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. నెహ్రూనగర్ ఆరో వీధిలో సలోమి అనే వృద్ధురాలిని ఢీ కొట్టారు. ఆమె తలకు బలమైన గాయమైంది. ఇది చూసిన స్థానికులు పడిపోయిన వృద్ధురాలిని లేపి, వాళ్లను ప్రశ్నించడంతో ఒక్కసారిగా రెచ్చిపోయారు. దాడికి తెగబడ్డారు. ఫోన్ చేసి మరికొందరినీ పిలిపించుకున్నారు. వారంతా కలిసి నెహ్రూనగర్ ఆరో వీధి నుంచి ఒకటో వీధి వరకూ అడ్డొచ్చిన వారిపై దాడి చేసుకుంటూ వెళ్లారు. ఆ పక్కనే ఉన్న బుచ్చయ్యతోట ఐదో వీధిలో ఓ వ్యక్తిని కొట్టసాగారు. విషయం తెలుసుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలికి వచ్చి బాధితులను ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గొడవ జరిగిందని, గంజాయి బ్యాచ్ కాదని ప్రాథమిక విచారణలో తేలినట్లు సీఐ అన్వర్‌బాషా తెలిపారు. ‘‘15 మంది వచ్చి.. మా ఇంటి ఎదురుగా ఉన్నవాళ్లను కొట్టారు. వారంతా గంజాయి మత్తులో ఉన్నారు. ఎందుకు కొడుతున్నారని అడిగినందుకు నన్నూ తీవ్రంగా కొట్టారు’’ అని స్థానికుడు అశోక్ తెలిపారు.
* ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విదేశాల్లో ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును అరెస్టు చేయడానికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఆర్పీసీ 73 ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరారు. ప్రస్తుతం ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. పోలీసు కస్టడీలో వారు చెప్పిన వివరాల ఆధారంగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్‌లో కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు బృందం గుర్తించింది. కేసు నమోదైన వెంటనే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ఎక్కడ ఎయిర్ పోర్టులో దిగినా పట్టుకునేందుకు వీలుగా ఇప్పటికే పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు, ఇంటర్‌పోల్ అధికారులను దర్యాప్తు బృదం సంప్రదించాలంటే కోర్టు అనుమతించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో సీఆర్పీసీ 73 ద్వారా అరెస్టు వారెంట్ జారీ చేయాలని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు.
* ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు బాంబు పార్సిల్ పంపడంతో అది పేలి భర్త, కుమార్తె మరణించిన ఘటన గుజరాత్‌లోని వడాలిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబంతో సహా వడాలిలో నివసిస్తూ.. కూలి పని చేసుకుంటూ జీవితం సాగిస్తున్నారు. గురువారం వారి ఇంటికి టేప్ రికార్డర్ వంటి పరికరం పార్సిల్ రావడంతో దానిని తీసుకున్న జీతూభాయ్, అతని కుమార్తె భూమిక(12) ఆన్ చేయడానికి ప్రయత్నించగా అది పేలింది. ఈ ప్రమాదంలో జీతూభాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన భూమికను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె కూడా మృతి చెందింది. మరో ఇద్దరు కుమార్తెలకు గాయాలవడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు అతడి భార్య ఇంట్లో లేకపోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
* కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. భాజపా నేత ప్రేమేందర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా యూనిట్‌లో పనిచేస్తోన్న పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, పెట్టం నవీన్, ఆస్మా తస్లీమ్, కోయా గీతలను అరెస్టు చేసి వారి నుంచి 5 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, 2 సీపీయూలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు పలు అంశాలను గుర్తించారు. గత నెల 23న మెదక్‌లో అమిత్ షా పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. అయితే రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా మాట్లాడినట్టు మార్ఫింగ్ చేసిన వీడియో ప్రధాన నిందితుడు పెండ్యాల వంశీకృష్ణ వాట్సప్‌కి వచ్చింది. ఆ వీడియోను పలు వాట్సప్ గ్రూప్‌లకు ఫార్వర్డ్ చేయడంతో పాటు, కాంగ్రెస్ అధికారిక ట్విటర్ ఖాతాలో కూడా పోస్టు చేశాడు. మిగిలిన వారు కూడా వారి వ్యక్తిగత ట్విటర్ ఖాతాల్లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో వాస్తవం లేకపోవడంతో ట్విటర్ దానిని డిలీట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం నిందితులను కోర్టులో హాజరుపర్చగా.. ఐదుగురు నిందితులకు రూ.10వేలతో ఇద్దరు పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతీ సోమవారం, శుక్రవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
* లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణకు మరో షాక్ తగిలింది. తాజాగా అతడిపై అత్యాచారం కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. కర్ణాటకలో సంచనలంగా మారిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు విషయంలో పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ప్రజ్వల్‌పై అత్యాచారం కేసు నమోదైంది. లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌పై సిట్ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఐపీసీ సెక్షన్ 376 (బీ) (ఎన్), 506, 354(ఏ)(2), 354(బీ), 354(సీ), ఐటీ చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో ప్రజ్వల్ రేవణ్ణను ఏకైక నిందితుడిగా చేర్చారు. కాగా, ఇది ప్రజ్వల్‌పై నమోదైన రెండో కేసు. ఇదిలా ఉండగా.. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ దర్యాప్తు చేపడుతోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్ రేవణ్ణ సిట్ అధికారులను కోరారు.
* అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీంకోర్టు వరుస షాకులిస్తోంది. లిక్కర్ కేసులో తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం(మే 3) విచారించింది. ఎన్నికలున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని తాము పరిశీలిస్తామని, దీనిపై వాదన వినిపించేందుకు సిద్ధమై రావాలని సుప్రీంకోర్టు ఈడీని కోరింది. పిటిషన్‌పై మళ్లీ మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. ‘మేం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చు. ఇవ్వకపోవచ్చు. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని మాత్రం పరిశీలిస్తాం. మా నిర్ణయంపై ఎవరూ ఆశ్చర్యపోవద్దు. ఒకవేళ బెయిల్ ఇస్తే ఎలాంటి షరుతలు విధించాలన్నది ఈడీ చెప్పాలి. కేజ్రీవాల్ సీఎంగా ఏవైనా ఫైల్స్‌పై సంతకం చేయాల్సి ఉందా అన్నదానిని కూడా ఈడీ పరిశీలించాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా, లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సందర్భంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈడీని ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపైనే శుక్రవారం కోర్టు ప్రధానంగా విచారణ జరిపింది. లిక్కర్‌స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z