* టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థ తన బ్యాగేజీ పాలసీని మార్చింది. దేశీయ విమాన ప్రయాణాలకు ఫ్రీ బ్యాగేజీపై ఉన్న గరిష్ఠ పరిమితిని తగ్గించింది. తక్కువ ధర టికెట్ ప్రయాణానికి గతంలో 20 కేజీలుగా ఉన్న బ్యాగేజీని 15 కేజీలకు కుదించింది. అంటే ఎవరైతే ఎకానమీలో కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ ఫేర్ కేటగిరీ టికెట్లు తీసుకుంటారో వారు గరిష్ఠంగా ఇకపై 15 కేజీలు మాత్రమే చెక్-ఇన్ బ్యాగేజీకి అనుమతిస్తారు. ఈ కొత్త రూల్స్ మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి. ఎయిరిండియా 25 కేజీల వరకు బ్యాగేజీకి అనుమతిచ్చేది. టాటా గ్రూప్ చేతికొచ్చాక గతేడాది ఆ పరిమితిని 20 కేజీలకు తగ్గించారు. తాజాగా ఫ్రీ బ్యాగేజీ పరిమితిని 15 కేజీలకు కుదించారు. కనీసం 15 కేజీల వరకు బ్యాగేజీని ఉచితంగానే అనుమతించాలని డీజీసీఏ ఆదేశాలున్నాయి. దీంతో దాదాపు అన్ని ఎయిర్‌లైన్స్ ఇప్పటికే ఈ పరిమితిని అనుసరిస్తున్నాయి. అయితే, ఇతర సంస్థలు ఒక లగేజీని మాత్రమే అనుమతిస్తుండగా.. ఎయిరిండియా మాత్రం బరువు పరిమితికి లోబడి ఎన్ని బ్యాగుల్నైనా తీసుకెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. ఎయిరిండియా వివిధ రకాల ఫేర్ తరగతులను గతేడాది ప్రవేశపెట్టింది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్, ఫస్ట్‌క్లాస్‌లతో పాటు కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్, ఫ్లెక్స్ పేరిట మూడు ఉప తరగతులను తీసుకొచ్చింది. వీటిలో టికెట్ ధరతో పాటు ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. ఒకవేళ ఎకానమీ ఫ్లెక్స్ కేటగిరీలో టికెట్ ఎంచుకుంటే 25 కేజీల వరకు బ్యాగేజీకి అనుమతిస్తారు. సాధారణంగా బరువు అనేది విమానం ఇంధనాన్ని ఆదా చేయడానికి ఉపయోగపడుతుంది. ఎయిరిండియా కొత్త బ్యాగేజీ పాలసీ కంపెనీ తన బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరుచుకునేందుకు ఉపయోపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
* ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం సవాలుగా మారిపోయింది. ఆకట్టుకొనేలా రెజ్యూమెను రూపొందించడమే కాదు.. రిక్రూటర్‌ను మెప్పించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగార్థులు. కొందరైతే ఎంతోకొంత ‘ముట్టచెప్పేందుకూ’ వెనకాడటం లేదు. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ వ్యవస్థాపకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. వింగిఫై సంస్థ వ్యవస్థాపకుడైన పరాస్ చోప్రాకు ఇటీవల ఓ ఉద్యోగ దరఖాస్తు వచ్చింది. అందులో వచ్చిన సందేశాన్ని చూసిన ఆయన అవాక్కయ్యారు. ‘‘నేను వింగిఫైలో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. మీకోసం ప్రత్యేకమైన ప్రతిపాదన తీసుకొచ్చాను. నన్ను నియమించుకుంటే 500 డాలర్లు (సుమారు రూ.40,000) ఇస్తాను. ఒక వారంలో నన్ను నేను నిరూపించుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగించండి. ఆ డబ్బు మీ వద్దే ఉంచుకోవచ్చు. మీ టీమ్ సభ్యుల సమయం వృథా చేయకూడదని ఇలా చెబుతున్నా’’ అని ఆ సందేశంలో రాసుంది. ‘మీ తిరస్కరణ కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ తన దరఖాస్తును ముగించాడు.
* దేశీయంగా ఉల్లి ధరలు (Onion prices) అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎగుమతులపై గతంలో విధించిన ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. దాదాపు కొన్ని నెలలుగా అమల్లో ఉన్న నిషేధాన్ని తొలగించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగుతాయని పేర్కొంది. అయితే, కనీస ఎగుమతి ధరను టన్నుకు 550 డాలర్లుగా (రూ.45,860) పేర్కొంది. మహారాష్ట్రలో తదుపరి దశ పోలింగ్ జరగనున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో ఉల్లి దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండబోదన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం గతేడాది చర్యలకు పూనుకుంది. దేశీయంగా ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు తొలుత ఉల్లి ఎగుమతలపై కనీస ధరను టన్నుకు 800 డాలర్లకు పెంచుతూ అక్టోబర్ 28న నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 8న పూర్తిగా నిషేధం విధించింది. మార్చి 31 వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని పేర్కొంది. ఆ గడువును కేంద్రం మళ్లీ పొడిగించింది. ఉల్లి ఎగుమతులపై శుక్రవారం 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించిన కేంద్రం.. శనివారం ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.
* బంగారం ధరలు తగ్గాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాములు రూ.540 పడిపోయి రూ.71,730 వద్ద నిలిచింది. 22 క్యారెట్ పుత్తడి తులం విలువ కూడా రూ.500 దిగి రూ.65,750గా ఉన్నది. గురువారం ముగింపుతో చూస్తే ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లోనూ 24 క్యారెట్ పసిడి రేటు 10 గ్రాములు రూ.350 క్షీణించింది. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు నేల చూపుల్నే చూశాయి. ఔన్సు 7 డాలర్లు దిగి 2,297 డాలర్లకు పరిమితమైంది. ద్రవ్యోల్బణ భయాల నడుమ గత అంచనాలను తలకిందులు చేస్తూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్.. వడ్డీరేట్లను తగ్గించడానికి చాలా కాలమే తీసుకుంటుందన్న ఊహాగానాలు గోల్డ్ మార్కెట్‌ను కుదిపేశాయని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. కాగా, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.
* టెలికం సబ్‌స్ర్కైబర్లు మరింత పెరిగారు. మార్చి నెల చివరినాటికి 119.9 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు నూతన కస్టమర్లు చేరుకున్నట్లు తెలిపింది. అలాగే బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్ర్కైబర్లు 92.4 కోట్లకు చేరుకున్నట్లు ట్రాయ్ తన నెలవారి నివేదికలో తెలిపింది. జియోకు కొత్తగా 21.4 లక్షల మంది చేరగా, ఎయిర్‌టెల్‌కు 17.5 లక్షల మంది జతయ్యారు. కానీ, వొడాఫోన్ ఐడియా 6.8 లక్షల మందిని కోల్పోగా, బీఎస్‌ఎన్‌ఎల్ 23.5 లక్షలు, ఎంటీఎన్‌ఎల్ 4,674 మంది వెళ్లిపోయారు.
* అదానీ గ్రూప్ సంస్థలకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంబంధిత పార్టీ లావాదేవీలు, లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘనలకుగాను గౌతమ్ అదానీకి చెందిన 7 కంపెనీలకు ఈ నోటీసులు వెళ్లాయి. ఈ మేరకు సదరు సంస్థలు శుక్రవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపాయి. కాగా, సెబీ నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్న అదానీ గ్రూప్ కంపెనీల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అదానీ విల్మర్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఉన్నాయి. ఈ జనవరి-మార్చి త్రైమాసికం, గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లోనూ ఈ విషయాన్ని అదానీ సంస్థలు స్పష్టం చేశాయి. అయితే ఏ రకమైన చట్టాలను, నిబంధనలను తాము అతిక్రమించలేదని ఆయా కంపెనీలు చెప్తున్నాయి. ఇక అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అదానీ విల్మర్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మినహా మిగతా కంపెనీల ఆడిటర్లు ఆర్థిక ప్రకటనలపై క్వాలిఫైడ్ ఒపీనియన్‌ను జారీ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి చిక్కులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఇష్యూ చేసినట్టు తెలుస్తున్నది. మరోవైపు ఏసీసీ, అంబుజా సిమెంట్ తమకు సెబీ నుంచి ఏ నోటీసులూ రాలేదని ప్రకటించాయి. ఎన్డీటీవీ కూడా ఇదే ప్రకటన ఇచ్చింది. అదానీ గ్రూప్‌లో మొత్తం 10 సంస్థలు దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన విషయం తెలిసిందే. ఇందులో ఏడింటికి సెబీ నుంచి షోకాజ్ నోటీసులు వచ్చాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z