‘చంద్రబాబునాయుడు అవగాహన రాహిత్యంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అబద్ధాలు వల్లించడం సిగ్గుచేటు. జగన్ భూములు లాక్కుంటున్నాడంటూ దుష్ప్రచారం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. పేదలకు భూములిచ్చేది జగన్ అయితే.. లాక్కునేది చంద్రబాబు అనే విషయం అందరికీ తెలుసు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో రైతులు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వందేళ్ల తర్వాత భూముల రీ సర్వే చేపట్టాం. రైతుల భూముల భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఎలాంటి వివాదం లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మా లక్ష్యం. అందుకనే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ తర్వాత రైతులకే డాక్యుమెంట్లు అందజేస్తాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడటం దుర్మార్గం’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని అంబేడ్కర్ సర్కిల్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ప్రచారంలో ఉన్న అపోహలను తొలగిస్తూ స్పష్టతనిచ్చారు.
రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయ్యా చంద్రబాబూ..! ఇప్పటివరకు ఏకంగా 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దేశవ్యాప్తంగా అమలవుతున్న కార్డ్ 2 సాఫ్ట్‌వేర్ ద్వారా తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా ఆ తర్వాత డాక్యుమెంట్లు అన్నీ భూ యజమానులకే ఇచ్చాం.
దీన్ని మరింత సులభతరం చేస్తూ.. ఏ ఒక్కరికీ సమస్య ఉండకూడదని, పత్రాలు రాసుకునేటప్పుడు తప్పులు ఉండకూడదని ఆ ఫార్మాట్ కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాం. ఎవరైనా అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా ఆ ఫార్మాట్ డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నింపి డాక్యుమెంట్లతో వెళితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేలి ముద్రలు లాంటి మిగతా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత ఫిజికల్ డాక్యుమెంట్లు రైతులకే ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతోందని చంద్రబాబు తెలుసుకోవాలి.
ఆ భూముల మీద ఎలాంటి వివాదం లేదని గ్యారంటీ ఇస్తూ ఒక సంస్కరణ తేవాలన్నదే మా అందుకనే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాం. కానీ ఇది జరగాలంటే మొదట రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సర్వే పూర్తి కావాలి. దేశంలో వందేళ్ల క్రితం ఆంగ్లేయుల హయాంలో భూముల సర్వే చేశారు. రైతుల కోసం ఈ రోజు మళ్లీ ప్రతి ఎకరా రీ సర్వే చేస్తున్నాం. 15 వేల మంది సర్వేయర్లను నియమించాం. ఉచితంగా సరిహద్దు రాళ్లను నాటి రికార్డులన్నీ అప్‌డేట్ చేస్తున్నాం. సబ్ డివిజన్ చేసి ఆ హక్కు పత్రాలను పదిలంగా రైతన్నలకు అందచేస్తున్నాం. రాష్ట్రంలో 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాలకుగానూ ఇప్పటివరకు 6 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయ్యింది. మిగతా చోట్ల ఒకటిన్నర, రెండేళ్లలో సర్వే పూర్తవుతుందని జగన్ అన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z