రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మార్క్‌ఫెడ్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జొన్న రైతులెవరూ తొందరపడి తక్కువ ధరకు పంటను అమ్ముకోవద్దని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో సూచించారు. పెంచిన పరిమితి ప్రకారం ప్రభుత్వం జొన్న రైతులవద్ద నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా జొన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటా జొన్నలకు రూ.3,180 చొప్పున మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుంచి కొనుగోలు ప్రారంభించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్ల జొన్నలే కొనాలని ఐదేళ్ల క్రితం అప్పటి భారాస ప్రభుత్వం పరిమితిని విధించింది. పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని, ఈ పరిమితిని పెంచాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల రైతులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. వారి విజ్ఞప్తి మేరకు అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక తెప్పించుకుని ఈ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఆదేశాలిచ్చింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 1.05 లక్షల ఎకరాల్లో ఈ పంటను గత అక్టోబరు నుంచి మార్చి వరకూ యాసంగి(రబీ) సీజన్‌లో పండించారు. దాదాపు 14 లక్షల క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని అంచనా. ఇక్కడ పండించే జొన్న పంటను మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ వ్యాపారులు సైతం వచ్చి కొంటుంటారు. రాష్ట్ర ప్రభుత్వం పరిమితిని పెంచడం వల్ల ఎకరానికి ప్రతి రైతుకు తప్పనిసరిగా మద్దతు ధర కింద 12 క్వింటాళ్లకు రూ.38,160 అందుతుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z