సుమారు 42 ఎకరాల్లో ఉన్న విల్లాను ఉచితంగా ఇస్తారట. కావాలనుకున్నవారు తీసుకోవచ్చట. స్వయానా ఓ దేశ ప్రభుత్వం ప్రజలకు ఈ ఆఫర్ ఇచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే..? జర్మన్ నియంత హిట్లర్ పేరు వింటేనే ఒకప్పుడు ప్రపంచం వణికిపోయింది. ఆయన అత్యంత సన్నిహితుల్లో జోసెఫ్ గోబెల్స్ ఒకరు. ఆయన నాజీ పార్టీకి ప్రధాన ప్రచారకుడు. వార్తా పత్రికలు, రేడియో, సినిమా మాధ్యమాలను ఉపయోగించుకొని నాజీ భావజాలానికి బలమైన ప్రచారం కల్పించారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌కు 25 మైళ్ల దూరంలో ఉన్న ఆ విల్లా ఈయనదే. 1936లో దానిని నిర్మించారు. గోబెల్స్ దీనిని అనేక అవసరాలకు వినియోగించారని, అక్కడ పలువురు నటీమణులతో సంబంధాలు నడిపారని పలు కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ భవంతి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటం, నాజీ పాలనతో ముడిపడిన చరిత్ర వంటి కారణాలతో దానిని వదిలించుకోవాలని చూస్తోంది. దీనిపై ఆర్థిక మంత్రి స్టెఫాన్ ఎవర్స్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటే.. ప్రభుత్వం దానిని బహుమతిగా అందజేస్తుంది’’ అని వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి ఈ విల్లాలో ఎవరూ నివసించడం లేదు. ప్రస్తుతం అది రోజురోజుకూ దెబ్బతింటోంది. దానిని సొంతం చేసుకునేందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి తగిన ప్రతిపాదన లేకపోతే.. ప్రభుత్వం దానిని కూల్చివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. రెండో ప్రపంచయుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో గోబెల్స్ తన భార్య, ఆరుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z