* మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జెట్ ఎయిర్‌వేస్ (Jet Airways) వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌కు (Naresh Goyal) బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాల రీత్యా బాంబే హైకోర్టు రెండు నెలల తాత్కాలిక బెయిల్‌ను మంజూరుచేసింది. బెయిల్‌పై కొన్ని షరతులు విధించింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ముంబయి వీడకూడదని, రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. పాస్‌పోర్టు కూడా సరెండర్ చేయాలని జస్టిస్ ఎన్‌జే జామ్‌దార్‌తో కూడిన సింగిల్ బెంచ్ సూచించింది. అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ ఇప్పించాలని కోరుతూ గోయల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఫిబ్రవరిలో ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్సకు మాత్రం అనుమతించింది. దీంతో గోయల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనతోపాటు తన భార్య అనితా గోయల్ కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నందున బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో బెయిల్ ఇవ్వాలని నరేశ్ గోయల్ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే ధర్మాసనాన్ని కోరారు. ఈడీ తరఫు న్యాయవాది బెయిల్‌ను వ్యతిరేకించారు. ఆస్పత్రిలో చికిత్స కావాలంటే పొడిగించాలన్నారు. గోయల్ అనారోగ్యంతో పాటు, మానసిక అనారోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా సాల్వే ధర్మాసనాన్ని కోరారు. దీంతో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
* లాభాల కోసం అక్రమ విధానాలను అనుసరించిన ఆస్ట్రేలియా విమానయాన సంస్థ కాంటాస్ (Qantas) చివరకు మూల్యం చెల్లించుకుంది. ‘ఘోస్ట్ ఫ్లైట్స్’ పేరిట ప్రాచుర్యం పొందిన కుంభకోణంలో 66 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.550 కోట్లు) జరిమానా చెల్లించేందుకు సిద్ధమైంది. ముందుగానే రద్దయిన విమానాల్లోని టికెట్లను సైతం కాంటాస్ (Qantas) విక్రయిస్తూ వచ్చింది. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా అంగీకరించిందని ఆస్ట్రేలియా నియంత్రణా సంస్థ తెలిపింది. దీంతో 66 మిలియన్ డాలర్ల జరిమానాతో పాటు 86 వేల మంది ప్రయాణికులకు 13 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. లాభాల కక్కుర్తితో కంపెనీ చేసిన నిర్వాకం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చీవాట్లు పెట్టింది. అనేక మంది వ్యాపారులు, పర్యటకులు రద్దు చేసిన విమానాల్లోని టికెట్లు బుక్ చేసుకొని నష్టపోయారని తెలిపింది. ‘‘మూడు రోజుల ముందే రద్దయిన విమానాల టికెట్లను సైతం విక్రయించాం. మా కస్టమర్లకు నష్టం కలిగించాం. ప్రమాణాలను పాటించడంలో విఫలమయ్యాం. ప్రయాణికులకు సకాలంలో నోటిఫికేషన్లు పంపలేకపోయాం. దానికి క్షమాపణ చెబుతున్నాం’’ అంటూ కాంటాస్ సీఈఓ వనెస్సా హడ్సన్ తమ తప్పును అంగీకరించారు. దాదాపు 103 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థ ఈ తరహా అనైతిక విధానాలను అవలంబించడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల ధరలు పెంచడం, సేవల నాణ్యతలో లోపాలు, కరోనా సమయంలో 1,700 మంది సిబ్బంది తొలగింపు వంటి అంశాల్లోనూ ఈ సంస్థ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. గత ఏడాది ఈ కంపెనీ 1.1 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేసింది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో సెన్సెక్స్ స్వల్పంగా లాభపడగా.. నిఫ్టీ స్వల్పంగా నష్టపోయి 22,400 స్థాయికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 74,196.68 పాయింట్ల (క్రితం ముగింపు 73,878.15 పాయిట్లు) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత ఓ మోస్తరు లాభాల్లో కొనసాగిన తర్వాత ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 73,786.29 – 74,359.69 మధ్య చలించింది. చివరికి 17.39 పాయింట్ల లాభంతో 73,895.54 వద్ద ముగిసింది. నిఫ్టీ 33.15 పాయింట్లు నష్టపోయి 22,442.70 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్‌ఫార్మా షేర్లు రాణించగా.. టైటాన్, ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎల్ అండ్‌టీ షేర్లు నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 83.50గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 83.70 డాలర్లుగా ఉంది.
* Post office Schemes | రిస్క్ తక్కువ-రాబడి ఎక్కువ ఇది.. పోస్టాఫీస్ పథకాల్లో ఉన్న సౌలభ్యం. మీ భవిష్యత్తు కోసం మీ సంపద వృద్ధి చెందేలా పోస్టాఫీస్ రకరకాల పెట్టుబడి మార్గాలను అందిస్తున్నది. పైగా వీటిలో చాలావరకు ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపుల్నీ ఇస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు 9 రకాల సేవింగ్స్ స్కీములు పోస్టాఫీస్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ప్రతీ 3 నెలలకోసారి ఈ స్కీముల వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం
సవరిస్తుంది. ఆయా పథకాలను ఒక్కసారి పరిశీలిస్తే..
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (ఎస్‌సీఎస్‌ఎస్)లో వడ్డీరేటు అత్యధికంగా 8.60 శాతం. 60 ఏండ్లు దాటిన వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఉన్న ఈ పథకంలో కనీస డిపాజిట్ రూ.1,000. గరిష్ఠం రూ.15 లక్షలు. ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులూ ఉంటాయి.
సుకన్య సమృద్ధి యోజన
ఆడపిల్లల కోసం ఉద్దేశించిన ఈ సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) స్కీంలో మదుపు చేస్తే 8.40 శాతం వడ్డీరేటును పొందవచ్చు. నెలకు రూ.250 చొప్పున కూడా డిపాజిట్ చేయవచ్చు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులనూ అందుకోవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో వడ్డీరేటు 7.90 శాతం. ఈ స్కీం కింద ఏటా రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు ఎంతైనా మదుపు చేసుకోవచ్చు. సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలూ అందుతాయి.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం
ఐదేండ్ల కాల పరిమితి కలిగిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ) పథకంలో 8వ విడుత నడుస్తున్నది. ఇందులో వడ్డీరేటు 7.70 శాతం. కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్ఠ పరిమితి అంటూ లేదు. ఎంతైనా పెట్టుబడులుగా పెట్టుకోవచ్చు.
టర్మ్ డిపాజిట్ స్కీం
ఇందులో వడ్డీరేటు 6.90 శాతం నుంచి 7.70 శాతం వరకు ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్ఠంగా ఎంతైనా మదుపు చేసుకోవచ్చు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం (పీఎంఐ) పథకంలో వడ్డీరేటు 7.60 శాతం. కనీస పెట్టుబడి రూ.1,500. సింగిల్ అకౌంట్లలో గరిష్ఠ పెట్టుబడికున్న పరిమితి రూ.4.5 లక్షలు. జాయింట్ అకౌంట్లలో రూ.9 లక్షలు.
కిసాన్ వికాస్ పత్ర
పోస్టాఫీస్ అందిస్తున్న అత్యంత పాత పథకాల్లో ఈ కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) ఒకటి. ఇందులో వడ్డీరేటు 7.60 శాతం. కనీస పెట్టుబడి రూ.1,000.
రికరింగ్ డిపాజిట్ స్కీం
ఈ స్కీంలో వడ్డీరేటు 7.20 శాతం. కనీస పెట్టుబడి రూ.100. గరిష్ఠంగా ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు.
సేవింగ్స్ అకౌంట్
బ్యాంకుల తరహాలో అందుబాటులో ఉన్న సేవింగ్స్ అకౌంట్ ఇది. పోస్టాఫీస్ పొదుపు ఖాతాదారులు.. తమ డిపాజిట్లపై 4 శాతం వడ్డీరేటును అందుకోవచ్చు. ఖాతాలో కనీసం రూ.500 ఉంచాల్సిందే. గరిష్ఠంగా ఎంతైనా వేసుకోవచ్చు.
* బంగారం కొనుగోళ్లకు అక్షయ తృతీయ ఎంతో ప్రత్యేకం. ఈ ఏడాదికిగాను ఈ నెల 10 (శుక్రవారం)న వస్తున్నది. ఈరోజున పసిడి కొనుగోళ్లు శుభప్రదమని భారతీయుల నమ్మకం. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, పెద్ద నగల వ్యాపారులు సైతం కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. మార్కెట్‌లో ఆఫర్లు, గిఫ్ట్‌లు, తగ్గింపులు అంటూ సందడే సందడి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా కొనుగోలుదారుల ఆలోచనా తీరులోనూ మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే భౌతిక బంగారం నుంచి డిజిటల్ గోల్డ్ వైపు కస్టమర్లు అడుగులు వేస్తున్నారు. గత కొన్నేండ్లుగా అక్షయ తృతీయకు ఈ డిజిటల్ గోల్డ్‌ను కొనేవారు క్రమేణా పెరుగుతూ వస్తుండటం కూడా గమనార్హం. బంగారంతో పోల్చితే డిజిటల్ గోల్డ్‌కున్న అనుకూలతల్ని పరిశీలిస్తే..
డిజిటల్ గోల్డ్ అంటే?
డిజిటల్ గోల్డ్‌కు భౌతిక రూపం అంటూ ఏమీ ఉండదు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారంగా లావాదేవీలు నడుస్తాయి. అయితే సంప్రదాయ మార్కెట్‌లోని బంగారం ధరలు.. డిజిటల్ గోల్డ్ విలువను ప్రభావితం చేస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్, సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్‌జీబీ) డిజిటల్ గోల్డ్‌గానే పరిగణించవచ్చు.
ఎలా కొనాలి?
ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇన్వెస్టర్లు డిజిటల్ గోల్డ్‌ను కొనవచ్చు. మీరు కొన్న డిజిటల్ గోల్డ్‌కు సమాన విలువ కలిగిన భౌతిక బంగారాన్ని తమ సొంత వాల్ట్స్‌లో ఇది నిల్వ చేస్తుంది. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ, స్విట్జర్లాండ్‌కు చెందిన బులియన్ బ్రాండ్ పీఏఎంపీ ఎస్‌ఏ జాయింట్ వెంచరే ఈ ఎంఎంటీసీ-పీఏఎంపీ.
దీని భాగస్వామ్యంతో గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే వంటి ఫిన్‌టెక్ కంపెనీలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్యాంకులు, మోతీలాల్ ఓస్వాల్, ఏంజెల్ బ్రోకింగ్ వంటి బ్రోకరేజీ సంస్థలు డిజిటల్ గోల్డ్ క్రయవిక్రయ లావాదేవీల్లో పాల్గొంటున్నాయి. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా డిజిటల్ గోల్డ్‌ను కొనవచ్చు. కొనుగోలుదారులు ఎప్పుడంటే అప్పుడు వీటిని తిరిగి అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు.
చివరగా..
ప్రభుత్వ నియంత్రణ అంతగా లేకపోవడంతో డిజిటల్ గోల్డ్ క్రయవిక్రయాలు, నిల్వపై ఫీజుల భారాన్ని ఇన్వెస్టర్లు మోయాల్సి వస్తున్నది. పైగా ప్రతీ ఆరు నెలలకోసారి అకౌంట్ యాక్టివిటీ ఉండాల్సిందే.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z