WorldWonders

భర్తను సిగరెట్లతో కాలుస్తున్న భార్య అరెస్ట్-CrimeNews-May 07 2024

భర్తను సిగరెట్లతో కాలుస్తున్న భార్య అరెస్త్-CrimeNews-May 07 2024

* నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ క్యాంపస్‌లోని స్టాఫ్‌ వాటర్‌ ట్యాంక్‌లో మహిళ మృతదేహం కలకలం రేపింది. దీంతో యూనివర్సిటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసుల వివరాల మేరకు… మృతురాలు తన భర్త, అత్తతో కలిసి అదే విశ్వవిద్యాలయంలో నివసించేది. యూనివర్సిటీ సమీపంలోని జిమ్స్‌ ఆసుపత్రిలో భార్యాభర్తలు పని చేస్తుండేవారు. వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆదివారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవే మహిళ హత్యకు దారితీసి ఉండొచ్చని, ఆమెను హత్య చేసి వాటర్‌ట్యాంక్‌లో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి భర్త, అత్త పరారీలో ఉన్నారు. మహిళ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని శవపరీక్షకు తరలించినట్లుగా సీనియర్ పోలీసు అధికారి శివహరి మీనా తెలిపారు.

* ‘‘నా భార్య మత్తు పదార్థాలు తీసుకుని నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో రోజూ వాతలు పెడుతోంది. నా భార్య నుంచి నన్ను రక్షించండి మహాప్రభో!’’ అంటూ ఓ వ్యక్తి తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏదో చిన్న కేసే అనుకొని పోలీసులు లైట్‌గా తీసుకున్నారు. ఓ రోజు వీడియో ఆధారాలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు ఆ బాధితుడు. తీరా ఆ వీడియోల్లో ఆమె టార్చర్‌ చూశాక.. పోలీసులే ముక్కున వేలేసుకున్నారు. భర్త ఫిర్యాదు మేరకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని (UP) బిజ్నోర్‌ జిల్లాకు చెందిన మనన్‌ జైదీకి.. మెహర్‌ జహాన్‌తో వివాహమైంది. మత్తు పదార్థాలకు బానిససైన మెహర్‌.. భర్తను నిత్యం హింసిస్తుండేది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో… భార్య దారుణాలను తెలియజెప్పేందుకు ఆ భర్త ఇంట్లోనే ఆమెకు తెలియకుండా సీసీ కెమెరాలు అమర్చాడు. అనుకున్నట్లుగానే మత్తు పదార్థాలు తీసుకున్న ఆమె.. రోజూలానే అర్ధరాత్రి అతడి కాళ్లూ, చేతులు కట్టేసింది. సిగరెట్‌ తాగుతూ ఒంటిపై వాతలు పెట్టింది. మర్మాంగంపైనా చురకలు పెట్టింది. ఆ రాత్రి భార్య దారుణాలను భరించిన ఆ భర్త.. ఉదయాన్నే వీడియో ఆధారాలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. ఇలానే రోజూ తనపై దాడి చేస్తోందంటూ జరుగుతున్న దారుణాలను వివరించాడు. దీంతో భర్త ఫిర్యాదు మేరకు మెహర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి చర్యలు తీసుకుంటామని బిజ్నోర్‌ జిల్లా అదనపు ఎస్పీ మీడియాకు వెల్లడించారు. సంబంధిత వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

* నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కళ్లనిండా చూసుకోకుండానే కాటికి చేరుకున్న ఘటన సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్‌ భార్య రవళిక (26) సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నందిని ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆస్పత్రి వైద్యురాలు సాధారణ డెలివరీ చేయడంతో బాబుకు జన్మనిచ్చింది. సదరు మహిళకు అధిక రక్తస్రావం కావడంతో వైద్యురాలు అర్జంటుగా రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంకటేశ్‌ బ్లడ్‌ బ్యాంకుకు వెళ్లి రక్తం తీసుకు వచ్చే లోగానే వైద్యురాలు నందిని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మహిళను సమీపంలోని మెడిలైఫ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవళిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యురాలు నందిని, మెడిలైఫ్‌ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రవళిక మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న సీఐ బన్సీలాల్‌ సిబ్బందితో కలిసి ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.

* ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కలిగించాడు. ఏపీలోని పలు జిల్లాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు చోట్ల పిడుగులు పడి ఇద్దరు మృతి చెందారు. కొన్ని చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌, వీఎల్‌పురం, శ్యామల సెంటర్‌ ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. గానుగ వీధిలో రెండు చెట్లు నేలకొరిగాయి. మరోవైపు విజయవాడలో ఈదురుగాలులతో చిరుజల్లులు కురిశాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అచ్చంపేట, అమరావతి, క్రోసూరు మండలాల్లో మిరప, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో ఈదురుగాలుతో భారీ వర్షం కురిసింది. కరెంట్‌ స్తంభాలు నేల కూలి పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

* ముస్లింలకు పూర్తి రిజర్వేషన్లు కల్పించాలంటూ బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ (Lalu Prasad Yadav) యాదవ్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) స్పందిస్తూ లాలూపై తీవ్రంగా మండిపడ్డారు. పశువుల మేత మేసేసిన నేత.. రిజర్వేషన్ల గురించి మాట్లాడటం సిగ్గుచేటు అంటూ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ లాలూ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘‘రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ఇప్పుడు మౌనంగా ఉంది. కానీ, వారి మిత్రపక్ష పార్టీకి చెందిన ఓ నేత విపక్ష కూటమి ఉద్దేశాలను బయటపెట్టారు. పశువుల గ్రాసాన్ని మేసేసి జైలుకెళ్లిన నేత (లాలూ దాణా కుంభకోణాన్ని ఉద్దేశిస్తూ) ఆయన. కోర్టు ఆయనను శిక్షించగా.. అనారోగ్య కారణాలు చూపి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇప్పుడు సిగ్గు లేకుండా ముస్లింలకే పూర్తి రిజర్వేషన్లు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. దానర్థం ఏంటీ? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల రిజర్వేషన్లను దోచుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు’’ అని మోదీ మండిపడ్డారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z