Editorials

దక్షిణాది ప్రజలపై శాం పిట్రోడా జాతివివక్ష వ్యాఖ్యలు-NewsRoundup-May 08 2024

దక్షిణాది ప్రజలపై శాం పిట్రోడా జాతివివక్ష వ్యాఖ్యలు-NewsRoundup-May 08 2024

* సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) కొట్టి వేసింది. రెండోసారి ఆయన సస్పెన్షన్‌ చట్టవిరుద్ధమని పేర్కొంది. ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్‌.. ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

* కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్ల ప్రలోభాల కోసం ఉంచిన వివిధ రకాల వస్తువుల్ని పోలీసులు పట్టుకున్నారు. గంగూరు ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పెనమలూరు వైకాపా అభ్యర్థి జోగి రమేశ్‌ అద్దెకు తీసుకున్నారు. అందులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గృహోపకరణ వస్తువులతో పాటు నగదు దాచి ఉంచారని సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు అందడంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అక్కడికి వెళ్లింది.

* అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌(Donald Trump)తో ‘ఏకాంతంగా’ గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్‌ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో తనపై వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్‌ అడ్డదారులు తొక్కారనే (Hush money) ఆరోపణలపై విచారణ జరుగుతోన్న క్రమంలో న్యూయార్క్‌ కోర్టులో ఆమె వాంగ్మూలం ఇచ్చారు.

* హఠాత్తుగా రాహుల్‌ గాంధీ ఈ ఎన్నికల్లో అంబానీ – అదానీల గురించి మాట్లాడడం మానేశారెందుకని ప్రధాని మోదీ ప్రశ్నించారు. వారితో ఏమైనా రహస్య ఒప్పందం కుదిరి ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించారు.

* తనకు పదవులపై ఆశలేదని.. రానున్న పదేళ్లూ రేవంత్‌రెడ్డే సీఎం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దిల్లీ మద్యం కేసులో అరెస్టయి జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పరువు తీస్తున్నారని విమర్శించారు. త్వరలోనే భారాస దుకాణం ఖాళీ అవుతుందన్నారు.

* యూపీలో అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలు కాంగ్రెస్‌కు ఎంతో కీలకం. గాంధీ కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ స్థానాల్లో గెలుపు ప్రస్తుతం ఆ పార్టీకి అత్యంత అవసరం. దీంతో అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ నియోజకవర్గాల్లో రంగంలోకి దిగారు. పార్టీ ప్రచార బాధ్యతలను భుజానకెత్తుకున్నారు.

* భారత్‌లో ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం గూగుల్‌ ప్రైవేట్‌ డిజిటల్‌ వ్యాలెట్‌ను (Google Wallet) విడుదల చేసింది. దీంట్లో బ్యాంకు కార్డులు, టికెట్లు, పాసులు, ఐడీలను భద్రంగా స్టోర్‌ చేసుకోవచ్చు. ఇది గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

* మూడో విడత సార్వత్రిక ఎన్నికలతోనే ఎన్డీయే విజయం ఖాయమైందని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. వరంగల్‌ పరిధిలోని మామునూరులో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా చేసిన ‘జాతి వివక్ష’ వ్యాఖ్యలను ప్రధాని తీవ్రంగా ఖండించారు. శరీర రంగు చూపి ప్రజలను అవమానిస్తారా? అని మండిపడ్డారు.

* అనంతపురం రేంజ్‌ డీఐజీగా షిముషి బాజ్‌పేయ్‌ని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఆదేశించింది. అనంతపురం డీఐజీగా పని చేసిన అమ్మిరెడ్డిపై సోమవారం ఈసీ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆయనకు ఎన్నికల బాధ్యతలు అప్పగించొద్దని ఆదేశించింది. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు అర్హులైన ముగ్గురు అధికారుల పేర్లను పంపాలని సీఎస్‌ను ఆదేశించింది. ఈ మేరకు తాజాగా షిముషి బాజ్‌పేయ్‌ని ఈసీ నియమించింది.

* రాష్ట్రంలో భాజపాకు ఆదరణ బాగా పెరుగుతోంది. భాజపాపై ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డిలో అసహనం బాగా పెరిగిపోయింది. సీఎం హోదాలో ఉన్న విషయాన్ని కూడా రేవంత్‌రెడ్డి మర్చిపోయారు. జర్నలిస్టులను జైలులో వేస్తాననటం.. సీఎం గర్వానికి నిదర్శనం. తిట్లు, కొత్త కొత్త అబద్ధాల కోసం పరిశోధన బృందాలను రేవంత్‌రెడ్డి నియమించుకున్నారు: కిషన్‌ రెడ్డి

* ‘క్లాస్‌ వార్‌’ అంటూ ఊదరగొట్టే సీఎం జగన్‌.. చదువుకున్న యువకులకు మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు ఇచ్చారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్‌ జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సంక్షేమంతోపాటు రాష్ట్రం అభివృద్ధి చెందేలా పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఆత్మగౌరవం ఉన్నవారంతా వైకాపా నుంచి బయటకు వస్తున్నారని.. అందుకు యార్లగడ్డ వెంకటరావు, వల్లభనేని బాలశౌరిలే నిదర్శనమని చెప్పారు.

* సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం (TDP) పార్టీ ప్రచారాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తోంది. ప్రస్తుతం ఉన్న అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఓటర్లకు మరింత చేరువ అవుతోంది. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు తాము అందించబోయే సంక్షేమ పథకాలు, ప్రణాళికలను వివరిస్తున్న పార్టీ.. ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసింది. ఆగ్యుమెంటెడ్‌ రియాల్టీ (Agumented Reality) ద్వారా మన ఇంటికే తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu), ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) వచ్చి మాట్లాడేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను తెలుగుదేశం విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ (Manaintiki Babu)ను ఉపయోగించవచ్చు.

* లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా (Sam Pitroda) వ్యాఖ్యలు హస్తం పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. ఇటీవల ‘వారసత్వ పన్ను’పై మాట్లాడి వివాదంలో చిక్కుకున్న ఆయన.. అది సద్దుమణగక ముందే కొత్త దుమారానికి తెరలేపారు. భారత్‌(India)ను విభిన్న దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చెప్పిన పోలికలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై భాజపా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన జాతి వివక్షకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది. ‘ది స్టేట్స్‌మన్’ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వం గురించి ఆయన మాట్లాడారు. ‘‘లౌకిక దేశాన్ని సాధించడం కోసం మన స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిషర్లతో పోరాడారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మన దేశమే ఉత్తమ నిదర్శనం. మనది వైవిధ్యమైన దేశం. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా.. పశ్చిమ వాసులు అరబ్బులుగా కన్పిస్తారు. ఇక ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయులుగా.. దక్షిణాది (South Indians) వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారు. ఇవన్నీ ఎలా ఉన్నా.. మనమంతా సోదరసోదరీమణులమే. భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లను పరస్పరం గౌరవించుకుంటాం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన మూలాల్లో పాతుకుపోయాయి’’ అని అన్నారు.

* హోం ఓటింగ్‌ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. 85 ఏళ్లు నిండిన వృద్ధుల కోసం గ్రామంలో ఎన్నికల అధికారులు హోం ఓటింగ్‌ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి పోలింగ్‌ ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైకాపాకి చెందిన వారు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో తెదేపాకు చెందిన కానాల పుల్లారెడ్డి, రావిపాటి నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను తొలుత సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను సత్తెనపల్లి తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. ఆయన సూచన మేరకు కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

* ఏపీ పాలిసెట్‌ ఫలితాలు (ap polycet 2024 results) విడుదలయ్యాయి. విజయవాడలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి బుధవారం ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్‌ 27న పాలిసెట్‌ నిర్వహించారు. మొత్తం 1.42లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, 1.24లక్షల మంది అర్హత పొందారు. 87.61శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో బాలికలు 89.81శాతం (50,710), బాలురు 86.16 శాతం(73,720) ఉత్తీర్ణత సాధించారు. ప్రవేశ పరీక్షలో పొందిన మొత్తం మార్కులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులకు ర్యాంకులు కేటాయించారు.

* ఓటమి భయంతో వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. దీని కోసం పాస్‌పోర్టులు కూడా సిద్ధం చేసుకున్నారన్నారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్‌రెడ్డి ఉన్నారని.. ఎంపీగా ఆయన గెలిస్తే నేరం గెలిచినట్లేనన్నారు. కడపలో వైకాపా సింగిల్‌ ప్లేయర్‌ అంటూ ఇటీవల సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి చేసిన వ్యాఖ్యలపై షర్మిల మండిపడ్డారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z