Fashion

థాయిల్యాండ్ వెళ్లే భారతీయులకు శుభవార్త

థాయిల్యాండ్ వెళ్లే భారతీయులకు శుభవార్త

థాయిలాండ్‌కు వెళ్లే భారతీయులకు అక్కడి ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రత్యేకంగా వీసా అవసరం లేకుండానే థాయిలాండ్‌ అందాలను చుట్టి రావచ్చు. సాధారణ పాస్‌పోర్టు ఉన్నవారు అక్కడ గరిష్ఠంగా 30 రోజుల పాటు పర్యటించవచ్చు.

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయిలాండ్ (Thailand) ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా భారత్‌, తైవాన్‌ దేశాల నుంచి వచ్చేవారు వీసా అవసరం లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు నవంబరు 10, 2023 నుంచి అనుమతిచ్చింది. ఈ గడువు మే 10, 2024తో ముగుస్తోంది. ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలు ఇస్తుండడంతో ఈ వెసులుబాటును మరో ఆరు నెలలపాటు పెంచుతున్నట్లు రాయల్‌ థాయ్‌ క్యాబినెట్‌ నిర్ణయించింది. నవంబర్‌ 11, 2024 వరకు ఇది వర్తిస్తుంది. అంతకుముందు ఈ పథకం (visa-on-arrival) ద్వారా కేవలం 15 రోజులు మాత్రమే అక్కడ ఉండడానికి వీలుండేది. చైనా, రష్యా, భారత్‌, దక్షిణ కొరియా, మలేసియా దేశాల నుంచి థాయిలాండ్‌కు భారీ సంఖ్యలో పర్యటకులు వెళ్తుంటారు. ఈ దేశాల టూరిజం మార్కెట్లను దృష్టిలోఉంచుకొని థాయ్‌ ప్రభుత్వం వీసా నిబంధనలను సడలిస్తోంది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 1.2 కోట్ల విదేశీ పర్యటకులు థాయిలాండ్‌లో పర్యటించారు. గతేడాది ఇదే కాలవ్యవధితో పోలిస్తే 39 శాతం పెరగడం గమనార్హం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z