NRI-NRT

చికాగోలో తెలుగు విద్యార్థి అదృశ్యం-CrimeNews-May 09 2024

చికాగోలో తెలుగు విద్యార్థి అదృశ్యం-CrimeNews-May 09 2024

* తమిళనాడులోని శివకాశి సమీపంలో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు జరగడంతో ఎనిమిది మంది మృత్యువాత పడగా.. 12 మందికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఫ్యాక్టరీకి లైసెన్స్‌ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మన దేశంలో బాణసంచా తయారీకేంద్రంగా శివకాశి ప్రసిద్ధిచెందిన విషయం తెలిసిందే.

* లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో ఈత నేర్చుకోవాలని చిన్నారి సరదా పడగా… ప్రమాదవశాత్తూ ఆమె ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తోట రవీంద్రారెడ్డి, మంజుల దంపతుల కుమార్తె మహిత(12) బుధవారం గ్రామంలోని చెరువులో ఈత నేర్చుకునేందుకు తోటి పిల్లలతో కలిసి వెళ్లింది. నడుముకు ఖాళీ క్యాన్‌ కట్టుకుని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలో నడుముకు ఉన్న క్యాన్‌ ఊడిపోయింది. అక్కడున్న పిల్లలు, పెద్దలు చూస్తుండగానే భయానికి గురైన మహిత నీటిలో మునగగానే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

* అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం కావడం కలకల రేపుతోంది. ఉన్నత విద్య కోసం చికాగో వెళ్లిన తెలంగాణకు చెందిన 25 ఏళ్ల రూపేష్‌ చంద్ర చింతకింది అదృశ్యం అయ్యాడు. అతని అచూకీ కోసం కుటుంబ సభ్యులు భారత రాయబార వర్గాలను సంప్రదించారు. చికాగోలోని ఎన్ షెరిడాన్ రోడ్ 4300 బ్లాక్ నుంచి అతను తప్పిపోయినట్లు తెలుస్తోంది. టెక్సాస్ నుండి కలవడానికి వచ్చిన ఒకరిని కలవబోతున్నాడని చెప్పినట్లు సమాచారం. ‘‘మే 2 మధ్యాహ్నం వాట్సాప్‌లో మాట్లాడాను. ఏదో పని మీద ఉన్నా అని చెప్పాడు. అంతే అప్పటినుంచి ఆఫ్‌లైన్‌లో ఉన్నాడు” రూపేష్‌ తండ్రి సదానందం. తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేశ్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. వారం రోజులుగా రూపేశ్ ఆచూకీ లభించకపోవడంతో హైదరాబాద్‌లోఉంటున్న అతని తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగా శాఖను కోరింది. త్వరలోనే రూపేశ్ అచూకీ తెలుస్తుందని ఆశిస్తున్నామని చికాగోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మే 2 నుంచి రూపేశ్ మిస్సయినట్లు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. అతడి ఆచూకి కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. రూపేష్ ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని స్థానిక పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

* ఒక మహిళ తన ఇద్దరు పిల్లల్ని చంపింది. ఆ తర్వాత బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. (Woman Jumps To Death) తాను తీసుకున్న ఈ నిర్ణయానికి భర్త చిత్రహింసలు, వేధింపులు కారణమని సూసైడ్‌ నోట్‌లో ఆరోపించింది. మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో కోణార్క్ నగర్ ప్రాంతంలోని హరి వందన్ అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై నుంచి 30 ఏళ్ల అశ్విని కిందకు దూకింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించింది.

* ఒక మహిళకు మరో వ్యక్తితో సంబంధంపై ఆమె మాజీ ప్రియుడు అసూయ చెందాడు. ఆ మహిళను హత్య చేసేందుకు ఆమె ఇంటికి వచ్చాడు. అయితే పెనుగులాటలో ఆమె కుమార్తెను కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటనలో ఆ మహిళ అల్లుడికి కూడా గాయాలయ్యాయి. (Ghaziabad Woman) ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇందిరాపురం ప్రాంతానికి చెందిన చంపా దేవి మొదటి భర్త చనిపోగా, వికలాంగుడైన రెండో భర్త బీహార్‌లో నివసిస్తున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న బాబీ జైలుకెళ్లాడు. కాగా, 15 రోజుల కిందట బాబీ జైలు నుంచి విడుదలయ్యాడు. చంపా దేవికి అజయ్‌ అనే వ్యక్తితో సంబంధం ఉండటం తెలిసి అతడు అసూయ చెందాడు. అజయ్‌కు ఫోన్‌ చేసి బెదిరించాడు. మరో వ్యక్తితో కలిసి మంగళవారం ఆమె ఇంటికి వెళ్లాడు. చంపాదేవిపై బాబీ కత్తితో దాడి చేయబోగా ఆమె కుమార్తె అయిన 18 ఏళ్ల జ్యోతి, అల్లుడు లలితేష్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జ్యోతి కత్తి పోట్లకు గురికాగా, ఆమె భర్తకు కూడా గాయాలయ్యాయి. మరోవైపు ఇంటి నుంచి బయటకు పరుగుతీసిన చంపా దేవి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఈ విషయం చెప్పింది. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులు బాబీని అరెస్ట్‌ చేశారు. జ్యోతిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న బాబీతో పాటు వచ్చిన మరో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. ఆరు నెలల కిందట పెళ్లైన జ్యోతి, క్యాన్సర్‌ రోగి అయిన తల్లి చంపా దేవికి సపర్యలు చేసేందుకు భర్తతో కలిసి పుట్టింటికి వచ్చిందని పోలీసులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z