Politics

తిరువూరులో ₹31లక్షలు పట్టివేత-NewsRoundup-May 10 2024

తిరువూరులో ₹31లక్షలు పట్టివేత-NewsRoundup-May 10 2024

* తాను అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్‌ సూటిగా సమాధానం చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి షర్మిల (YS sharmila) డిమాండ్‌ చేశారు. కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ‘రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ చేస్తున్నానని జగన్‌ అంటున్నారు. నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా? జైల్లో ఉన్నప్పుడు నన్ను పాదయాత్ర చేయమన్నది మీరు కాదా? నా భర్త, పిల్లల్ని వదిలేసి వేల కి.మీల మేర పాదయాత్ర చేశా. మీ భవిష్యత్‌ కోసం నా కాలికి గాయమైనా వెనక్కి తగ్గలేదు. పాదయాత్ర సమయంలో వైకాపా అంతా నా చుట్టే తిరిగింది. నాకే రాజకీయ కాంక్ష ఉంటే వైకాపాను నేను హైజాక్‌ చేసేదాన్ని కాదా? మీ నుంచి పైసా సాయం కోరినట్టయినా నిరూపించగలరా? మీరు వైఎస్‌ఆర్‌ కొడుకునని ఎందుకు మర్చిపోతున్నారు? ప్రపంచంలో రాజకీయ విబేధాలు ఉన్నవాళ్లు చాలా మంది ఒకే కుటుంబంలో ఉన్నారు. వేర్వేరు పార్టీలో ఉండి ఒకే కుటుంబంలో కొనసాగుతున్నవారు చాలా మంది ఉన్నారు’’ అని షర్మిల ఇటీవల జగన్‌ ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు.

* మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పులివెందులలో సింగిల్ ప్లేయర్‌గా ఉండేందుకే వివేకానంద రెడ్డిని హత్య చేశారని మాట్లాడారు. ఇంకా ఎవరినైనా హత్య చేయాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తనను నరికేస్తారా?లేక షర్మిలను నరికేస్తారా? అని అడిగారు. తనకు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని.. అన్నింటికీ తెగించే పోరాడుతున్నామని సునీత స్పష్టం చేశారు.

* పోలింగ్ దగ్గర పడుతున్న వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. నగరానికి చెందిన ప్రముఖ వస్త్ర, వడ్డీ వ్యాపారి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ దాడిలో సుమారు రూ.25 కోట్ల నగదు, ఇతర విలువైన దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు అధికార పార్టీకి చెందిన వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో వైకాపా నాయకుడు దారా శ్రీనివాసరావు ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధంగా ఉంచిన రూ.31లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు 18వ వార్డు వైకాపా కౌన్సిలర్‌ నీలిమ భర్త శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు ఏసీపీ ప్రకాశ్‌బాబు తెలిపారు.

* ఖలిస్థానీ అనుకూలవాదులపై చర్యలు తీసుకునే విషయంలో కెనడా (Canada) మెతక వైఖరిని భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (S Jaishankar) తూర్పారపట్టారు. వేర్పాటువాదులకు రాజకీయ వేదికను కల్పించడం ద్వారా.. చట్టపర పాలన కంటే ఓటు బ్యాంకే ముఖ్యమన్న ధోరణిని ఆ దేశం బయటపెట్టుకుంటోందని విమర్శించారు. ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వేర్పాటువాదానికి, హింసను సమర్థించేవారికి మద్దతు ఇవ్వడమనేది భావప్రకటన స్వేచ్ఛకు అర్థం కాదని స్పష్టం చేశారు. ఆ దేశంతో సత్సంబంధాల కోసం ఈ అంశాలను పక్కనపెట్టలేమని తేల్చిచెప్పారు.

* సార్వత్రిక సమరానికి సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన పోలింగ్‌ డేటా (voter turnout)లో వైరుద్ధ్యాలు ఉన్నాయంటూ ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీనిపై విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఇటీవల లేఖ రాశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ఆ వైరుద్ధ్యాలకు వ్యతిరేకంగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘంపై విశ్వసనీయత పడిపోయిందని, ఆ సంస్థ పూర్తి స్వతంత్రత, జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడటం అత్యావశ్యకమని పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను ఈసీ (Election Commission) తీవ్రంగా ఖండించింది.

* తమకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ అధికారులు ఆపడంతో ఆగ్రహించిన ఓ యువకుడు తనను వివాహం చేసుకోబోయే బాలిక తల నరికి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని మడికేరిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మడికేరిలోని సూర్లబ్బి గ్రామానికి చెందిన ప్రకాశ్‌ (32)కు అదే గ్రామానికి చెందిన బాలిక(16)తో వివాహాన్ని ఇటీవల పెద్దలు నిశ్చయించారు. గురువారం వీరికి నిశ్చితార్థం జరుగుతుండగా ఈ సమాచారం అందుకున్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ అధికారులు వచ్చి ఎంగేజ్‌మెంట్‌ను అడ్డుకున్నారు. బాలిక మైనర్‌ కాబట్టి వివాహం చేయకూడదని అలాచేస్తే జైలు శిక్ష పడుతుందని ఇరువురు కుటుంబాలకు అవగాహన కల్పించారు. దీంతో వారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు.

* ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లను క్రికెటర్లకు ఇచ్చింది. స్టార్‌ ప్లేయర్లు ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan), శ్రేయస్‌ అయ్యర్‌కు (Shreyas Iyer) మాత్రం దక్కలేదు. దేశవాళీ క్రికెట్‌లో ఆడకపోవడం వల్లే వారికి కాంట్రాక్ట్‌లు దక్కలేదని క్రీడా పండితులు విశ్లేషించారు. ఆ తర్వాత బీసీసీఐ నుంచి కూడా ఇలాంటి వ్యాఖ్యలే వచ్చాయి. అయితే, ఈ నిర్ణయం వెనక బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) వల్లే ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా ప్రధాన కార్యదర్శి జై షా (Jai shah) వెల్లడించారు. ‘‘మీరు ఒకసారి బీసీసీఐ రాజ్యాంగాన్ని చూసుకోండి. నేను కేవలం కన్వీనర్‌ను మాత్రమే. జట్టు ఎంపికలో నా పాత్ర చాలా తక్కువ. ఇషాన్, శ్రేయస్‌ సెంట్రల్ కాంట్రాక్ట్ పొడిగింపు విషయంలోనూ అజిత్‌ అగార్కర్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు ఆసక్తి చూపకపోవడం వల్లే వారిద్దరినీ పక్కనపెట్టాలని అజిత్ భావించాడు. నా పాత్ర కేవలం అమలుచేయడం వరకే ఉంటుంది. వారికి బదులు కొత్త ఆటగాళ్లను తీసుకున్నాం. దేశవాళీ వీరిద్దరితో తర్వాత నేను ప్రత్యేకంగా మాట్లాడా. మీడియాలోనూ కథనాలు వచ్చాయి. హార్దిక్‌ పాండ్య కూడా తాను పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమని చెప్పాడు. ప్రతీ ఆటగాడు డొమిస్టిక్‌లో ఆడాల్సిందే. అలాకాకుండా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి తీసుకుంటే ఫర్వాలేదు’’ అని తెలిపారు.

* ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు మాచర్ల పర్యటన రద్దయింది. ప్రతికూల వాతావరణం కారణంగా మాచర్ల ఎయిర్‌ రూట్‌ క్లిష్టంగా ఉందని, అటవీ ప్రాంతం మీదుగా వెళ్లాల్సి ఉన్నందున ప్రయాణం సాగించలేమని పైలట్‌లు చెప్పడంతో రద్దు చేసుకున్నారు. ఒంగోలు వెళ్లాలన్నా రూట్‌ డైవర్షన్‌ తీసుకుంటేనే సాధ్యమని చెప్పినట్టు సమాచారం. దీంతో నేరుగా ఒంగోలు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లోనే ఒంగోలు బయల్దేరారు.

*గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ.లక్షల కోట్లు ఇచ్చిందని, ఆ నిధులన్నీ అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ప్రధాని మోదీ విమర్శించారు. గతంలో భారాస ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం దోచుకుంటున్నాయని ఆరోపించారు. భారాస సర్కారు.. కాళేశ్వరం పేరిట లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా భారాస దారిలోనే వెళ్తోందని ని విమర్శించారు. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తోందని దుయ్యబట్టారు. తాను ఎవరి పేరూ చెప్పకపోయినప్పటికీ.. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారని, దీనిని బట్టి ఆ ట్యాక్స్‌ ఎవరు వసూలు చేస్తున్నారో అర్థమవుతోందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.

* ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చాలా దుర్మార్గమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్‌ సిద్ధమయ్యారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత తనదని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రఘురామకృష్ణరాజును హింసించారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉండిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘రాష్ట్రాన్ని పాలించేది అహంకారి, దోపిడీదారు, సైకో. మట్టి, ఆస్తులు కొట్టేసిన ఘనుడు జగన్‌. మద్యంతో వేల కోట్ల రూపాయలు దోచేశారు. సీఎంగా ఉన్నప్పుడు ఇసుకను ఉచితంగా ఇచ్చాను. ప్రజల భూములు కొట్టేయడానికి జగన్‌ సిద్ధమయ్యారు. మీ ఆస్తులపై కన్నేశారు. వారసత్వంగా వచ్చిన భూమిపై సైకో ఫొటో ఎందుకు? దీనికి మీరు అంగీకరిస్తారా? ఆమోదయోగ్యమేనా? భూమి మీది.. దానిపై పెత్తనం జలగ జగన్‌ మోహన్‌రెడ్డిది. అధికారంలోకి రాగానే రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలిస్తాం. ఈ ఎన్నికల్లో ఫ్యానుకు, వైకాపాకు ఉరేయాలి. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయని జగన్‌కు ఓటు అడిగే హక్కు లేదు’’ అని చంద్రబాబు అన్నారు.

* నగదు బదిలీ పథకాలపై ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి లేఖ రాసింది. బటన్‌ నొక్కి చాలా రోజులైనా.. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో ఎందుకు జమ చేయలేకపోయారని ప్రశ్నించింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తమ ముందుంచాలని స్పష్టం చేసింది. వారాల పాటు ఆపి ఇవాళే నిధులు జమ చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది. ఈ అంశంపై హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని లేఖలో ఈసీ పేర్కొంది. పోలింగ్‌ తేదీ ముందు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో వివరించాలని సూచించింది.

* లోక్‌సభ ఎన్నికల వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించింది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi Excise Policy Scam Case)లో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయనకు జూన్‌ 1 వరకు బెయిల్‌ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. రూ.50వేల పూచీకత్తు, అంతే మొత్తానికి ఒకరి ష్యూరిటీపై ఈ బెయిలిచ్చింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z