* ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో శుక్రవారం మరో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ సాగిస్తున్న భద్రతా బలగాలపై నక్సల్స్ కాల్పులకు దిగారు. ఇరువురి నడుమ ఎదురుకాల్పులు గంటలపాటు కొనసాగాయి. కాల్పుల అనంతరం ఘటనా ప్రాంతంలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఎం విష్ణుదేవ్ సాయ్ తెలిపారు. అదేసమయంలో, మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఒక బారెల్ గ్రెనేడ్ లాంఛర్, 12 బోర్ గన్, దేశవాళీ రైఫిల్, భారీగా పేలుడు పదార్థాలు లభించాయన్నారు. ఏప్రిల్ 16, 30వ తేదీల్లో చోటుచేసుకున్న భారీ ఎన్‌కౌంటర్లలో 39 మంది మావోయిస్టులు చనిపోవడం తెల్సిందే. బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాదిలో వివిధ ఎన్‌కౌంటర్లలో103 మంది నక్సల్స్ చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
* రోజు రోజుకి పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో అధిక సంఖ్యలో చదువుకున్న వ్యక్తులే బాధితులుగా ఉంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి వస్తున్న కాల్స్ ను బట్టి వారి క్వాలిఫికేషన్లను నమోదు చేశారు పోలీసులు. వీరిలో ఎక్కువ సంఖ్యలో గ్రాడ్యుయేట్లే బాధితులుగా ఉన్నట్లు తెలిసింది. చదువుకున్న వ్యక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ ముఠాలు యధేచ్ఛగా వారికి తెలియకుండానే వారి మొబైల్ ఫోన్లో నుండి డబ్బులు కాజేస్తున్నారు. గడచిన ఆరు నెలల వ్యవధి డేటాను పరిశీలిస్తే సైబర్ బారిన పడిన వారిలో సుమారు 38,000 మంది గ్రాడ్యుయేట్లు బాధితులుగా ఉన్నారు. వీరిలో నిరక్షరాశులు కేవలం 800 మంది మాత్రమే బాధితులుగా ఉన్నారు.
* ఇప్పుడు అంతా ఇన్‌స్టా రీల్స్ ట్రెండ్ కొనసాగుతోంది. జనాల్లో పాపులర్ అయ్యేందుకు చాలా మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయిస్తున్నారు. రకరకాల వీడియోలు, రీల్స్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ అమ్మాయి వీడియో వైరల్ అవుతోంది. చేతిలో తుపాకీతో హైవేపై డ్యాన్స్ చేస్తూ యువతి హల్‌చల్ చేసింది. దాంతో ఈ వీడియో నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపింది. ఇన్‌స్టా రీల్స్ పిచ్చితోనే ఆమె ఈ స్టెప్పులేసిందంటూ వీడియోపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అమ్మాయి చట్టం, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోందంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఈ వీడియోలో ఓ మహిళ లక్నోలోని హైవే మధ్యలో భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేసింది. చేతిలో తుపాకీ పట్టుకుని ఆకాశం వైపు చూపిస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియోను చిత్రీకరించారు. వీడియోలో కనిపించిన లక్నోకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ స్టార్ సిమ్రాన్ యాదవ్ హైవేపై ఇలా రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. హైవే మధ్యలో భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేస్తూ.. చేతిలో తుపాకీ పట్టుకుని ఆకాశం వైపు చూపిస్తూ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియోను లాయర్ కళ్యాణ్‌జీ చౌదరి X ఖాతాలో షేర్ చేయడం ద్వారా లక్నో పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
* ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏబీవీ పదవిలో ఉన్నపుడు పాల్పడిన అవినీతిపై ఏపీ ప్రభుత్వం సమర్పించిన వివరాలు పరిశీలించిన తర్వాత ఆయన ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతిచ్చింది. దీంతో త్వరలో అవినీతి కేసులో ఏబీవీ ప్రాసిక్యూషన్ ప్రారంభం కానుంది. టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీప్‌గా పనిచేస్తున్నప్పుడు సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డాడంటూ ఏబీపై అవినీతి కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి కావడంతో ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరైంది. ఇప్పుడు అనుమతి రావడంతో విచారణకు లైన్ క్లియరైంది.
* ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన పల్హాపూర్ గ్రామంలో శనివారం ఓ వ్యక్తి తన భార్య, తల్లి, ముగ్గురు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పల్హాపూర్‌కు చెందిన అనురాగ్ సింగ్(42) మద్యానికి బానిసై కుటుంబసభ్యులతో తరచూ గొడవ పడేవాడు. అతడిని వారు పలుమార్లు డి-అడిక్షన్ సెంటర్‌లో చేర్చడానికి ప్రయత్నించినా అతడు సహకరించలేదు. శనివారం అతడిని డి- అడిక్షన్ సెంటర్‌లో చేరుస్తామని కుటుంబసభ్యులు చెప్పడంతో అనురాగ్ తల్లి, భార్యతో గొడవపడ్డాడు. వారి మధ్య వివాదం ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అనురాగ్ తల్లిని కాల్చి చంపాడు. అనంతరం తన భార్య ప్రియాంక (40)ను సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఆపై వారి ముగ్గురు పిల్లలను ఇంటిపై నుంచి తోసేశాడు. దీంతో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయాడు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z