Politics

షర్మిలను గెలిపించమని విజయమ్మ వీడియో సందేశం-NewsRoundup-May 11 2024

షర్మిలను గెలిపించమని విజయమ్మ వీడియో సందేశం-NewsRoundup-May 11 2024

* దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకునే వ్యక్తి మనకు సీఎంగా ఉన్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 32వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే జగన్ ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు కాకినాడలో నిర్వహించిన సభలో పవన్‌ ప్రసంగించారు. ‘‘కాకినాడకు రక్షణ కల్పించే మడ అడవులను ధ్వంసం చేస్తున్నారు. గంజాయి, మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతోంది. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చా. నాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. సమాజంలో మార్పు రావాలనే రాజకీయాల్లోకి వచ్చా. పార్టీలు మారే వ్యక్తులు కాదు.. స్థిరంగా ఉండే వారు మనకు కావాలి. వైకాపాకు ఓటేస్తే చేజేతులా గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్టే. సమాజాన్ని కాపాడాలి.. ధర్మాన్ని నిలబెట్టాలి.. అదే నా విధానం. కాకినాడలో లా అండ్ ఆర్డర్‌ మెరుగుపడాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. వైకాపా ప్రభుత్వాన్ని మట్టిలో తొక్కకపోతే భవిష్యత్‌ లేదు. కూటమి ప్రభుత్వం రాగానే కాకినాడలో పాత విధానాలు అమలు చేస్తాం. శాంతిభద్రతలు పరిరక్షిస్తాం. పొత్తు కోసం ప్రధానిని ఒప్పించానంటే ఎంత కష్టపడి ఉంటానో ఆలోచించండి. వైకాపాది గూండాలు, అరాచక ప్రభుత్వం. మీ కోసం ఆలోచించండి. ద్వారంపూడి సంగతి నేను చూస్తా. మత్స్యకార సమాజాన్ని ద్వారంపూడి ఎలా అవహేళన చేశారో మీరు చూశారు. కూటమిదే అఖండ విజయం’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

* పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ.. ఏపీ సీఎం జగన్‌ తల్లి వైఎస్‌ విజయమ్మ కీలక ప్రకటన చేశారు. కడప కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్‌ను అభిమానించే, ప్రేమించే వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. వైఎస్సార్‌ బిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తోంది. కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి. ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా’’ అని విజ్ఞప్తి చేశారు. మరి కొన్ని గంటల్లో పోలింగ్‌ జరగనుండగా విజయమ్మ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆమె ఈమేరకు వీడియో సందేశం విడుదల చేశారు.

* కోల్‌కతా జట్టులో గౌతమ్ గంభీర్‌కు (Gautam Gambhir) ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది. ఆ ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్‌ ఖాన్‌తోనూ గంభీర్‌ స్నేహం మరువలేనిది. కేకేఆర్‌ను రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన గౌతమ్‌ గంభీర్‌ ప్రస్తుతం మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. గతేడాది లఖ్‌నవూకు వెళ్లిన అతడు తిరిగి కోల్‌కతాకు వచ్చేశాడు. ఐపీఎల్ 17వ సీజన్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగడానికి ప్రధాన కారణం గంభీర్ అనడంలో సందేహం లేదు. ఇవాళ ముంబయితో ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా కేకేఆర్‌ తలపడనుంది. ఈ క్రమంలో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్‌కు ఓ అభిమాని నుంచి విజ్ఞప్తి వచ్చింది. దానికి గంభీర్‌ రియాక్షన్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

* ఉద్యోగాలు కావాలంటే కూటమిని గెలిపించాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. నంద్యాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘‘అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ, రెండో సంతకం ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌ రద్దుపైనే చేస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. పింఛన్‌ తీసుకొచ్చిందే తెదేపా. రూ.200 పింఛన్‌ను రూ.2 వేలు చేశాం. దీన్ని రూ.4 వేలకు పెంచి ఏప్రిల్‌ నుంచే ఇస్తాం. దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్‌ అందజేస్తాం. మన భూమి పాసు పుస్తకంపై జగన్‌ ఫొటో ఎందుకు? దానిపై రాజముద్ర ఉండాలి.. సైకో ఫొటో కాదు. ల్యాండ్‌ టైటిలింగ్‌ ఆఫీసర్‌ అనే వ్యక్తిని జగన్‌ పెడుతున్నారు. మనకు ఏ సమస్య ఉన్నా ఆ అధికారి వద్దకే వెళ్లాలి. మీ భూమి మీరు అమ్ముకోవడానికి వీల్లేకుండా చేస్తున్నారు. మీ భూమి పోతే నేరుగా హైకోర్టుకు వెళ్లాలి. వైకాపా ప్రభుత్వం ఇంటి వద్ద పింఛన్‌ ఇవ్వకుండా శవ రాజకీయాలు చేస్తోంది’’ అని చంద్రబాబు విమర్శించారు.

* ఇటీవల హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అనంతరం లఖ్‌నవూ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు దాని యజమాని సంజీవ్‌ గోయంక క్లాస్‌ తీసుకొన్నట్లు వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తన్నాయి. ఈనేపథ్యంలో కేకేఆర్‌ జట్టు మెంటార్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) తనకు షారుక్‌ ఖాన్‌తో ఉన్న బంధాన్ని వెల్లడించాడు. తమ ఇద్దరి మధ్య మంచి విశ్వాసం ఉందని పేర్కొన్నాడు.

* చార్ ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్‌లోని యమునోత్రికి భక్తులు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. రద్దీ కారణంగా ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న కొండ ప్రాంతాల్లో భక్తులు గంటలతరబడి నిరీక్షించాల్సి వస్తోంది. యమునోత్రికి శనివారం జనం భారీగా పోటెత్తారు. హిమాలయాల్లోని యమునోత్రి దేవాలయం తెరుచుకున్న మొదటిరోజు నుంచి భక్తులు అధికసంఖ్యలో హాజరవుతున్నారు. దేవుడిని దర్శించుకోవడానికి గంటలతరబడి క్యూలో నిరీక్షిస్తున్నారు. ఆలయానికి వెళ్లే చిన్న కొండ మార్గంలో ఇరుకైన దారిలోనే రెండు గంటలకు పైగా నిల్చున్నామని, భద్రత, రద్దీ నిర్వహణపై అధికారులు తగిన చర్యలు తీసుకోవట్లేదని భక్తులు స్థానిక మీడియాతో తెలిపారు. ‘‘మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. సహాయం చేయడానికి అధికారులు కూడా అందుబాటులో లేరు. రెండు గంటలకు పైగా కొండల్లోనే చిక్కుకుపోయాం. చివరికి ఎలాగోలా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాం. ’’అని ఓ మహిళా భక్తురాలు ఆందోళన వ్యక్తంచేశారు. అక్షయ తృతీయ సందర్భంగా హిమాలయాల్లోని యమునోత్రి, కేదార్‌నాథ్, గంగోత్రి, బద్రీనాథ్‌ ఆలయాలు తెరుచుకున్నాయి. దాంతో శుక్రవారం నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో యమునోత్రి, కేదార్‌నాథ్ దేవాలయాల తలుపులు తెరుచుకున్నాయి. మధ్యాహ్నం 12.25 గంటలకు యమునోత్రి దేవాలయ తలుపులు తెరుచుకోవడంతో వేలాదిగా భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. హిందూమతంలో చార్ ధామ్ యాత్రకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. యేటా వేసవిలో మొదలై శీతాకాలం ప్రారంభమయ్యే వరకు నిర్వహించే ఈ యాత్రలో ప్రతీ సంవత్సరం లక్షల మంది భక్తులు పాల్గొని ఆలయాలను సందర్శిస్తారు.

* అప్పటికే కుమారుడి మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న తల్లిదండ్రులు.. ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనతో నిర్ఘాంతపోయారు. అంత్యక్రియల కోసం తరలిస్తోన్న బాలుడి మృతదేహం.. తమవెంట విమానంలో రాకపోవడంతో వారు అవాక్కయ్యారు. పాకిస్థాన్‌(Pakistan)లో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గిల్గిత్-బాల్టిస్థాన్‌లోని ఖర్మాంగ్ జిల్లాకు చెందిన ఆరేళ్ల ముజ్తాబా.. కణితి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో బాలుడిని రావల్పిండిలోని బెనజీర్‌ భుట్టో ఆసుపత్రిలో కొన్ని వారాల పాటు చికిత్స అందించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో గురువారం మృతి చెందాడు. ఆ వార్త బాలుడి తల్లిదండ్రుల్ని ఎంతో కుంగదీసింది. గుండె దిటవు చేసుకొని అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని సొంతూరు తరలించేందుకు సిద్ధమయ్యారు. కానీ రోడ్డు మార్గంలో వెళితే ఆలస్యమవుతుందని భావించి.. విమానంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడే వారి ఆలోచనంతా తలకిందులైంది.

* మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజూ నడిచే 339 సర్వీసులతో పాటు 11న 302, 12వ తేదీ 206 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ఒంగోలుకు 38, ఏలూరు 20, మచిలీపట్నం 23, విజయవాడ 45, గుంటూరు 18, నరసరావుపేట 26, నెల్లూరు 17, నంద్యాల 19, విశాఖపట్నానికి 4 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు వివరించారు.

* దేశంలో క్యాబ్‌ సర్వీసులను, విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను తయారుచేస్తున్న ఓలా గ్రూప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సర్వీస్‌ అయిన అజ్యూర్‌ నుంచి వైదొలిగింది. ఇకపై ఓలా గ్రూప్‌నకే చెందిన కృత్రిమ్‌ ఏఐ క్లౌడ్‌ సేవలను వినియోగించుకోనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) ప్రకటించారు. ఇటీవల ఆయన చేసిన ఓ పోస్ట్‌ను మైక్రోసాఫ్ట్‌ అనుబంధ సంస్థ అయిన లింక్డ్‌ఇన్‌ (LinkedIn) తొలగించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల భవీష్ అగర్వాల్ తన గురించి తాను తెలుసుకునేందుకు లింక్డ్‌ఇన్‌లోని ఏఐ బాట్‌లో ‘భవీష్‌ అగర్వాల్‌ ఎవరు?’ అని సెర్చ్‌ చేశారు. దీనికి బాట్‌ ఇచ్చిన సమాధానంలో తప్పులు గుర్తించారు. అతడు/ ఆయన ఉండాల్సిన చోటు వారు/ వాళ్లు ఉండడం చూసి.. దాన్ని స్క్రీన్‌ షాట్ తీసి పోస్ట్‌ చేశారు. పాశ్చాత్య విధానాలను గుడ్డిగా అనుసరిస్తే ఇలానే ఉంటుందంటూ కామెంట్‌ పెట్టారు. ఈ పోస్ట్‌ తమ విధివిధానాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ లింక్డ్‌ఇన్‌ దాన్ని తొలగించింది. దీనిపై భవీశ్‌ అగర్వాల్‌ మరో పోస్ట్‌నూ లింక్డ్‌ఇన్‌ డిలీట్‌ చేసింది. లింక్డ్‌ఇన్‌ నిర్ణయాన్ని భవీశ్‌ తప్పుబట్టారు. ఆ కంపెనీ చర్యకు ప్రతి చర్యగా ఓలా గ్రూప్‌.. మైక్రోసాఫ్ట్‌కు గుడ్‌బై చెప్పింది. మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్‌కు.. ఓలా ఇన్నాళ్లు అతిపెద్ద కస్టమర్‌గా ఉందని, లింక్డ్‌ఇన్‌ చర్యతో తమ అనుబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించినట్లు భవీశ్‌ పేర్కొన్నారు. వచ్చే వారం నుంచి తమ కృత్రిమ్‌ క్లౌడ్‌ సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. అజ్యూర్‌ నుంచి బయటకొద్దామనుకొనే ఏ ఇతర డెవలపర్‌కైనా ఏడాది పాటు ఉచితంగా క్లౌడ్‌ సేవలను అందిస్తామని ప్రకటించారు. ఓలా గ్రూప్‌నకు చెందిన ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ కంపెనీ అయిన కృత్రిమ్‌.. ఇటీవల క్లౌడ్‌ సేవలను కూడా ప్రారంభించింది.

* మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ రోజు అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు ఉటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నిల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. పోలింగ్‌ సమయం దగ్గర పడినందున నిఘా మరింత పెరుగుతుందన్నారు. జూన్‌ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం ఉందన్నారు. బందోబస్తు కోసం రాష్ట్రానికి కేంద్ర బలగాలు వచ్చాయని, 60వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.320 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. తనిఖీలకు సంబంధంచి 8వేలకు పైగా కేసులు నమో చేశామన్నారు. రాష్ట్రంలో 1.88 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారని వికాస్‌రాజ్‌ తెలిపారు.

* రానున్న ఐదేళ్లలో ఎస్సీల సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నిస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపాతో కలిసి వరంగల్‌ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మోదీ మూడోసారి ప్రధాని కావడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. నిజమైన ఎస్సీలకు రిజర్వేషన్లు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ నేత కడియం శ్రీహరి నిజమైన ఎస్సీ కాదని గతంలో రేవంత్‌రెడ్డి చెప్పారని.. నకిలీ ఎస్సీలు రిజర్వేషన్లు కొల్లగొడుతున్నారని ఆయన తెలిపారన్నారు. నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం శ్రీహరి కుమార్తెకు టికెట్‌ ఇచ్చారని ఎద్దేవా చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z