* బెట్టింగ్‌లకు అలవాటుపడి డబ్బులు పోగొట్టుకున్న కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముకేశ్ కుమార్(28) బెట్టింగ్, జల్సాలకు అలవాటుపడ్డాడు. ఈక్రమంలో ఇవన్నీ మానుకోవాలని తండ్రి సత్యనారాయణ పలుమార్లు హెచ్చరించాడు. బెట్టింగ్‌లో ముకేశ్ ఇప్పటివరకు రూ.2 కోట్లు పోగొట్టాడు. ఎన్నిసార్లు చెప్పినా మారకపోవడంతో శనివారం రాత్రి కుమారుడిపై తండ్రి సత్యనారాయణ దాడి చేశాడు. ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయాలై కుమారుడు మృతి చెందాడు. ముకేశ్ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మేడ్చల్‌లో ఉన్న ఇళ్లు, ప్లాటు బెట్టింగ్ కారణంగా అమ్మేశారని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
* నెల్లూరు జిల్లా కావలిలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. సైదాపురం మండలం చాగనం గ్రామానికి చెందిన బి.సుభాషిణి (55) అంగన్వాడీ ఆయాగా పని చేస్తున్నారు. అధికారులు ఆమెకు కావలిలో ఎన్నికల విధులు కేటాయించారు. దీంతో తన కుమారుడు విజయ్ (19)తో సుభాషిణి బయల్దేరారు. కావలి పట్టణంలోని రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఆమెను రైలు ఢీకొట్టింది. రైలు వస్తున్న విషయాన్ని గమనించకుండా ట్రాక్‌పైకి వెళ్లిన తల్లిని రక్షించే క్రమంలో కుమారుడూ ప్రాణాలు కోల్పోయాడు.
* విజయవాడ-విశాఖపట్నం జాతీయ రహదారిపై గుట్టుగా తరలిస్తున్న రూ.7 కోట్ల డబ్బు కట్టలు రోడ్డు ప్రమాదం కారణంగా బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల శివారు అనంతపల్లి గ్రామం వద్ద శనివారం ఉదయం 6 గంటల సమయంలో… వెనుక వస్తున్న లారీ ఢీకొనడంతో టాటా ఏస్ వాహనం బోల్తాపడింది. అందులోని రసాయన పొడి బస్తాల మధ్యలోంచి ప్లాస్టిక్ కవర్లలో భద్రపరిచిన నోట్ల కట్టల అట్టపెట్టెలు రోడ్డుపై పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అట్టపెట్టెలను స్వాధీనం చేసుకుని సమీపంలోని వీరవల్లి టోల్ ప్లాజాకు తరలించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.లక్ష్మీశివజ్యోతి, రెవెన్యూ అధికారుల సమక్షంలో నగదును లెక్కించి రూ.7 కోట్లుగా తేల్చారు. ఆ డబ్బును తెలంగాణలోని నాచారం న్యూకాంటినెంటల్ కెమికల్ పరిశ్రమ నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని మాధవి ఎడిబుల్, బ్రాన్ ఆయిల్ పరిశ్రమకు తరలిస్తున్నట్లు కొవ్వూరు డీఎస్పీ కేసీహెచ్ రామారావు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవరు పరారవగా.. వ్యాన్ డ్రైవరు వీరభద్రరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన నుంచి పొంతనలేని సమాధానాలు రావడంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీ కొట్టి నగరంలోని ఓ ఫ్లైఓవర్ (flyover) పై నుంచి కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. విశాఖ – ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌పై శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు బైక్‌పై అతివేగంగా వెళ్తూ డివైడర్‌ను ఢీ కొట్టారు. అనంతరం అదేవేగంతో గాల్లో ఎగిరి ఫ్లైఓవర్ నుంచి ఒక్కసారిగా కింద పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
* ప్రతివారం దైవదర్శనానికి వెళ్తున్న ముగ్గురు మహిళలు గోదావరినదిలో (Godavari river) పడి మృతి చెందిన విషాద ఘటన కోనసీమ (Konaseema ) జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఆత్రేయపురం మండలం చిలకలపాడు గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు ప్రతి వారం వాడపల్లి వేంకటేశ్వరస్వామి Venkateshwara Swamy ) ని దర్శించుకునేందుకు కాలినడకన బయలుదేరారు. గోదావరి నదిని దాటుతుండగా నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో వారు అందులో చిక్కుకుని మృతి చెందారు. మృతులు అనంతలక్ష్మి, కొప్పిరెడ్డి ఏసమ్మ, కర్రి సునితగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z