Health

పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి మృతి-NewsRoundup-May 12 2024

పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి మృతి-NewsRoundup-May 12 2024

* నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్‌ ఫైల్‌ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్‌డీపీవో రవీంద్రనాథ్‌రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది.

* తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓట్‌ బ్యాంక్‌ రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ (PM Modi) ఆరోపించారు. సందేశ్‌ఖాలీలో హింసకు గురైన మహిళలను ఆ పార్టీ గూండాలు బెదిరిస్తున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ, ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని ప్రసంగించారు.

* పౌరులకు తప్పనిసరి ఓటింగ్‌ ప్రక్రియను ప్రారంభించిన దేశాల్లో అర్జెంటీనా ఒకటి. బెల్జియం తర్వాత ఈ దేశమే ఓటింగ్‌ను తప్పనిసరి చేసింది. దాదాపు 112 ఏళ్ల నుంచి ఈ చట్టం నిరంతరాయంగా అమలవుతోంది. ఈ దేశంలో తొలుత పురుషులకు 1912 నుంచి ఓటింగ్‌ను తప్పనిసరి చేశారు. ఆ తర్వాత 1947 వరకు మహిళలకు ఓటుహక్కు రాలేదు. 1951 నుంచి ఇక్కడ మహిళలు కూడా తమ నాయకుడిని ఎన్నుకొంటున్నారు.

* ఎన్నికలు జరిగే సమయంలో కొందరి పేర్లు జాబితాలో మిస్‌ కావడం, మరికొందరు ఇతరుల పేరుతో దొంగ ఓట్లు వేయడం జరుగుతూనే ఉంటుంది. ఓటరు లిస్ట్‌లో మన పేరు లేకపోతే నిరాశగా వెనుదిరగడం తప్ప చేసేదేమీ ఉండదు. అయితే, మన పేరుతో మరొకరు ఓటు వేస్తే ఏం చేయాలి అన్న ప్రశ్న చాలామందికి వస్తుంటుంది. దానికి పరిష్కారమే సెక్షన్‌ 49(పి).

* సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖ నగరంలో భారీగా నగదు పట్టుబడింది. ఆర్కే బీచ్‌ సమీపంలోని పాండురంగాపురం వద్ద రూ. కోటిన్నర నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్నట్లు సీ విజిల్‌ యాప్‌ ద్వారా సమాచారం రావడంతో జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టారు.

* జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. వర్షం కారణంగా తలెత్తిన ఇబ్బందులపై టోల్‌ ఫ్రీ నంబర్లు 040 2111 1111, 90001 13667కు సమాచారం అందించాలని తెలిపారు.

* ప్రపంచంలోనే తొలిసారిగా అవయవ మార్పిడిలో భాగంగా పంది కిడ్నీ (pig kidney)తో ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకొని చరిత్ర సృష్టించిన 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ (Richard Slayman) మరణించారు. ఆయన స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. రెండు నెలల క్రితం మసాచుసెట్స్‌ (Massachusetts) జనరల్‌ ఆసుపత్రి వైద్యులు స్లేమాన్‌కు జన్యు మార్పిడి చేసిన పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు.

* బెయిల్‌పై బయటకొచ్చి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఆదివారం కీలక ప్రకటనలు చేశారు. భాజపా ‘మోదీ కీ గ్యారంటీ’ తరహాలోనే ‘కేజ్రీవాల్‌ కీ గ్యారంటీ’ పేరిట 10 హామీలను ప్రకటించారు. వీటిలో 24 గంటల ఉచిత విద్యుత్తు, వైద్యం వంటివి ఉన్నాయి.

* ముఖ్యమంత్రి జగన్‌ సభలకు ఆగమేఘాలపై బస్సులు సమకూర్చే ఆర్టీసీ అధికారులు.. సాధారణ ప్రయాణికుల సమస్యలను పట్టించుకోవడం లేదని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. ఓటు వేసేందుకు స్వస్థలాలకు వస్తున్న ఏపీ వాసుల కోసం అవసరమైన బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు.

* రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు సంబంధించి పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. అన్ని ప్రాంతాలకు సిబ్బందిని పంపిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్‌ స్టేషన్లకు వెళ్లే ముందు ఈవీఎంలను చెక్‌ చేసుకుంటున్నారని తెలిపారు. *పంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమంటే ఎంతో సాహసంతో కూడుకున్నది. అలాంటిది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 29 సార్లు విజయవంతంగా అక్కడ కాలుమోపి చరిత్ర సృష్టించాడు నేపాల్‌కు చెందిన కమీ రీటా (54). మే 12 ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఈ రికార్డును ఆయన నమోదు చేసినట్లు నేపాల్‌ అధికారులు వెల్లడించారు. అమెరికా, కెనడా, కజకిస్థాన్‌తోపాటు నేపాల్‌కు చెందిన 20మంది బృందం తాజాగా ఎవరెస్టును అధిరోహించింది. వీరిలో నేపాల్‌కు చెందిన కమీ రీటా ఒకరు. జనవరి 17, 1970లో జన్మించిన ఆయన.. ప్రస్తుతం సెవెన్‌ సమ్మిట్‌ ట్రెక్స్‌ అనే సంస్థకు గైడ్‌(షెర్పా)గా పనిచేస్తున్నారు. 1992లో తొలిసారిగా ఎవరెస్టు పర్వతారోహణ చేసిన కమీ.. అనేక సాహస యాత్రలు చేశారు. ఎవరెస్టు కాకుండా మౌంట్‌ కే2, చో ఓయూ, లోట్సే, మనస్లూ పర్వత యాత్రలను విజయవంతంగా పూర్తి చేశారు. గత సీజన్‌లో రెండు సార్లు (27, 28వ సారి) శిఖరాగ్రానికి చేరుకున్న ఆయన.. తాజాగా 29వసారి యాత్ర పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు.

* ఓట్ల పండుగతో భాగ్యనగరం బోసిపోయింది. సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. కోఠి, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు తగ్గాయి. రాత్రి పగలూ తేడా లేకుండా ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే నగర రహదారులు ప్రస్తుతం.. ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తెలంగాణలో లోకస్‌సభ, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరగనుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z