Business

లాభాల్లో భారత మార్కెట్లు-BusinessNews-May 13 2024

లాభాల్లో భారత మార్కెట్లు-BusinessNews-May 13 2024

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ 910 పాయింట్ల మేర పుంజుకోవడం గమనార్హం. సెన్సెక్స్ ఉదయం 72,476.65 (క్రితం ముగింపు 72,664.47) పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 71,866.01 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో రాణించి చివరికి 111.66 పాయింట్ల లాభంతో 72,776.13 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 48.85 పాయింట్లు లాభపడి 22,104.05 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.52గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు రాణించాయి. టాటా మోటార్స్‌, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, టైటాన్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్‌ చమురు బ్యారెల్‌ 82.87 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

* ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు రోజులుగా నిర్వహించిన తనిఖీల్లో పలువురు ప్రయాణికుల నుంచి రూ.13.56 కోట్ల విలువైన 22.14 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకూ మూడు రోజుల పాటు కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న 11 మంది ప్రయాణికులు పట్టుబడ్డారు.

* ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) భారత్ మార్కెట్లోకి టాటా నెక్సాన్ (Tata Nexon) న్యూ ఎంట్రీ లెవల్ వేరియంట్ కార్లను ఆవిష్కరించింది. పెట్రోల్ మోడల్‌లో స్మార్ట్ (ఓ), డీజిల్ మోడల్‌లో స్మార్ట్ +, స్మార్ట్ + ఎస్ కార్లు ఉంటాయి. కొత్తగా మార్కెట్లోకి ఎంటరైన నెక్సాన్ వేరియంట్లు.. మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3X0) కారుతో ఢీకొడతాయి. టాటా నెక్సాన్ స్మార్ట్ (ఓ) పెట్రోల్ వేరియంట్ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్), డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో వచ్చిన స్మార్ట్ + వేరియంట్ రూ.9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్), స్మార్ట్ + ఎస్ వేరియంట్ రూ.10.59 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతాయి. టాటా నెక్సాన్ న్యూ వేరియంట్లు అందుబాటు ధరలో ఉన్నాయి. పాత స్మార్ట్ మోడల్ కారుతో పోలిస్తే న్యూ స్మార్ట్ (ఓ) పెట్రోల్ వేరియంట్ రూ.15 వేలు, స్మార్ట్ + వేరియంట్ రూ.30 వేలు, స్మార్ట్ + ఎస్ వేరియంట్ రూ.40 వేలు తక్కువ ధరకు లభిస్తాయి. టాటా నెక్సాన్ టాప్ వేరియంట్ రూ.14.74 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. భారత్ మార్కెట్లో కియా సొనెట్, మారుతి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, నిస్సాన్ మ్యాగ్నైట్, రెనాల్ట్ కైగర్ మోడల్ కార్లతో పోటీ పడుతుంది. న్యూ ఎంట్రీ లెవల్ టాటా నెక్సాన్ కారులో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, 10.25 అంగుళాల టచ్ స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, డ్రైవ్ మోడ్, ఇల్యూమినేటెడ్ లోగోతోపాటు ట్విన్ స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ పవర్ విండోస్, సేఫ్టీ కోసం రివర్స్ పార్కింగ్ సెన్సర్ 6-ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ) వంటి ఫీచర్లు ఉంటాయి. టాటా నెక్సాన్ మరింత స్పోర్టీ, మోడ్రన్‌గా ఉంటుంది. ఫ్రంట్‌లో న్యూ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ స్ప్లిట్ హెడ్ ల్యాంప్ సెటప్, న్యూ డిజైన్డ్-మోర్ స్పోర్టీ లుకింగ్ బంపర్ కింద ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ అమరుస్తారు.

* హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో సంస్థ నార్వేకు చెందిన యారా క్లీన్ అమ్మోనియా పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద అమ్మోనియా పంపిణీదారుగా ఉన్న యారాక్లీన్‌ కంపెనీకు గ్రీన్‌కో పునరుత్పాదక అమ్మోనియాను సరఫరా చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో గ్రీన్‌కో సంస్థ అమ్మోనియా ఉత్పత్తి చేస్తోంది. ఈప్లాంట్‌ ప్రారంభం నుంచి కంపెనీ పునరుత్పాదక అమ్మోనియాను తయారు చేస్తోంది. దానికి సంబంధించిన పూర్తి కార్యకలాపాలు ఏఎం గ్రీన్‌ విభాగం పర్యవేక్షిస్తుంది. దాంతో టర్మ్‌షీట్‌పై ఏఎంగ్రీన్‌ సంతకం చేసింది. ఈ ఒప్పందంతో ఏంఎంగ్రీన్ ఫేజ్‌1 కేంద్రం ఉత్పత్తి చేస్తున్న పునరుత్పాదక అమ్మోనియా దాదాపు 50 శాతం యారాక్లీన్‌కే సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్ 2027 నాటికి 24 గంటలు కార్బన్ లేని కారకాల నుంచి అమ్మోనియాను తయారుచేయనుంది. ఏఎంగ్రీన్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి మాట్లాడుతూ..‘యారా క్లీన్ సంస్థ ఎరువుల తయారీ కంపెనీలకు, షిప్పింగ్, పవర్ ఇండస్ట్రీస్‌, ఇతర పరిశ్రమలకు పునరుత్పాదక అమ్మోనియా సరఫరా చేస్తోంది. అందులో గ్రీన్‌కో భాగమవ్వడం సంతోషకరం’ అని అన్నారు. యారా క్లీన్‌ అమ్మోనియా సీఈఓ హన్స్ ఒలావ్ రేన్ మాట్లాడుతూ..‘ఏఎంగ్రీన్ కాకినాడ ప్రాజెక్ట్‌లో తయారుచేస్తున్న పునరుత్పాదక అమ్మోనియాతో కంపెనీ పోర్ట్‌ఫోలియో విస్తరిస్తోంది. ఎరువుల ఉత్పత్తి, హైడ్రోజన్‌ ఎనర్జీలో ఉద్గారాలను తగ్గించడం, షిప్పింగ్ ఇంధనం, పవర్ పరిశ్రమల్లో హానికర ఉద్గారాలను తగ్గించేందుకు ఈ క్లీన్‌ అమ్మోనియా ఉపయోగపడుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z