* సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) మంగళవారం తన సిటింగ్ నియోజకవర్గం వారణాసి (Varanasi) నుంచి నామినేషన్ వేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎన్డీఏ నేతలు వెంటరాగా.. వరుసగా మూడోసారి ఆయన ఈ స్థానంలో నామపత్రాలు సమర్పించారు.
* చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా మూక దాడి ఘటనతో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాడి సమాచారం తెలుసుకున్న తెదేపా శ్రేణులు పద్మావతి మహిళా వర్సిటీ వద్దకు భారీగా చేరుకున్నారు. నానికి మద్దతుగా నిరసన తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జి చేయడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాడి చేసిన నిందితులను వదిలేసి తమపై పోలీసులు లాఠీ ఛార్జి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి తిరుపతి రణరంగంగా మారింది. మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు లాఠీ ఝుళిపించడంతో వారు కూడా నిరసనకు దిగారు. సీఐ రామచంద్రారెడ్డి తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
* గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో తనపై జరిగిన దాడి గురించి ఓటరు గొట్టిముక్కల సుధాకర్ స్పందించారు. తనపై చేయిచేసుకున్న వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంపను సుధాకర్ చెళ్లుమనిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని బాధితుడు సుధాకర్ ఆరోపించారు. పోలీసులు తన కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. సోమవారం జరిగిన దాడి గురించి పలు విషయాలు మీడియాకు వెల్లడించారు. క్యూలో వచ్చి ఓటేయాలని చెప్పినందుకే వైకాపా ఎమ్మెల్యే తనపై చేయిచేసుకున్నారని తెలిపారు. తాను ప్రతిఘటించడంతో ఎమ్మెల్యే కుటుంబసభ్యులు, అనుచరులు తనపై దాడి చేశారని వెల్లడించారు.
* తెలంగాణలో రాగల మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం, బుధవారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గురువారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఆవర్తనం ఏర్పడిందని వాతావరణకేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
* తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ (GV Prakash), ఆయన భార్య, గాయని సైంధవి (Singer Saidhavi) విడిపోతున్నట్లు ప్రకటించారు. 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వారు పోస్టు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ (AR Rehaman) మేనల్లుడు అయిన జీవీ ప్రకాశ్.. 2013లో తన బాల్య మిత్రురాలు సైంధవీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2020లో వారికి కూతురు పుట్టింది. ‘‘చాలా ఆలోచించిన తర్వాత ‘సైంధవి, నేను 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగుకోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక తరుణంలో మా గోప్యతకు భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి మేము వేరవుతున్నట్లు అంగీకరిస్తున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీ అవగాహన, మద్దతు చాలా అవసరం’’ అని జీవీ ప్రకాశ్ పేర్కొన్నారు.
* లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు భారాసకు మద్దతుగా నిలిచారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రైతు భరోసా వేయనందుకు రైతులు కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. సిరిసిల్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘అనేక హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. నెలకు రూ. 2500 ఇవ్వలేదని కాంగ్రెస్‌పై మహిళలు కోపంతో ఉన్నారు. భాజపాపై కూడా ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెంచారని మోదీపై కోపంతో ఉన్నారు. రెండు జాతీయ పార్టీలకు భారాస ముచ్చెమటలు పట్టించింది. మూడు పార్టీల్లో మా పార్టీకే అధిక ఎంపీ సీట్లు వస్తాయి. దిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా భాజపా-కాంగ్రెస్ వైఖరి ఉంది. ఆరేడు సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి భాజపాకు సహకరించారు. కేంద్రంలోనూ ఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం వచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమిదే కేంద్రంలో అధికారం’ అని కేటీఆర్ అన్నారు
* దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Excise Policy Scam Case) కేసులో ఆమ్‌ఆద్మీపార్టీ (AAP) పేరును నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు దిల్లీ హైకోర్టుకు ఈడీ వెల్లడించింది. ఇదే జరిగితే.. ఈ దర్యాప్తు సంస్థ చరిత్రలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును నిందితులుగా ప్రస్తావించినట్లవుతుంది. ఆప్ నేత, దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా బెయిల్ పిటిషన్‌పై జరిగిన విచారణలో భాగంగా.. ఈ కేసులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేస్తామని, అందులో పార్టీ పేరు ఉంటుందని ఈడీ తెలిపింది. మద్యం కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు ఆమ్‌ఆద్మీ పార్టీ అయినప్పుడు.. ఆ పేరును నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని గతేడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించింది. ఆ నేపథ్యంలో ఈడీ దీనిపై కసరత్తు ప్రారంభించింది. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో వివిధ వ్యక్తుల నుంచి అందిన రూ.100 కోట్ల ముడుపులను ఆప్.. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వినియోగించిందని ఈడీ ఆరోపించింది. తాజాగా సిసోదియా బెయిల్‌ను వ్యతిరేకిస్తూ.. అనుబంధ ఛార్జిషీట్ గురించి ప్రస్తావించింది.
* ఏపీ సీఎం జగన్ (YS Jagan) విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 16 నుంచి జూన్ 1 వరకు యూరప్ పర్యటనకు సీఎం అనుమతి కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది. ఇరు వైపులా వాదనలు విన్న కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ వివరాలు కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని జగన్‌ను ఆదేశించింది.
* మద్యం కుంభకోణం కేసుతో సతమతమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి వివాదాల్లోకెక్కింది. దిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సహాయకుడు బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారని ఆప్ (AAP) రాజ్యసభ ఎంపీ, దిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ స్వాతి మాలీవాల్ (Swati Maliwal) చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీనిపై తాజాగా పార్టీ సీనియర్ ఎంపీ సంజయ్‌సింగ్ (Sanjay Singh) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెపై దాడి జరగడం నిజమేనన్నారు. స్వాతి చేసిన ఆరోపణలపై సంజయ్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘కేజ్రీవాల్ నివాసం (Kejriwal Residence)లోని డ్రాయింగ్ రూంలో స్వాతి సీఎం కోసం ఎదురుచూస్తుండగా.. బిభవ్ కుమార్ (PA Bibhav Kumar) అక్కడికి వెళ్లాడు. ఆమెతో అమర్యాదగా ప్రవర్తించాడు. దాడి చేశాడు. ఇది తీవ్రంగా ఖండించాల్సిన ఘటన. దీన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. బిభవ్‌పై కఠిన చర్యలు తీసుకుంటారు’’ అని ఆప్ ఎంపీ అందులో పేర్కొన్నారు.
* మ్యాచ్‌లో జట్టు అవసరాన్ని బట్టి ఆటగాడిని మార్చుకొనే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) బలంగా సమర్థించారు. టోర్నీ తీరును అది సమూలంగా మార్చేసిందని అభిప్రాయపడ్డాడు. తాజాగా రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ ‘‘ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన మంచిది. పరిస్థితిని బట్టి ఆటలో జట్టు ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇతర ఆటల్లో కూడా ఇలాంటి నిబంధనలున్న విషయం మీకు తెలుసు కదా. ఇటీవల ఐపీఎల్‌లో ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లు ఈ నిబంధన ఫలితమే. అంటే ఐపీఎల్‌లో ఇది పెద్ద మార్పు తెచ్చిందనే అర్థం. అసలు ఏదైనా కొత్త రూల్ వస్తే అది సరికాదు అని చెప్పేందుకు జనం ప్రయత్నిస్తారు. ఇటీవల 200, 190 స్కోర్లను చూస్తే ఆ అవకాశం పొందిన ఆటగాళ్ల ఆటను తెలియజేస్తోంది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నారు.
* బిహార్‌కు చెందిన ఓ మహిళ నడవలేని స్థితిలోనూ తన ఓటు హక్కును వినియోగించుకుని పౌరులందరికీ ఆదర్శంగా నిలిచారు. దర్భాంగాలోని చౌగ్మా ప్రాంతానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు సుభద్రాదేవి ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నారు. అయినా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే ఆశయంతో కుటుంబసభ్యుల సహాయంతో స్ట్రెచర్‌పై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె కుమారుడు విజయ్ కుమార్ మిశ్ర మాట్లాడుతూ ‘‘మా అమ్మ చాలాకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. చివరి కోరికగా ఓటు వేయడానికి తీసుకెళ్లమని అడిగింది. అధికారుల సహాయంతో ఆమె ఆశయం నెరవేర్చాం’’ అని తెలిపారు.
* ఐరోపా, బ్రిటన్‌లోకి వేల సంఖ్యలో మనుషులను అక్రమ రవాణా చేసిన కింగ్‌పిన్ ‘ది స్కార్పియన్’ను ఎట్టకేలకు ఇరాక్‌లో అరెస్టు చేశారు. అతడి గ్యాంగ్ ఏకంగా 10,000 మందిని అక్రమంగా ఇంగ్లిష్ ఛానెల్ దాటించి బ్రిటన్‌లోకి చేర్చి ఉంటుందని అంచనా. స్కార్పియన్ అసలు పేరు బర్జాన్ మాజిద్. ఇటీవల బ్రిటన్‌కు చెందిన బీబీసీ చేసిన ఇన్వెస్టిగేషన్‌లో అతడిని ఇరాక్‌లోని సులేమానియా సిటీలో గుర్తించారు.
* చాబహార్ పోర్టు (Chabahar port) నిర్వహణకు సంబంధించి భారత్, ఇరాన్ (Iran and India) మధ్య తాజాగా కీలక ఒప్పందం జరిగింది. ఈ డీల్ గురించి అగ్రరాజ్యం అమెరికా స్పందిస్తూ న్యూదిల్లీని పరోక్షంగా హెచ్చరించింది. ట్రెహాన్‌తో వ్యాపార లావాదేవీలు జరిపే దేశాలపై తాము ఆంక్షలకు వెనుకాడబోమని స్పష్టం చేసింది.
* ముంబయిలో హోర్డింగ్ కూలిన (Mumbai hoarding collapse) ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని ముంబయి పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తెలిపారు.
* ఓ పక్క దిల్లీలో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ ఆప్ (AAP) నేతలను వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ సారి ఏకంగా తనపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహాయకుడు సీఎం బంగ్లాలో దాడి చేసినట్లు సొంతపార్టీ మహిళా ఎంపీనే ఆరోపించింది. దిల్లీలో ఈ అంశం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z