Politics

ఈసీని ఎలా నమ్మాలి?-NewsRoundup-May 15 2024

ఈసీని ఎలా నమ్మాలి?-NewsRoundup-May 15 2024

* పల్నాడు, చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల్లోనూ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాలను ఆదేశించింది. ఈ ఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ సమన్లు పంపింది. హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే హెచ్చరికలు ఉన్నా .. పోలింగ్ రోజు అంత నిర్లిప్తంగా ఎందుకు వ్యవహరించారని ఈసీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈమేరకు ఇద్దరు అధికారులు గురువారం దిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు. ఎన్నికలతో పాటు అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపట్ల స్థానిక అధికారులు నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా వదిలేసినట్టు ఈసీ గుర్తించింది. పల్నాడులో స్వయంగా పర్యటించిన ఏపీ ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా ఈ అంశాలను నేరుగా సీఈసీకి నివేదించినట్టు తెలుస్తోంది.

* పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని కుంకులగుంటలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం నేత కనుమూరి బాజీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియడంతో ఆ పార్టీ కార్యకర్తలు భారీగా గ్రామానికి చేరుకున్నారు. వైకాపా నేతల ఒత్తిడితోనే కనుమూరిని నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారని కార్యకర్తలు ఆరోపించారు. పోలీసులతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వాహనాలను అడ్డుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున.. ఎలాంటి దాడులు, ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే బాజీని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పోలింగ్‌ సమయంలో బాజీ చౌదరితో పాటు ఆయన బంధువులపైనా వైకాపా దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. పల్నాడు జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్భందం చేశారు.

* అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. దాని ప్రభావంతో మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ కారణంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి సికింద్రాబాద్‌ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి తెలిపారు. ఆయన్ను చూసేందుకు కార్యకర్తలు రావొద్దని విజ్ఞప్తి చేశారు. వైద్య నిర్ధరణ పరీక్షలు పూర్తయిన తర్వాత బులెటిన్‌ విడుదల చేస్తామని వైద్యులు ప్రకటించారు.

* నాలుగు దశల ఎన్నికలు ముగిసేసరికి విపక్ష ఇండియా కూటమి (INDIA bloc) బాగా బలపడిందని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి ఆయన లఖ్‌నవూలో జరిగిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కూటమి అధికారంలోకి వస్తే ప్రతీ పేదవాడికి 10 కిలోల రేషన్‌ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు.

* తెలంగాణలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేయనున్నారు. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని నిర్వాహకులు తెలిపారు. దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించామన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్‌ అద్దెలు పెంచాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ప్రదర్శనలు కొనసాగిస్తామని తెలిపారు.

* ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు హీరోయిన్ జాన్వీకపూర్‌ (Janhvi Kapoor). ఈ చిత్రం షూటింగ్‌ విశేషాలను తాజాగా పంచుకున్నారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినట్లు చెప్పారు. ‘ఈ చిత్రం కోసం ‘మిలీ’ సినిమా షూటింగ్‌ సమయంలోనే శిక్షణ ప్రారంభించాను. పూర్తిగా నేర్చుకోవడానికి రెండేళ్లు పట్టింది. నా కోచ్‌లు నన్ను పూర్తి క్రికెటర్‌గా మార్చారు. నిజానికి వీఎఫ్‌ఎక్స్‌తో దర్శకుడు అనుకున్న సన్నివేశాలను చిత్రీకరించొచ్చు. కానీ, ఆయన ప్రతీ సీన్‌ సహజంగా ఉండాలని కోరుకున్నారు. అందుకే అలా చేయలేదు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నాకు ఎన్నో గాయాలయ్యాయి. రెండు భుజాలు పనిచెయ్యవేమో అనుకున్నా. నా ఇద్దరు కోచ్‌లు క్రికెట్‌ నేర్పడం కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ చిత్రం విడుదలయ్యాక నా పాత్రకు వచ్చే ప్రశంసలన్నీ వాళ్లకే దక్కుతాయి. ఎన్నోసార్లు ఈ సినిమా నుంచి వైదొలగాలని భావించా. వాళ్లు నాకు ధైర్యం చెప్పారు’ అని జాన్వీ వెల్లడించారు.

* తన సినిమా విషయంలో ఆన్‌లైన్‌ వేదికగా విమర్శలు ఎదుర్కొంటున్న మలయాళ స్టార్‌ నటుడు మమ్ముట్టి (Mammootty)కి కేరళ రాజకీయ నేతలు బాసటగా నిలుస్తున్నారు. ఆయన తమ రాష్ట్రానికి గర్వకారణం అంటూ మద్దతు తెలియజేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిదంటే..? మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో ‘పుళు’ పేరుతో ఒక సినిమా వచ్చింది. రథీనా దీనికి దర్శకత్వం వహించారు. ఆమె దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా అది. అయితే అందులోని సన్నివేశాలు ఒక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ ·రెండేళ్ల క్రితం వచ్చిన సినిమాపై ఇప్పుడు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం.. ఆ మహిళా దర్శకురాలి భర్త. ఆయన ఒక ఆన్‌లైన్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఆ చిత్రం ఒక వర్గానికి వ్యతిరేకంగా ఉందనడమే గాక, అలాంటి చిత్రంలో నటించడంపై మమ్ముట్టిని తప్పుపట్టారు. పలువురు నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ మలయాళ స్టార్‌ను ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఆయన అభిమానులు, స్థానిక నేతలు ఆయనకు అండగా నిలుస్తూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు. కేరళ రాష్ట్ర మంత్రులు వి.శివన్‌కుట్టి, కె.రాజన్‌, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ వంటి సీనియర్ నేతలు ఆ జాబితాలో ఉన్నారు. మమ్ముట్టి (Mammootty)తో దిగిన ఫొటోను షేర్ చేసిన శివన్‌.. ఆయన మలయాళ ప్రజలకు గర్వకారణమన్నారు. ఇది కేరళ అని, ఇక్కడ అలాంటి వ్యవహారాలు పని చేయవన్నారు. రాష్ట్రంలోని లౌకికవాద సమాజం అలాంటి ప్రచారానికి మద్దతు ఇవ్వదని కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రస్తుతానికి ఈ స్టార్ యాక్టర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

* ఎన్నికల కమిషన్‌ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని.. టీడీపీ దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులకు చేశారు.ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పోలింగ్‌ సమయంలో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ తెగబడ్డారు.పోలింగ్‌ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసింది. టీడీపీ దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం’’ అని సజ్జల చెప్పారు. ‘‘రిగ్గింగ్‌ చేయాలనే ఆలోచనతో దాడులకు తెగబడ్డారు. కూటమి నేతలు చెప్పినచోటే పోలీసు అధికారులను మార్చారు. ఈసీ నియమించిన పోలీస్‌ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదు. టీడీపీ నేతలు ఇచ్చి పార్టీకి పోలీస్‌ అబ్జర్వర్‌ హాజరయ్యారు. పోలింగ్‌కు ముందే పోలీస్‌ ఉన్నతాధికారులను మార్చేశారు. ఎక్కడైతే పోలీస్‌ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగింది. ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.

* ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్‌, అప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురైన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. ఈ క్రమంలో భాగంగా తొలిసారి.. 14 మందికి భారత పౌరసత్వం సర్టిఫికెట్‌ను బుధవారం అందజేసింది. సీఏఏ చట్టం కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో తొలి విడతలో భాగంగా 14 మందికి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. సీసీఏ కింద ఢిల్లీలోని 300 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు అందజేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. కాగా, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురై భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర ప్రజలకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను 2019లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దీని కోసం పౌరసత్వ చట్టాన్ని సవరించింది. 2014 డిసెంబర్ 31కు ముందు భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర వలసదారులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు దీనికి అర్హులని కేంద్రం పేర్కొంది. అలాగే అర్హత వ్యవధిని 11 నుంచి 5 సంవత్సరాలకు తగ్గించింది. 2019 డిసెంబర్‌లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందింది. అనంతరం దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆమోద ముద్ర వేశారు. సీఏఏ అమలుపై గత మార్చిలో కేంద్ర ప్రభుత్వం నోటిషికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. భారత పౌరసత్వం మంజూరుకు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 81.86 శాతం పోలింగ్‌ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా తెలిపారు. 3,500 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్‌ జరిగిందని పేర్కొన్నారు. ఆఖరి పోలింగ్‌ కేంద్రంలో అర్థరాత్రి 2 గంటలకు పూర్తైందన్నారు. మొత్తం 350 స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీఎంలు భద్రపరిచినట్లుచెప్పారు. రాష్ట్రంలో తుదిపోలింగ్‌ శాతం వివరాలను ఏపీ సీఈవో బుధవారం వెల్లడించారు. అయితే అసెంబ్లీకి ఓటేసి కొందరు లోక్‌సభకు ఓటేయలేదని తెలిపారు ఎంకే మీనా. పార్లమెంట్‌కు 3 కోట్ల 33 లక్షల 4560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. దర్శిలో అత్యధికంగా 90.91 శాతం.. తిరుపతిలో అత్యల్పంగా 63.32 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ పోలింగ్‌ శాతం జరిగిందని.. నాలుగు దశల్లో ఏ రాష్ట్రంలోనూ ఇంత పోలింగ్‌ జరగలేదని అన్నారు. ‘కుప్పంలో 89.88 శాతం పోలింగ్‌ నమోదైంది. నాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ఈవీఎంల ద్వారా 80.66 శాతం పోలింగ్‌ నమోదు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 1.20 శాతం నమోదు. 2014 ఎన్నికల్లో 78.41 శాతం. 2019 ఎన్నికల్లో 79.77శాతం పోలింగ్‌ నమోదు. అత్యల్పంగా విశాఖ లోక్‌సభ స్థానంలో 71.11 శాతం పోలింగ్‌. గత ఎన్నికలతో పోలిస్తే 2.09శాతం పోలింగ్‌ పెరిగింది నాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. అల్లర్లు సృష్టించిన నిందితులను ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్‌ చేస్తాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠిన చర్యలు. ఈవీలఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తాం. 715 ప్రాంతాల్లో పోలీస్‌ పికెట్‌ కొనసాగుతోంది. స్ట్రాంగ్‌ రూమ్‌ల దగ్గర పార్టీలకు చెందిన ప్రతినిధి 24 గంటలు ఉండవచ్చు’ అని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z