* భారత క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar)కు నిత్యం రక్షణగా నిలుస్తున్న ఒక గార్డు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(SRPF) జవాన్ అయిన ప్రకాశ్ కాప్డే.. సచిన్ వీవీఐపీ సెక్యూరిటీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మహారాష్ట్రలోని జామ్నెర్ పట్టణంలోని అతడి స్వస్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కాప్డే (39) కొన్ని రోజులు సెలవు తీసుకొని తన స్వగ్రామానికి వెళ్లినట్లు ఆ అధికారి తెలిపారు. అక్కడే తన సర్వీస్ తుపాకీతో మెడపై కాల్చుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంట్లోనే అతడు ప్రాణాలు తీసుకున్నట్లు జామ్నర్ పోలీసులు వెల్లడించారు. ‘‘ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు. విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడవుతాయి’’ అని చెప్పారు. అతడికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాప్డే వీవీఐపీ సెక్యూరిటీలోని గార్డు కావడంతో.. ఈ ఘటనపై ఎస్ఆర్‌పీఎఫ్ స్వతంత్ర దర్యాప్తు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
* పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆరుగురు అనుమానితులను రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తిరుపతికి తరలించి రహస్యంగా విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న జడ్పీటీసీ సభ్యురాలి భర్త భానుప్రకాష్‌రెడ్డి, నడవలూరు సర్పంచ్ గణపతిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
* ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వృద్ధ దంపతులు సూర్యనారాయణ, రుక్మిణి అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. బోనకల్ మండలం ముష్టికుంట్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న యువకులిద్దరినీ ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వృద్ధ దంపతులు మామిళ్లగూడేనికి చెందినవారిగా గుర్తించారు.
* ఫ్రాన్స్‌లో డ్రగ్స్ గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. తమ నాయకుడిని తరలిస్తున్న కాన్వాయ్‌పై హాలీవుడ్ సినిమా తరహాలో భారీ గన్స్‌తో దాడి చేసి.. గార్డులను చంపి మరీ గ్యాంగ్ లీడర్‌ను విడిపించుకుపోయింది. దీంతో ఫ్రాన్స్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. నిందితుల కోసం దేశవ్యాప్తంగా గాలింపు మొదలుపెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద కొకైన్ మార్కెట్‌గా పేరున్న ఫ్రాన్స్‌లో మహమ్మద్ అమ్రా ఓ మాదకద్రవ్యాల గ్యాంగ్‌కు అధిపతి. ‘ది ఫ్లై’ పేరుతో అమ్రాను పిలుస్తారు. అతడిని అరెస్టు చేసిన అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా.. ఓ దోపిడీ కేసులో మే 10న 18 నెలలు శిక్షపడింది. మంగళవారం మరో కేసులో విచారణ నిమిత్తం 35 మైళ్ల దూరంలోని రోయూన్ పట్టణం నుంచి నార్మండీలోని ఎవురెక్స్‌కు తీసుకొని జైలు సిబ్బంది కాన్వాయ్‌తో బయల్దేరారు. మార్గం మధ్యలో ఇంక్రావిల్లే అనే ప్రాంతంలోని టోల్‌బూత్ దాటుతుండగా.. ఓ నల్ల ఎస్‌యూవీ కారు ఎదురుగా వచ్చి కాన్వాయ్‌ను ఢీకొంది. వెంటనే కొందరు గన్‌మెన్‌లు ఆటోమేటిక్ ఆయుధాలతో విచక్షణా రహితంగా ఆ కాన్వాయ్ చుట్టు తిరుగుతూ కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు గార్డ్స్ చనిపోగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సాయుధులు ‘ది ఫ్లై’ను తీసుకొని రెండు కార్లలో పరారయ్యారు. కొంత దూరంలో ఈ వాహనాలకు నిప్పు పెట్టి వేరే వాటిల్లో వెళ్లిపోయారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z