Business

గణనీయ ఆర్థికవృద్ధి వైపు భారత్-BusinessNews-May 17 2024

గణనీయ ఆర్థికవృద్ధి వైపు భారత్-BusinessNews-May 17 2024

* ప్రముఖ టెక్‌ కంపెనీ యాపిల్‌ తన ఐఫోన్‌, ఐప్యాడ్‌లకో కొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. దివ్యాంగులు కూడా సులభంగా యాపిల్‌ డివైజ్‌లను యాక్సెస్‌ చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయని పేర్కొంది. ఈ ఏడాది చివరికి అందుబాటులోకి రానున్న ఫీచర్లలో ఐట్రాకింగ్‌, మ్యూజిక్‌ హాప్టిక్స్‌, వోకల్‌ షార్ట్‌కట్‌లు ఉండనున్నాయి. ఐ ట్రాకింగ్‌ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సాయంతో పనిచేస్తుంది. వినియోగదారులు కంటి కదలికలతో ఐప్యాడ్‌లు, ఐఫోన్‌లను నియంత్రించొచ్చు. ప్రత్యేక అవసరాలు కలిగినవారు ఫోన్‌ను సులభంగా నావిగేట్ చేయడానికి వీలుగా ఆన్-డివైస్ మెషీన్ లెర్నింగ్ (ML) ఫీచర్లు తీసుకురానున్నారు. యాపిల్‌ డివైజుల్లో ముందువైపున్న కెమెరా కేవలం కొన్ని సెకెన్లలోనే మీ కళ్లను ట్రాక్ చేస్తుంది. స్క్రీన్‌ను టచ్‌ చేయకుండానే కంటితో చూస్తూ నావిగేట్‌ చేయొచ్చు. అయితే దీని వల్ల గోప్యతకు ఎటువంటి భంగం వాటిల్లదని కంపెనీ చెబుతోంది. అన్ని యాప్‌లను యాక్సెస్ చేసేందుకు ఈ ఫీచర్లు సాయపడతాయి. దీనికోసం అదనపు హార్డ్‌వేర్‌, ఎటువంటి యాక్సెసరీలు అవసరం లేదు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీ (Stock Market)లు ఆ తర్వాత కీలక రంగాల్లో మదుపర్ల కొనుగోళ్ల అండతో కోలుకున్నాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ (Sensex) 250 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ (Nifty) 22,450 మార్క్‌ పైన స్థిరపడింది. క్రితం సెషన్‌లో 600 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్‌.. ఈ ఉదయం 73,711.31 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. తొలి సెషన్‌లో ఒడుదొడుకులను ఎదుర్కొన్న సూచీ.. ఆ వెంటనే పుంజుకుని ఇంట్రాడేలో 74వేల మార్క్‌ను దాటి ట్రేడ్‌ అయ్యింది. చివరకు 253.31 పాయింట్ల లాభంతో 73,917.03 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 22,345-22,502 పాయింట్ల మధ్య ఊగిసలాడి మార్కెట్‌ ముగిసేసరికి 62.25 పాయింట్ల లాభంతో 22,466.10 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు పెరిగి 83.34గా ఉంది. నిఫ్టీలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గ్రాసిమ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, భారత్‌ పెట్రోలియం షేర్లు రాణించగా.. టీసీఎస్‌, సిప్లా, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి.

* ప్రపంచంలో 100 బిలియన్‌ డాలర్లకు పైగా సంపద కలిగిన ‘సూపర్‌-రిచ్‌’ క్లబ్‌లో (Super Rich Club) 15 మంది చేరారు. ఈ జాబితాలోకి ఇంతమంది చేరడం ఇదే తొలిసారి. వీరిలో భారత్‌ నుంచి గౌతమ్‌ అదానీ (Gautam Adani), ముకేశ్‌ అంబానీ కూడా ఉండడం విశేషం. కృత్రిమ మేధ, విలాసవంత వస్తువులకు గిరాకీ, భౌగోళిక రాజకీయాల్లో మార్పుల కారణంగానే వీరందరి సంపద పెరిగింది. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. ‘సూపర్‌-రిచ్‌’ జాబితాలోని 15 మంది సంపద ఈ ఏడాది 13 శాతం పెరిగి 2.2 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. ద్రవ్యోల్బణం, స్టాక్‌ మార్కెట్‌ రాబడులను అధిగమించి వీరి సంపద వృద్ధి చెందింది. ప్రపంచంలోని తొలి 500 మంది సంపన్నుల సంపదలో పావు వంతు ఈ 15 మంది వద్దే ఉండడం గమనార్హం. ఈ జాబితాలో ఉన్నవారి సంపద గతంలోనే 100 బిలియన్‌ డాలర్లు దాటింది. అయితే, ఒకేసారి వారంతా ఈ మైలురాయికి ఎగువన నిలవడం మాత్రం ఇదే తొలిసారి. లోరియల్‌ ఎస్‌ఏ వారసురాలు ఫ్రాంకోయిస్‌ బెటెన్‌కోర్ట్‌ మేయర్స్‌, డెల్‌ టెక్‌ వ్యవస్థాపకుడు మైకేల్‌ డెల్‌, మెక్సికన్‌ బిలియనీర్‌ కార్లోస్‌ స్లిమ్‌ వీరంతా గత ఐదు నెలల వ్యవధిలోనే 100 బి.డాలర్ల మైలురాయిని అందుకున్నారు. గతంలో ఈ క్లబ్‌లో ఉన్న గౌతమ్‌ అదానీ (Gautam Adani) తిరిగి స్థానం సంపాదించుకున్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం ఆయన సంపద భారీగా కుంగిన విషయం తెలిసిందే. దిద్దుబాటు చర్యల కారణంగా అదానీ కంపెనీల షేర్లు పుంజుకున్నాయి. అదే సమయంలో భారత్‌లో విదేశీ పెట్టుబడులు పెరగడం కూడా కలిసొచ్చింది.

* భారత్‌ గణనీయమైన ఆర్థికవృద్ధిని చూస్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన నిపుణుడు పేర్కొన్నారు. చైనాకు విదేశీ పెట్టుబడులు చాలా తక్కువగా నమోదవుతున్నాయని.. దీంతో అనేక పాశ్చాత్య దేశాల సంస్థల పెట్టుబడులకు భారత్‌ ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా మారిందన్నారు. 2024 దేశ వృద్ధిరేటు అంచనాలను సవరించిన నేపథ్యంలో ఐరాస నిపుణుడు ఈవిధంగా మాట్లాడారు. ‘‘పాశ్చాత్య దేశాలతోపాటు విదేశాల నుంచి చైనాకు పెట్టుబడులు చాలావరకు తగ్గాయి. ఈ క్రమంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో భారత్‌ ఎంతో లబ్ధి చెందుతోంది. పశ్చిమదేశాల కంపెనీలకు వనరులు లేదా ప్రత్యామ్నాయ పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది. ఇది భారత్‌కు లబ్ధి చేకూరుస్తోంది’’ అని ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగానికి చెందిన హమీద్‌ రషీద్‌ పేర్కొన్నారు. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అంచనాలు 2024’కు సంబంధించి తాజా సవరణలను వెల్లడించిన ఆయన.. దేశ ఆర్థికవృద్ధి రేటు 7 శాతానికి చేరువలో నమోదవుతుందని అంచనా వేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z