DailyDose

కర్నూలులో ముగ్గురు ట్రాన్స్‌జెండర్ల హత్య?-CrimeNews-May 19 2024

కర్నూలులో ముగ్గురు ట్రాన్స్‌జెండర్ల హత్య?-CrimeNews-May 19 2024

* ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది. తొలుత చెరువులో ఇద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించి కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. చెరువు ఒడ్డున మరో మృతదేహాన్ని వారు గుర్తించారు. మృతులు ఎవరు? ఎలా చనిపోయారు? అనేది మిస్టరీగా మారింది. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ట్రాన్స్‌జెండర్లను తీసుకువచ్చి మృతదేహాలను గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన వారి శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

* పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌ డీసీపీ డి.కవిత తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు చెందిన తోట బాలాజీ నాయుడు అలియాస్‌ మల్లారెడ్డి అలియాస్‌ దాసరి అనిల్‌కుమార్‌ (50) ఇటీవల తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేశాడు. తాను రాష్ట్ర ఆర్థికశాఖ అదనపు కార్యదర్శినని పరిచయం చేసుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రుణ పథకం ప్రారంభిస్తోందని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నారని, దీనికి జనాన్ని తరలించాల్సి ఉందని చెప్పాడు. ఒక్కొక్కరికి కనీసం రూ.3,600 చొప్పున మొత్తం రూ.3.60 లక్షలు పంపించాలన్నాడు. నిందితుడు చెప్పింది నిజమేనని నమ్మిన ఎమ్మెల్యే.. అతడు చెప్పిన బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ చేసేశారు. ఖాతాలో డబ్బులు పడగానే నిందితుడు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. దీంతో తనను మోసగించాడని ఎమ్మెల్యేకు అర్థమైంది. దీనిపై ఆయన వ్యక్తిగత కార్యదర్శి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా రకరకాల పథకాల పేర్లు చెబుతూ.. ఏపీ, తెలంగాణలోని పలువురు ప్రజాప్రతినిధులను నిందితుడు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ వెబ్‌సైట్‌ ద్వారా ఎమ్మెల్యే, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల ఫోన్‌ నంబర్లు సేకరించి.. వారికి ఫోన్లు చేస్తున్నట్లు విచారణలో నిందితుడు వెల్లడించాడు. అతడిపై తెలుగు రాష్ట్రాల్లో 37 కేసులు ఉన్నాయి. ఇతడు రామగుండం ఎన్‌టీపీసీలో 2008లో ఏఈగా చేరాడు. 2009 ఫిబ్రవరిలో ఓ ఎమ్మెల్యే పీఏ నుంచి లంచం తీసుకుంటుండగా సీబీఐ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం కరీంనగర్‌ జైలుకు తరలించారు. ఆ కేసులో విడుదలైన అనంతరం విశాఖ పరవాడ సింహాద్రి పవర్‌ ప్లాంట్‌లో ఉద్యోగంలో చేరాడు. అక్కడా మోసాలకు పాల్పడుతుండటంతో ఉద్యోగం నుంచి తొలగించారు.

* ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆదాయపు పన్ను శాఖ భారీ చర్యలు చేపట్టింది. ఆగ్రా నగరంలోని ముగ్గురు చెప్పుల వ్యాపారుల స్థలాలు, సంస్థలపై అకస్మిక తనిఖీలు చేపట్టింది. ఐటీ శాఖ సోదాల్లో లెక్కకు మిక్కిలి ఆస్తులు లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు రూ.40 కోట్ల నగదు దొరికిందని, మిగిలిన నగదును లెక్కిస్తున్నామని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దాడి సమయంలో షూ వ్యాపారి ఇంట్లో నోట్ల కుప్పలు గుర్తించినట్టుగా తెలిసింది. అందిన సమాచారం మేరకు ఆదాయపు పన్ను శాఖ దాడులు అర్థరాత్రి వరకు కొనసాగాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… ఆగ్రాలోని ఎంజీరోడ్‌కు చెందిన బీకే షూష్‌, ఢక్రాన్‌కు చెందిన మన్షు ఫుట్‌వేర్‌, ఆసుఫోటిడా మండికి చెందిన హర్మిలాప్‌ ట్రేడర్స్‌పై ఆదాయపు పన్నుశాఖ శనివారం దాడులు జరిపింది. ఐటీ సోదాల్లో నగదుతో పాటు ల్యాప్‌టాప్, మొబైల్, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. భూమి, బంగారంపై పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అల్మారాలు, షూ బాక్స్‌లు, మంచాల్లో కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి. రాత్రి 2 గంటల సమయంలో నోట్లు లెక్కించే యంత్రాలు వేడెక్కడంతో ఇతర యంత్రాలను రప్పించారు. 100 కోట్లకు పైగా అప్రకటిత ఆదాయాన్ని సరెండర్ చేసే అవకాశం ఉందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. చెప్పుల వ్యాపారులు ఆదాయపు పన్ను ఎగవేస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందింది. పక్కా సమాచారం మేరకు అధికారులు దాడులకు దిగారు. స్వాధీనం చేసుకున్న నగదు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బెడ్ మొత్తం రూ.500 నోట్ల వేల కట్టలతో నిండిపోవడం ఫోటోలో కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు షూ వ్యాపారుల షోరూమ్‌పై ఆదాయపు పన్ను శాఖ బృందం దాడులు చేసింది. దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ సోదాల్లో ఆదాయపు పన్ను శాఖ బృందం షోరూమ్‌లోని ప్రతి మూలను సోదా చేసింది. దీంతో పాటు చెప్పుల వ్యాపారికి చెందిన పలు ప్రాంతాల్లో ఐటీ బృందం తనిఖీలు చేసింది. ఇంత భారీ పన్ను ఎగవేత అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆగ్రాలో చెప్పుల వ్యాపారులపై జరిగిన ఈ దాడి నగరంలో కలకలం సృష్టించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఐటీ శాఖ ఆగ్రా సహా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది.

* తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే సైబర్ వలలో చిక్కుకున్నట్టు తెలిస్తోంది. సైబర్ మోసగాడి మాయ మాటలు నమ్మి, లక్షల రూపాయలు అతని అకౌంట్‌లో జమచేశారు. తీరా డబ్బులు వేశాక ఫోన్‌లో ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన సదరు ఎమ్మెల్యే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. దాంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు సీసీఎస్ పోలీసులు. ఎమ్మెల్యేకు తాను ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి అంటూ ఫోన్ కాల్ చేశారు సైబర్ నేరగాడు. ముఖ్యమంత్రి ఒక కొత్త రుణ పథకాన్ని ప్రారంభించబోతున్నారని, ఆ పథకంలో వందల మందికి లక్షల్లో రుణాలు ఇవ్వబోతున్నారని నమ్మబలికాడు. మీ కోటా కింద వంద మందికి రుణాలు అందేలా చూస్తానని నమ్మించాడు. ఇదంతా నిజమని నమ్మిన సదరు ఎమ్మెల్యే, అవతలి వ్యక్తి చెప్పినట్లు చేస్తూ వెళ్లారు. అయితే రుణాలు పొందాలంటే అందుకోసం ఒక్కోవ్యక్తికి 3 వేల 6 వందల రూపాయలు కమిషన్ కావాలని కోరాడు. అది విన్న ఎమ్మెల్యే వెనకా ముందు ఆలోచించకుండా సైబర్ నేరగాడి ఖాతాలో మూడు లక్షల 60 వేలు జమ చేశాడు. ఆ తర్వాత ఫోన్‌లో రెస్పా‌న్స్ లేకపోవడంతో మోసపో యానని గ్రహించారు సదరు ఎమ్మెల్యే. వెంటనే తన పీఏ ద్వారా సీసీఎస్‌లో ఫిర్యాదు చేయించారు. దీంతో కేసు నమోద చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z