NRI-NRT

Day1_PM: సెయింట్ లూయిస్ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Day1_PM: సెయింట్ లూయిస్ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో 24-28 వరకు తొలిసారిగా అయిదు రోజుల పాటు నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం నాడు అంకురార్పణ చేశారు. విశ్వక్సేన పూజతో ప్రారంభించి, పుణ్యాహవచనం, రుత్విక్‌వరణం (అర్చకులకు బాధ్యతల విభాగం), రక్షాబంధనం, అజస్రదీపారాధనం, దీక్షధారణ, మేధిని పూజలు నిర్వహించారు.

పలువురు ప్రవాసులు సతీసమేతంగా ఈ తొలిరోజు క్రతువులో పాల్గొని వేడుకలకు అంకురార్పణ చేశారు. వేడుకల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నంది, గరుడ, గజ, హనుమ, సూర్య, శేష వాహనాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మొదటిరోజు సాయంకాల వేడుకల్లో ఆలయ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్, ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ్ సాక్షి, బ్రహ్మోత్సవల కమిటీ కార్యదర్శి పుట్టగుంట మురళీ దంపతులు తదితరులు పాల్గొన్నారు. శనివారం ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవలతో రెండోరోజు కార్యక్రమాలు నిర్వహిస్తామని మీడియా కమిటీ ఛైర్మన్ సూరపనేని రాజా తెలిపారు. మొదటిరోజు సాయంకాలం సాంప్రదాయ భోజనాన్ని అందించారు. దీనిని సెయింట్ లూయిస్ కన్నడ సంఘం సభ్యులు ఆలయానికి అందజేయడంలో సహకరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z