* మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లాల్సిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునేనిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దావులూరి వర్షిత (24) బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. తిరువూరు మండలం ఎరుకుపాడు గ్రామానికి చెందిన యువకుడితో ఈ ఏడాది ఫిబ్రవరి 14న వర్షిత వివాహం జరిగింది. పెళ్లైన నాలుగు రోజులకే భర్త ఉన్నత చదువు నిమిత్తం అమెరికా వెళ్లారు. వర్షిత హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుమార్తెను ఈనెల 26న తండ్రి ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి నిద్రించిన వర్షిత.. తెల్లవారుజామున కనిపించలేదు. కుటుంబ సభ్యులు గాలించగా.. ఇంటి ఆవరణలోని బావిలో శవమై కనిపించింది. అనారోగ్య సమస్యలతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తండ్రి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ కుమార్, ప్రసన్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె వర్షిత మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే భర్త అమెరికాలో ఉండటం, తాను కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కావడంతో వీసా ఏర్పాట్లు చేసుకున్నారు. జులైలో అమెరికా వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానని భర్తతోపాటు తల్లిదండ్రులు, అత్తమామలకు తెలిపింది. ఈ క్రమంలో వర్షిత మృత్యువాత పడటంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
* సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో నిందితుడు సతీశ్‌కు బెయిల్ మంజూరైంది. నిందితుడికి విజయవాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. శని, ఆదివారాల్లో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం సతీశ్ నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
* న్నారులను విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం పీర్జాదిగూడలో రూ.4.50లక్షలకు ఆర్‌ఎంపీ డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయడంతో ముఠాగుట్టు రట్టయింది. మొత్తం 16 మంది చిన్నారులను ఈ ముఠా విక్రయించినట్టు నిర్ధరించారు.
* తమతోపాటు మద్యం తాగేందుకు అంగీకరించలేదని ఒక వ్యక్తిని మరో నలుగురు డాబాపై నుంచి కిందకు విసిరేసిన ఘటన లఖ్‌నవూలో చోటు చేసుకొంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. స్థానిక రుప్పుర్ ఖద్రా అనే ప్రదేశంలో రంజిత్ సింగ్ అనే వ్యక్తిని ఈ కేసులో బాధితుడిగా గుర్తించారు. ఈ మొత్తం గొడవ సమీపంలోని ఓ సెక్యూరిటీ కెమెరాలో రికార్డైంది. బాధితుడు రంజిత్ సింగ్ స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ కేసులో నిందితులైన నలుగురు వ్యక్తులు మద్యానికి తీవ్రంగా బానిసయ్యారు. వారు అతడి దుకాణానికి తరచూ వచ్చేవాళ్లు. శుక్రవారం రాత్రి బలవంతంగా అతడి ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం తమతో కలిసి రంజిత్ కూడా మద్యం తాగాలని పట్టుబట్టారు. కానీ, అందుకు నిరాకరించి.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరాడు. దీంతో వారు వెళ్లిపోయారు. కానీ, మర్నాడు మరోసారి ఇంట్లోకి చొరబడి డాబాపైకి తీసుకెళ్లి అతడిపై దౌర్జన్యానికి దిగారు. ఒక దశలో ఇది శ్రుతి మించి రంజిత్‌ను ఒక వ్యక్తి డాబాపై నుంచి కిందకు విసిరేశాడు. దీంతో అతడు రోడ్డుపై పడ్డాడు. మిగిలిన ముగ్గురు అతడిపై దాడి చేశారు. స్థానికులు అతడిని రక్షించి వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై తాము కేసు నమోదు చేసినట్లు లఖ్‌నవూ పోలీసులు ప్రకటించారు. సురేందర్ కుమార్, హేమంత్ కుమార్, అమర్ గౌతమ్ అనే నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
* నిజామాబాద్‌లోని ఓ స్కానింగ్ సెంటర్‌లో టెక్నీషియన్ అకృత్యాలు వెలుగు చూశాయి. స్కానింగ్ వచ్చే మహిళలు న్యూడ్ ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తూ స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బెదిరింపులకు గురి చేస్తున్నాడు. అనేక మంది ఆ కామాంధుని అకృత్యాలకు బలయ్యారు. ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు విషయం వెలుగులోకి వచ్చింది. స్కానింగ్ సెంటర్‌లో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు.. విచారణ ప్రారంభించారు. నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ యజమాని డాక్టర్ చంద్రశేఖర్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు.. ఆపరేటర్ ప్రశాంత్ స్పై కెమెరాతో ఫొటోస్ వీడియో తీసినట్లు తెలిసిందని బాధితుల ఫిర్యాదుతో ప్రశాంత్‌ను పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. ప్రశాంత్‌ను ఉద్యోగం నుంచి తొలగించామని కూడా చెప్పారు. ప్రశాంత్ అమ్మాయిలతో చాట్ చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డాక్టర్ చంద్రశేఖర్.
* రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్ లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్ కు చేరుకొని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసిపి మనోహర్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను అణువణువునా డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు. అదేవిధంగా భట్టి విక్రమార్క గారి కాన్వాయ్, కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాలను పోలీసులు క్షున్నంగా పరిశీలించారు. ఆ తర్వాత ప్రజాభవన్ లో ఉన్న అమ్మవారి ఆలయం లో తనిఖీలు చేశారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు సాగాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z