Business

₹73వేలు దాటిన బంగారం ధర-BusinessNews-May 29 2024

₹73వేలు దాటిన బంగారం ధర-BusinessNews-May 29 2024

* ‘తాజ్‌ మహల్‌ హోటల్‌’ ఈ పేరు వింటే గుర్తుకొచ్చేది సంపదే.. దేశంలోనే పేరున్న వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సంపన్నులు ముంబయిలో సేదదీరడానికి వచ్చే ప్రదేశం. అడుగడుగునా రాజరికం ఉట్టిపడుతుంటుంది. ఇందులో ఓ మానవీయ కోణం కూడా ఉంది. రతన్‌ టాటా (Ratan Tata) మూగజీవాలపై చూపే ప్రేమకు ఈ హోటల్‌ ఓ నిదర్శనంగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ హెచ్‌ఆర్‌ నిపుణురాలు రుబీ ఖాన్‌ తన లింక్డిన్‌ పోస్టులో వెల్లడించారు. తాను ఆ హోటల్‌కు వెళ్లినప్పుడు ఓ వీధి శునకం ప్రవేశద్వారం పక్కనే నిద్రపోవడాన్ని గమనించినట్లు రూబీ పేర్కొన్నారు. చాలా విలాసవంతమైన ఆ ప్రదేశంలో అది ఎందుకు ఉందా అనే సందేహం రావడంతో.. అక్కడే ఉన్న సిబ్బందిని దాని గురించి ప్రశ్నించినట్లు వెల్లడించారు. వారు చెప్పిన సమాధానం విని రతన్‌టాటాపై గౌరవం మరింత పెరిగినట్లు పేర్కొన్నారు. ‘‘ఆ శునకం పుట్టినప్పటి నుంచి అక్కడే పెరిగింది. హోటల్‌లో ఓ భాగమైపోయింది. అక్కడికి వచ్చే ఏ మూగజీవాన్నైనా జాగ్రత్తగా చూసుకోవాలని రతన్‌టాటా నుంచి విస్పష్టమైన ఆదేశాలున్నాయి’’ అని సిబ్బంది వెల్లడించినట్లు రాసుకొచ్చారు. నిత్యం వీఐపీలు వచ్చే ప్రతిష్ఠాత్మక సంస్థ వద్ద ఆ శునకం ప్రశాంతంగా నిద్రపోవడం తన మనసును తాకిందని రూబీ పేర్కొన్నారు. చాలా మంది అతిథులు అసలు దానిని గమనించి ఉండరన్నారు. ఇంత గందరగోళం మధ్య కూడా ఆ ప్రదేశాన్ని అది సొంతదిగా భావించిందని ముచ్చటపడ్డారు. మనం తరచూ చెప్పే కలుపుగోలుతనం, సైకలాజికల్‌ సేఫ్టీ, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ వంటివి ఇక్కడ కార్యాచరణలో కనిపించాయన్నారు. ఈ పోస్టు లింక్డిన్‌లో వైరల్‌గా మారింది. చాలా మంది యూజర్లు రతన్‌టాటా మానవత్వానికి ఫిదా అయ్యారు.

* దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సూచీలు నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 74,826.94 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ సెన్సెక్స్‌ కోలేదు. ఇంట్రాడేలో 74,986.22 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌.. 74,454.55 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 667.55 పాయింట్ల నష్టంతో 74,502.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 183.50 పాయింట్లు పతనమై 22,704.70 వద్ద ముగిసింది. మార్కెట్‌లో దాదాపు 1473 షేర్లు పురోగమించగా.. 1871 షేర్లు పతనమయ్యాయి. మరో 90 షేర్లు మారలేదు. హిందాల్కో, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, దివిస్‌ ల్యాబ్‌, నెస్లే, సన్‌ ఫార్మా, సిప్లా, బజాజ్‌ ఆటో, అదానీ పోర్ట్స్‌ లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌, టెక్‌ మహీంద్రా, బీపీసీఎల్‌ నష్టాల్లో ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్, టెలికాం, హెల్త్‌కేర్, మెటల్, పవర్ లాభాల్లో ముగియగా.. ఆటో, బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆయిల్ అండ్‌ గ్యాస్, రియల్టీ 0.3-1 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.

* దేశీయ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ..ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నది. ఈ విషయాన్ని కంపెనీ చైర్మన్‌ సిద్దార్థ మోహంతీ సూచనప్రాయంగా వెల్లడించారు. బీమా రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు, దీంట్లోభాగంగానే ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం బీమా చట్టం సవరించడం ద్వారా కంపొజిట్‌ లైసెన్స్‌ను అనుమతించే అవకాశాలున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐ మార్గదర్శకాలకు లోబడి బీమా చట్టం-1938 ప్రకారం ప్రస్తుతం లైఫ్‌, జనరల్‌ లేదా ఆరోగ్య బీమా సేవలు అందించడానికి సంస్థలకు వీలులేదు. కానీ, బీమా చట్టాన్ని సవరించే ప్రతిపాదనను ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. దీంట్లోభాగంగానే ఒకే సంస్థకు అన్ని రకాల సేవలు అందించడానికి వీలుపడనున్నది.

* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) సంస్థ ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ (OpenAI CEO Sam Altman) గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా బిలియనీర్ల ర్యాంక్‌ జాబితాలో చేరిన ఆయన.. తన సంపదలో పెద్ద మొత్తాన్ని సమాజానికి తిరిగి ఇస్తానని ప్రకటించారు. తన భాగస్వామి ఆలివర్‌ మల్హెరిన్‌ను (Oliver Mulherin) కలిసి ‘ది గివింగ్‌ ప్లెడ్జ్‌’ దాతృత్వ కార్యక్రమంపై సంతకం చేశారు. ‘‘నవీన సమాజ నిర్మాణానికి ఎంతోమంది కృషి చేశారు. ఈ ప్రపంచాన్ని మెరగుపరచడానికి వారు చేసిన కృషి, మేధస్సు, దాతృత్వం, అంకితభావం లేకుంటే మేం ఈ స్థాయిలో ఉండేవాళ్లం కాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆల్ట్‌మన్‌ తెలిపారు. తమ ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతీ వ్యక్తికి ఆల్ట్‌మాన్, ముల్హెరిన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే, సమాజ పురోగతికి అవసరమయ్యే సాంకేతికతకు మద్దతిస్తూ తమ దాతృత్వాన్ని కొనసాగించడంపై దృష్టి కేంద్రీకరిస్తామని ఈ జంట తెలిపింది.

* కొంతకాలంగా ఈక్విటీమార్కెట్‌లు భారీగా పుంజుకున్నాయి. దాంతో బంగారం ధరలు పడిపోయాయి. ఇటీవల మళ్లీ మార్కెట్‌లో అనిశ్చితులు నెలకొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మార్కెట్లు పడిపోతున్నాయి. దాంతో తిరిగి బంగారం ధరలు పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు సేఫ్డ్‌ అసెట్స్‌లో భాగంగా పసిడిని ఎంచుకుంటారు. కాబట్టి బుధవారం గోల్డ్‌రేట్లు స్వల్పంగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో పసిడిధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.67,100 (22 క్యారెట్స్), రూ.73,200 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.250, రూ.270 పెరిగింది. చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.350, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.380 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది. దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.67,250.. 24 క్యారెట్ల ధర రూ.73,350కు చేరింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z