Agriculture

హైదరాబాద్‌లో మరో మూడు డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు-NewsRoundup-May 29 2024

హైదరాబాద్‌లో మరో మూడు డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు-NewsRoundup-May 29 2024

* పాతికేళ్లుగా విపక్షాల దుర్భాషలు తాను వింటూనే ఉన్నానని.. ఇప్పుడు దూషణల నిరోధకంగా మారిపోయినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గత ఎన్నికల సమయంలో ‘మౌత్‌ కా సౌదాగర్‌’, ‘గందీ నాలీ కా కీడా’ అనే వ్యక్తిగత దూషణలు ఎదుర్కొనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. చివరిదశ పోలింగుకు ముందు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తమను అణచివేసేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విపక్షాల నుంచి వస్తున్న విమర్శలపైనా మోదీ స్పందించారు. ‘‘అందుకు నిదర్శనం ఏమిటని చెత్తను విసిరే వ్యక్తిని అడగండి. నేను ఆ చెత్తను ఎరువుగా మార్చి, ఈ దేశం కోసం మంచి ఉత్పత్తులను అందిస్తాను. పదేళ్లపాటు మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో కేవలం రూ.34 లక్షల అక్రమ ధనం మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. గత పదేళ్ల మా హయాంలో రూ.2,200 కోట్లను ఈడీ సీజ్‌ చేసింది. దేశానికి అన్ని కోట్ల రూపాయలను వెనక్కి తెచ్చిన వ్యక్తిని గౌరవించాలి.. నిందించకూడదు. ఆ డబ్బును దొంగతనం చేసిన వ్యక్తి పట్టుబడిన తర్వాత అరుస్తూనే ఉంటాడు’’ అన్నారు. ఎవరు జైలుకు వెళ్లాలన్నది మోదీ నిర్ణయిస్తారని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘‘ఇలాంటి వ్యక్తులు ఈ దేశ రాజ్యాంగం, చట్టంపై అవగాహన పెంచుకోవాలి’’ అని చురకలంటించారు. ఎన్నికలు ఉన్నా, లేకపోయినా ప్రతిపక్ష నేతల ప్రవర్తన ఇలాగే ఉంటుందని దుయ్యబట్టారు. నిరాశలో ఉన్నవారికి దూషించడం ఒక స్వభావంగా మారిపోయిందని మోదీ మండిపడ్డారు.

* కాంగ్రెస్‌ (Congress), సమాజ్‌వాదీ పార్టీ (SP)లపై కేంద్రమంత్రి అమిత్‌ షా (Amit Shah) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి లేరని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఆ రెండు పార్టీలు.. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లను నిందించేందుకు ముందుగానే పథకం వేశాయని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న షా.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

* దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో మద్యం విధానం మనీలాండరింగ్‌ కేసు విచారణ జరిగింది. ఈనెల 10న భారాస ఎమ్మెల్సీ కవిత, ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కవిత, చరణ్‌ ప్రీత్‌, దమోదర్‌ శర్మ, ప్రిన్స్‌ కుమార్‌, అరవింద్‌ సింగ్‌ను నిందితులుగా ఈడీ పేర్కొంది. ప్రస్తుతం కవిత, చరణ్‌ప్రీత్‌ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. కవిత, చరణ్‌ప్రీత్‌కు ప్రొడక్షన్‌ వారెంట్లు జారీ చేసిన కోర్టు.. తదుపరి విచారణను జూన్‌ 3కు వాయిదా వేసింది.

* నైరుతి రుతుపవనాలు రాగల 24గంటల్లో కేరళలోకి ప్రవేశించటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం, గురువారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. రాగల రెండ్రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. పశ్చిమ, వాయువ్య దిశల నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నట్టు తెలిపింది.

* తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం తుది రూపు సిద్ధమైంది. అమరవీరుల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రాచరిక గుర్తులను చెరిపేస్తూ.. ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకోసం 12 నమూనాలు తయారు చేయించారు. ఈ విషయమై ఇటీవల సీపీఐ, సీపీఎం నేతలతో పాటు ఉద్యమకారులు, పార్టీ నేతలు, కొందరు అధికారులతోనూ సీఎం చర్చించారు. ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ కళా తోరణాన్ని తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చార్మినార్, మూడు సింహాలు, జాతీయ జెండాలోని మూడు రంగులను కొనసాగిస్తూనే.. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని కొన్ని రోజులుగా పలువురు సూచించినట్లు సమాచారం. రెండ్రోజుల క్రితం రుద్ర రాజేశంతో చర్చించిన సీఎం కొన్ని మార్పులను సూచించారు. ఇవాళ తుది రూపంపై సీఎం సమీక్షలో రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. సిద్ధమైన నూతన లోగోను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆవిష్కరించనున్నారు.

* సైనిక ఉద్యోగికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఒక వర్గం ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆర్మీ ఉద్యోగి భార్య ఆత్మహత్యకు యత్నించడంతో వివాదం మరింత ముదిరింది. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పలివెల నాగేశ్వరరావు ఆర్మీలో మేజర్‌ సుబేదార్‌గా పనిచేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆయన దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నాగేశ్వరరావుకు 3 సెంట్ల స్థలం కేటాయించి పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. దీంతో అక్కడ ఆయన ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం శ్లాబ్‌ కూడా పూర్తయింది. స్థానిక వైకాపా నేతకు అదే స్థలంపై కన్నుంది. అక్కడ అంబేడ్కర్‌ విగ్రహం పెడితే స్థలం మీకే వస్తుందంటూ స్థానికంగా ఉన్న ఒక వర్గం వారిని రెచ్చగొట్టారు. దీంతో మంగళవారం వారంతా విగ్రహంతో వచ్చి నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో పెట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకోవడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది.

* భారత సైన్యం మరోసారి తమ శక్తిని చాటింది. పట్టుదలతో కలిసికట్టుగా ఏదైనా సాధించగలమని నిరూపించింది. బృందస్ఫూర్తిని, పోటీతత్వాన్ని ప్రదర్శించింది. సూడాన్‌లో చైనా సైనికులతో ఇటీవల జరిగిన ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’లో (India Vs China Tug Of War) భారత జవాన్లు విజయం సాధించారు.

* తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా? అని నిలదీశారు.

* రఫాలో ఇజ్రాయెల్‌ (Israel) ఆదివారం జరిపిన దాడులను అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. మహిళలు, పిల్లలు సహా పెద్ద ఎత్తున మరణాలు సంభవించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దాడి దృశ్యాలు కలచివేసేలా ఉన్నాయని పేర్కొంది.

* తన మధ్యంతర బెయిల్‌ అంశంలో ఆమ్‌ఆద్మీపార్టీ(AAP) అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఊరట లభించలేదు. బెయిల్‌ను మరో ఏడురోజుల పాటు పొడిగించాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే పిటిషన్‌ను కోర్టు విచారించే అవకాశం లేదు. ఆ పిటిషన్‌ లిస్టింగ్‌కు సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది.

* జూలై నెలాఖరులోగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ను పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. అమ్రాబాద్ టైగర్‌ రిజర్వ్‌ను ప్లాస్టిక్‌ ఫ్రీ జోన్‌గా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుదవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో అటవీ, పంచాయతీరాజ్‌, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సీఎస్ సమావేశమై చర్చించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. కాగితపు సంచులు, గుడ్డ/జనపనార సంచులు, విస్తరాకులు మొదలైన పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని నివారించి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో అదనపు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.

* తిరుపతి(Tirupati)లోని నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో(Brahmotsavam) భాగంగా చివరి రోజు బుధ‌వారం నిర్వహించిన చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం, అనంతరం పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి, సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనాన్ని నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 7 గంట‌ల వ‌ర‌కు న‌వ‌సంధి, మాడ‌వీధి ఉత్సవం , రాత్రి ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని టీటీడీ(TTD) అధికారులు వివరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z