Politics

జూన్ 24న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక-NewsRoundup-June 11 2024

జూన్ 24న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక-NewsRoundup-June 11 2024

* ఆంధ్రప్రదేశ్‌లోని పలు కళాశాలల్లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష ఫలితాలు (AP EAPCET Results) విడుదలయ్యాయి. మే 16 నుంచి 23వరకు ఈఏపీసెట్‌ నిర్వహించారు. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి.. వీటి ఆధారంగా ర్యాంకుల్ని ఇచ్చారు.

* ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కూటమి నేతలు కలిశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ గవర్నర్‌ను కలిశారు.

* ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష భేటీలో ఆయన మాట్లాడారు. ‘‘మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండదు. అమరావతి రాజధానిగా ఉంటుంది. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందాం’’అని అన్నారు.

* కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. 3 ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజినీర్లను విచారిస్తున్నామని, అఫిడవిట్‌ ద్వారా అన్ని విషయాలు తెలపాలని వారిని ఆదేశించినట్లు జస్టిస్‌ పీసీ ఘోష్ మీడియాకు తెలిపారు.

* సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారసుల గరిష్ఠ వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

* తెలంగాణలో విద్యుత్‌ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి తెలిపారు. యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్‌ నరసింహారెడ్డి జ్యుడిషియల్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది.

* కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. స్పీకర్‌ ఎన్నిక.. ఎంపీల ప్రమాణస్వీకారం కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జూన్ 24 నుంచి జులై 3 వరకు వీటిని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

* విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలోనే భారత్‌లో ఉన్నత విద్యా సంస్థ (HEI)ల్లో ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ప్రతిపాదనకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ చీఫ్‌ జగదీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి రెండు దఫాల్లో.. జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరిలలో ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిస్తామని అన్నారు.

* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాంకేతికతను తమ డివైజుల్లో అందిస్తూ పలు ఎలక్ట్రానిక్‌ సంస్థలు దూసుకుపోతుంటే.. యాపిల్‌ మాత్రం కాస్త వెనుకంజలో ఉంది. తాజాగా ఆ లోటును భర్తీ చేస్తూ కీలక ప్రకటన చేసింది. తమ పరికరాల్లో చాట్‌జీపీటీని అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించింది. దీనికోసం చాట్‌జీపీటీ సంస్థ ఓపెన్‌ ఏఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది.

* కేంద్రంలో కొత్త సర్కార్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం మల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు దిల్లీకి రాగా.. అక్కడి పార్లమెంట్‌ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తమ గత ప్రభుత్వం భారత్‌తో చేసుకున్న ఒప్పందాలను సమీక్షించే ఉద్దేశంతో ఆ తీర్మానం తీసుకువచ్చారు. ఇది రెండు దేశాల సంబంధాలను మరింత దిగజార్చుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

* వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగనమోహన్‌రెడ్డిని పార్టీ ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. వైఎస్‌ జగన్‌ని కలిసిన వారిలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాసు, ధర్మాన ప్రసాద్, కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, అన్నా రాంబాబు, తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ రెడ్డి శాంతి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు ఉన్నారు. ఎన్నికల ఫలితాలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు సహా పలు అంశాలపై చర్చించారు.

* వైద్య విద్య‌లో ప్రవేశాల కోసం నిర్వ‌హించే నేష‌న‌ల్ ఎంట్ర‌న్స్ క‌మ్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ అండ‌ర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ) పరీక్ష‌ను ర‌ద్దు చేయాటలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. దీనిపై జస్టిన్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ అమనుల్లాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం విచారణ జరిపింది. మే 5న జ‌రిగిన నీట్ యూజీ ప‌రీక్ష పేప‌ర్ లీకేజీ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న్లు కోరుతున్నార‌ని.. దీనిపై స‌మాధానం చెప్పాలంటూ కేంద్ర ప్ర‌భుత్వంతోపాటు ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన నేష‌నల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే నీట్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయ‌డం అంత సులువు కాద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అభిప్రాయ‌ప‌డింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z