Business

దుమ్ము రేపిన భారత స్టాక్ మర్కెట్-BusinessNews-June 25 2024

దుమ్ము రేపిన భారత స్టాక్ మర్కెట్-BusinessNews-June 25 2024

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగాయి. ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలతో మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ఆర్థిక, బ్యాంకింగ్ స్టాక్‌లలో లాభాల మద్దతుతో రెండు సూచీలు ప్రారంభ ట్రేడింగ్‌లో సానుకూలంగా ప్రారంభమయ్యాయి. చివరి వరకు అదే ఊపును కొనసాగాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సూచీలు సెన్సెక్స్‌ 77,529.19 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలయ్యాయి. ఇంట్రాడేలో 78,164.71 పాయింట్ల గరిష్ఠానికి చేరి జీవితకాల గరిష్ఠానికి చేరింది. చివరకు 712.45 పాయింట్లు లాభపడి.. 78,053.52 వద్ద లాభాల్లో ముగిసింది. నిఫ్టీ సైతం ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి పెరిగింది. 183.45 పాయింట్లు పెరిగి.. 23,721.30 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో శ్రీరామ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టెక్‌ మహీంద్రా, లార్సెన్‌, విప్రో, ఎస్‌బీఐ, బ్రిటానియా, విప్రో భారీగా లాభపడ్డాయి. బీపీసీఎల్‌, ఐచర్‌ మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఏషియన్‌ పేయింట్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటాస్టీల్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, బబాజ్‌ ఆటో నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 902.05 పాయింట్లు పెరిగి 52,606 వద్ద స్థిరపడింది. ఇతర రంగాల సూచీల కంటే ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ స్టాక్‌లు లాభాల్లో కొనసాగగా.. మెటల్, రియల్టీ స్టాక్‌లు నష్టాల్లో ముగిశాయి.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్న విషయం తెలిసిందే. ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో జులై 12న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ (Nita Ambani ) ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వెళ్లారు. అక్కడ ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని ( Kashi Vishwanath Temple) సందర్శించి విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. తన కుమారుడి ఆహ్వాన పత్రికను కాశీ విశ్వనాథుడి పాదాల చెంత ఉంచారు. తన కుమారుడి వివాహానికి ఆదిదంపతుల కుటుంబం మొత్తాన్ని ఆహ్వానించారు. పూజల అనంతరం నీతా అంబానీ మాట్లాడారు. అనంత్, రాధికల వివాహ ఆహ్వాన పత్రికను శివయ్యకు అందించడానికి ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. దాదాపు పదేళ్ల తర్వాత కాశీకి వచ్చినట్లు తెలిపారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎంతో సంతోషం కలిగినట్లు చెప్పారు. కాగా, వారణాసి పర్యటన సందర్భంగా నీతా అంబానీ ఓ సాధారణ దుకాణంలో చాట్‌ (chaat)ను ఆశ్వాదించారు. స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి నీతా అంబానీకి కాశీ విశ్వనాథ ఆలయ నమూనాను బహుమతిగా అందజేశారు.

* టెక్‌ దిగ్గజం అమెజాన్‌ ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీకి దీటైన పోటీ ఇచ్చేందుకు కసరత్తు సాగిస్తోంది. చాట్‌జీపీటీని ఢీ కొనేందుకు నూతన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చాట్‌బాట్‌ను లాంఛ్ చేసేందుకు అమెజాన్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది. మెటిస్‌ పేరుతో అమెజాన్‌ న్యూ ఏఐ చాట్‌బాట్‌ యూజర్ల ముందుకు రానుంది. అమెజాన్‌ అంతర్గత ఏఐ మోడల్‌ ఒలింపస్‌ ఆధారంగా మెటిస్ పనిచేస్తుందని భావిస్తున్నారు.అమెజాన్‌ ప్రస్తుత మోడల్‌ టైటాన్‌ ఏఐ మోడల్‌ కంటే ఒలింపస్‌ అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్‌ కావడం గమనార్హం. సంభాషణల పద్ధతిలో టెక్ట్స్‌, ఇమేజ్‌ ఆధారిత సమాధానాలను ఇచ్చేలా మెటిస్‌ను డిజైన్‌ చేస్తున్నారు. సోర్స్‌ రెస్పాన్స్‌లకు లింక్‌లు షేర్‌ చేయడం, ప్రశ్నలను ఫాలోఅప్‌ చేయడం, ఇమేజ్‌ జనరేట్‌ చేయడం వంటి విధులనూ మెటిస్‌ నిర్వర్తిస్తుంది.మైక్రోసాఫ్ట్, గూగుల్‌, యాపిల్‌ సమా పలు టెక్‌ కంపెనీల న్యూ ఏఐ అసిస్టెంట్‌లకు దీటుగా మెటిస్‌ను ముందుకు తీసుకొచ్చేందుకు అమెజాన్‌ కసరత్తు సాగిస్తోంది. ఏఐ రేస్‌లో తొలుత వెనుకబడినట్టు కనిపించిన అమెజాన్‌ లేటెస్ట్‌ ఏఐ మోడల్‌తో న్యూ టెక్నాలజీలో సత్తా చాటేందుకు సిద్ధమైంది.

* ఈ ఏడాది సెకండరీ మార్కెటే కాదు.. ప్రైమరీ మార్కెట్‌ కూడా దుమ్మురేపింది. బీఎస్‌ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీలు సరికొత్త స్థాయిల్లో కదలాడుతున్నాయి. మరోవైపు స్టాక్‌ మార్కెట్లలోకి రికార్డు స్థాయిలో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్లు (ఐపీవో) వచ్చేస్తున్నాయి. ఎంతలా అంటే గడిచిన 17 ఏండ్లలో ఇదే అత్యుత్తమ ప్రథమార్ధం (జనవరి-జూన్‌)గా నిలిచింది. ఈ ఏడాది జనవరి మొదలు ఇప్పటిదాకా 37 సంస్థలు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చాయి. ఇందులో కో-వర్కింగ్‌ స్పేస్‌, ఫర్నీచర్‌ రిటైలింగ్‌, ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ వంటి కంపెనీలూ ఉండటం విశేషం. ఇవన్నీ కలిసి దాదాపు రూ.32,000 కోట్ల నిధులను సమీకరించడం గమనార్హం. ఈ వారంలోనే మూడు ఐపీవోలు ముగిశాయి.

* స్టాక్‌మార్కెట్‌ గురించి ఏమాత్రం అవగాహన లేకపోయినా ట్రేడింగ్‌ల్లో పాల్గొనడం.. వాట్సప్‌, టెలిగ్రాం గ్రూపుల్లో జాయిన్‌ అయి డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్‌ చేసి సంపాదించిందంతా పోగొట్టుకోవడం.. ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతున్న సంఘటనలు. సమగ్ర అవగాహన ఉంటేనే ఎఫ్‌అండ్‌ఓలో ట్రేడ్‌ చేయాలని, లేకపోతే దానికి దూరంగా ఉండాలని ఓవైపు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం నిబంధనల్ని కఠినతరం చేస్తున్నా.. కొందరు మాత్రం ఆ మాటల్ని పెడచెవిన పెడుతున్నారు. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోతున్నారు. తాజాగా అదే వలలో చిక్కుకున్నాడు ఓ బీటెక్‌ విద్యార్థి. తన వద్దకు వచ్చిన రిటర్నుల్లో ఓ క్లయింట్‌ ఫైల్‌ని చూసి చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ఒకరు ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం రావడంతో చాలామంది ఐటీఆర్‌లు ఫైల్‌ చేయడం మొదలుపెట్టారు. అలా తన వద్దకు వచ్చిన రిటర్నుల్లో ఓ క్లయింట్‌ ఫైల్‌ని చూసి సీఏ రోషన్ అగర్వాల్ అవాక్కయ్యారు. ట్రేడింగ్‌లో అతడు ఏకంగా రూ.26 లక్షలు నష్టం వచ్చినట్లు అందులో పేర్కొనడం చూసి ఆశ్చర్యపోయారు. ఏ ఉద్యోగమూ చేయకుండానే.. మూడో సంవత్సరం చదువుతున్న ఆ బీటెక్‌ విద్యార్థికి ట్రేడింగ్‌ చేయడానికి ఇంత మొత్తంలో డబ్బు ఎలా వచ్చిందని ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. ‘‘బీటెక్‌ చదువుతున్న ఆ స్టూడెంట్‌కు ఎటువంటి ఆదాయం లేదు. పేరెంట్స్‌ విడిపోయారు. తల్లి హోటల్‌ నడుపుతోంది. యాప్‌ల ద్వారా వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. స్నేహితుల దగ్గర అప్పు చేశాడు. తల్లిదండ్రులకు తెలియకుండానే వాళ్ల అకౌంట్‌ నుంచి కొంత డబ్బు విత్‌డ్రా చేశాడు. ఇలా డబ్బుతో ట్రేడింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. ట్రేడింగ్‌లో రూ.26 లక్షలు నష్టపోయాడు. అంతకుముందు ఏడాదిలోనూ రూ.20లక్షలు పోగొట్టుకొన్నాడు. ఎఫ్‌అండ్‌ఓ ద్వారానే మొత్తం రూ.46 లక్షలు కోల్పోయాడు’’ అని ఆ సీఏ పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z