* మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని వైఎస్ జగన్ అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని.. ముందే నిర్ణయించినట్లు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలని ఎక్కడా లేదని తెలిపారు. అటు పార్లమెంటులో గానీ.. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఈ నిబంధనను ఇప్పటిదాకా ఎప్పుడూ పాటించలేదని గుర్తుచేశారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సూచించారు. కూటమి ప్రభుత్వం, స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని జగన్ వాపోయారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు ఇటీవల బయటపడ్డాయని తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రతిపక్ష హోదాతోనే సమస్యలను వినిపించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ అంశాలను స్పీకర్ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. తమ పార్టీ కార్యాలయాలే లక్ష్యంగా టీడీపీ విధ్వంసం సృష్టిస్తోందని వైసీపీ ఆరోపించింది. విజయవాడ, విజయనగరం పార్టీ కార్యాలయాల్ని కక్షపూరితంగా ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించింది. చంద్రబాబు ఇచ్చిన జీవోలతో టీడీపీ కట్టిన పార్టీ కార్యాలయాలను వదిలేసి.. అధికారులతో వైసీపీకి బలవంతంగా కూటమి ప్రభుత్వం నోటీసులు ఇప్పిస్తున్నదని పేర్కొంది.
* దేశ చరిత్రలో మునుపెన్నడూ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం ఓటింగ్ జరగలేదు. ఎప్పుడైనా అధికార పార్టీ లేదా కూటమి ఎంపీనే స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. కానీ ఈసారి ప్రతిపక్ష ఇండియా కూటమి కె సురేష్ (K Suresh) ను స్పీకర్ అభ్యర్థిగా బరిలో దించడంతో ఓటింగ్ అనివార్యమైంది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా ఎన్డీఏ (NDA) చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో మంగళవారం ఉదయం అధికార కూటమి తరఫున మాజీ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష కూటమి తరఫున సీనియర్ ఎంపీ కె సురేష్ నామినేషన్‌లు వేశారు.
* రామగుండం కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్యానల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్యానల్ అధ్యక్షులు కౌశిక్ హరి కుటుంబ సభ్యులు పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిశారు. సిరిసిల్ల, సిద్దిపేట ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావును కూడా కౌశిక్ హరి కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావు, కేటీఆర్ కౌశిక్ హరికి శుభాకాంక్షలు తెలిపారు.
* నగదును రెట్టింపు చేస్తామని మోసం( cheated) చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా(Nallagonda) చందనపల్లి గ్రామంలో ఈ నెల 22న ఆర్‌ఎంపీ వైద్యుడు శ్రీరామోజు రామాచారిని ముఠా సభ్యులు కలిశారు. మీ దగ్గర ఉన్న నగదు రెట్టింపు చేస్తామని నమ్మించారు. కాగా, బీహార్ రాష్ట్రానికి చెందిన రామ్ నరేష్ యాదవ్ గతంలో చందనపల్లి గ్రామంలో తాపీ మేస్త్రీగా పని చేసినాడు. ఆ సమయంలో చందనపల్లి గ్రామానికి చెందిన శ్రీ రామోజు రామాచారి ఇల్లును కట్టడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దీంతో వారి మాటలు నమ్మాడు. రామాచారి వద్ద నుంచి రూ.33లక్షలు తీసుకొని ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నల్లగొండ రైల్వే స్టేషన్‌లో నిన్న బీహార్‌కు చెందిన నిందితులు సిరాజ్, నరేష్ యాదవ్ పోలీసులు అదుపలోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.24 లక్షలు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం. పరారీలో ఉన్న మరో నిందితుడు ఆఫ్తాబ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చాకచక్యంగా నిందితులను పట్టుకున్న పోలీసులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
* కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) తన రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. సోమవారం జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy cm Batti), మంత్రి శ్రీధర్ బాబు జీవన్‌రెడ్డి నివాసంలో ఏకాంత చర్చలు జరిపారు. రేపు సీఎం హైదరాబాద్‌కు వచ్చి మాట్లాడిన తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకున్నా అది మీ ఇష్టం. అప్పటి దాకా మా మాట వినాలని శ్రీధర్ బాబు, భట్టి కోరారు.
* వినియోగదారుడి నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్(AE) ఏసీబీ(ACB) కి రెడ్ హ్యెడెండ్‌గా పట్టుబడ్డాడు. నెల్లూరు జిల్లాలో శివశంకర్ అనే ఏఈ విద్యుత్ మీటర్ కనెక్షన్ కోసం రూ. 80 వేలు డిమాండ్ చేశాడు. దీంతో వినియోగదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా మంగళవారం వ్యూహం ప్రకారం పట్టుకున్నారు.
* రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ విప్లవాత్మక పథకాలు అమలు చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. దేశంలోనే తొలిసారి కేసీఆర్ హయాంలో రైతు బంధు అమలు చేశామన్నారు. ఫార్మర్ ఫస్ట్ అనేది కేవలం నినాదం కాదని, దీనికి కొన్ని విప్లవాత్మక విధానాలు మద్దతుగా నిలిచాయని చెప్పారు. అది కేసీఆర్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం అని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు మరణాలు తగ్గడంపై అరవింద్ వారియర్ అనే నెటిజన్ చేసిన ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు. తాము తీసుకొచ్చిన పథకాల గురించి వెల్లడించారు.
* ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోర్టు నిర్ణయం నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైల్లోనే ఉండాల్సి రానున్నది. బెయిల్ పిటిషన్‌పై ఇచ్చిన స్టేను ఎత్తివేసేందుకు నిరాకరించింది. బెయిల్‌పై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వు లోపభూయిష్టంగా ఉందని.. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ కోర్టును కోరింది. ఈ నెల 20న రౌస్ అవెన్యూ కోర్టు సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 21న కోర్టు నిర్ణయాన్ని ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ అభ్యర్థన మేరకు కోర్టు స్టే విధించింది.
* రాష్ట్రంలో రైతు భరోసాకు దిక్కు లేదు. అసలు ఈ పథకాన్ని అమలు చేస్తారా..? లేదా..? చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్నదాతలకు ఈ వర్షాకాలం నుంచే రైతు భరోపా పథకం అమలు చేయాలి. రైతులకు వెంటనే ఎకరానికి రూ. 7500 సాయం అందించాలి. ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలైనా సీఎం, మంత్రులకు రైతు భరోసా అందించే తీరిక లేదా..? రుణమాఫీ అమలు చేస్తారా లేదా చెప్పాలి. ఐదు ఎకరాల లోపు రైతులకు ఏ బ్యాంక్ రూ. 2 లక్షలు లోన్ ఇవ్వలేదు. ఐదు ఎకరాల లోపు రైతులకు ఎంత మందికి రూ. 2 లక్షలు రుణాలిచ్చారో చెప్పాలి. రూ. 2 లక్షల రుణం తీసుకున్న రైతుల వివరాలు వెల్లడించాలి. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తారా..? లేదా..? రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తారా..? లేదా..? రేషన్ కార్డులు లేనివారికి కొత్తవి ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో అన్ని కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు. నిబంధనల పేరుతో రేషన్ కార్డుల్లో కోత పెట్టాలని కుట్రలు చేస్తున్నారు అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
* లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి (Air India flight) బాంబు బెదిరింపులు (bomb threat) రావడం కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున ఎయిర్ ఇండియాకు చెందిన AI 149 విమానం లండన్ గాట్విక్ వెళ్లేందుకు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Cochin airport) రన్‌వేపై సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఈ విమానంలో బాంబు పెట్టినట్లు కొందరు ఆగంతకులు ముంబైలోని ఎయిర్ ఇండియా కాల్ సెంటర్‌కు ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ సమాచారాన్ని వెంటనే కొచ్చిలోని ఎయిర్ ఇండియా సిబ్బందికి చేరవేశారు. అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ, ఎయిర్‌లైన్ సెక్యూరిటీ అధికారులు విమానంలో విస్త్రృతంగా తనిఖీలు చేపట్టారు. ఇన్‌లైన్ బ్యాగేజీ స్క్రీనింగ్ సిస్టమ్ ద్వారా భద్రతా తనిఖీలు జరిపారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ కనిపించలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అన్ని తనిఖీలు అనంతరం విమానం లండన్ వెళ్లేందుకు అనుమతించినట్లు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు బెదిరింపులకు పాల్పడింది.. అదే విమానంలో లండన్ వెళ్లేందుకు సిద్ధమైన కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 29 ఏళ్ల సుహైబ్‌గా గుర్తించారు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సదరు అధికారి వెల్లడించారు.
* 18వ లోక్‌సభ (18th Lok Sabha) తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్.. సభ్యులతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. రాజ్యాంగం చిరు పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఆంగ్లంలో ఆయన ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వయనాడ్ స్థానాన్ని వదులుకుని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కేరళలోని వయనాడ్ స్థానానికి ఆయన రాజీనామాను స్పీకర్ సోమవారం ఆమోదించారు. దీంతో నేడు ఆయన రాయ్‌బరేలీ (యూపీ) ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.
* వైకాపాకు చెందిన మాజీ మంత్రి అనిల్‌పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన స్థలం కబ్జా చేశారని ఆరోపిస్తూ కౌసర్ జాన్ చిన్నబజార్ సీఐకు ఫిర్యాదు అందజేశారు. నెల్లూరు భగత్‌సింగ్ కాలనీలోని తమ స్థలంలో వైకాపా ఆఫీసు కడుతున్నారని అందులో పేర్కొన్నారు.
* చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి విచ్చేసిన చంద్రబాబుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
* ఇటీవల కాలంలో ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను ఓటీటీ వేదికలు మిగిలిన భాషల్లో అనువాదం చేసి అందుబాటులోకి తెస్తున్నాయి. గత కొన్ని నెలలుగా మలయాళంలో విజయవంతమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరో మలయాళం మూవీ అందుకు సిద్ధమైంది.
* ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇప్పటికే టెస్టు, వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్.. తాజాగా టీ20ల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
* బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. వదులుగా ఉండే దుస్తులు వేసుకొని కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్లు మరోసారి పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై కత్రినా (Katrina Kaif) టీమ్ స్పందించింది. ‘ఊహాగానాలను ఆపేయండి. కత్రినా ఇప్పటివరకు ధ్రువీకరించని విషయాన్ని ప్రచారం చేయకండి’ అని టీమ్ పేర్కొంది. మరోవైపు ఆమె అభిమానులు ఈ రూమర్‌పై ఫైర్ అవుతున్నారు. ‘గత రెండు సంవత్సరాలుగా ఈ రూమర్స్ వస్తూనే ఉన్నాయి’ అని ఒకరు కామెంట్ పెట్టగా.. ‘కత్రినా కొంచెం బొద్దుగా అయ్యారంతే’ అని మరో అభిమాని అన్నారు.
* ప్రధాని నరేంద్రమోదీ(Modi) జులైలో రష్యాలో పర్యటించనున్నారని సమాచారం. భారత్-రష్యా మధ్య వార్షిక చర్చల నిమిత్తం ఈ పర్యటన జరగనుంది. అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వర్గాలను ఉటంకిస్తూ రష్యా అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది.
* కొందరు నేతలు పార్టీ మారినంత మాత్రాన భారాసకు ఎలాంటి నష్టం లేదని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో పలువురు పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారాసలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరిన అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. అలాంటి వారు పార్టీ మారడాన్ని పట్టించుకోవద్దని సూచించారు. వైఎస్ హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదని పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. భవిష్యత్‌లో గులాబీ పార్టీకి మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను తరచూ కలుస్తానని భరోసా ఇచ్చారు.
* మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ‘‘నేను ఇక్కడకు వచ్చినా.. రాకున్నా నన్ను ఆదరించారు. ఇప్పటి వరకు నన్ను 8 సార్లు గెలిపించారు. కుప్పం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. కుప్పం వ్యవహారాలు చూస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, మండల పార్టీ నేతలకు అభినందనలు. మొన్నటి ఎన్నికల్లో వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించారు. ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నాం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z