Politics

తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే లక్ష్యం-NewsRoundup-June 26 2024

తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే లక్ష్యం-NewsRoundup-June 26 2024

* మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం మంచిది కాదని చెప్పినా భారాస ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ ఇంజినీరింగ్‌కు ముందు డాక్టర్ బి.ఆర్‌.అంబేడ్కర్ సుజల స్రవంతి పేరుతో ప్రారంభించారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు సరికాదని చెప్పినా భారాస ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణానికి సిద్ధమైంది.

* ప్రతిపక్ష హోదా కోసం వైకాపా అధ్యక్షుడు జగన్ స్పీకర్‌కు లేఖ రాయడం సిగ్గుచేటని తెదేపా ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కనీస అవగాహన లేకుండా జగన్ ప్రతిపక్ష హోదా కోరడం హేయమైన చర్య అన్నారు.

* జూనియర్‌ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాల వసతిగృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది. కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించింది.

* ఇటీవల విడుదలైన ‘అమర్‌ సింగ్‌ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా కోసం ఆమె 16 కిలోల బరువు పెరిగారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావిస్తూ.. ఎంతమంది హీరోయిన్లు ఇలా బరువు పెరగడానికి సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు.

* ఆస్ట్రేలియాపై భారీ ఇన్నింగ్స్‌ ఆడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు చేసి స్టార్క్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి పెవిలియన్‌కు చేరాడు. ఆ సమయంలో టీ20 ప్రపంచకప్‌ అధికారిక బ్రాడ్ కాస్టర్‌ స్టార్ స్పోర్ట్స్‌ ఓ గ్రాఫిక్‌ను పదేపదే చూపిస్తూ.. ఎడమచేతి వాటం పేసర్ల బౌలింగ్‌లో రోహిత్ ఔటైనట్లు పేర్కొంది.

* మొబైల్‌ వాయిస్‌ కాల్స్‌, డేటా కోసం కేంద్రం నిర్వహించిన టెలికాం స్పెక్ట్రమ్‌ వేలం (Spectrum auction) ముగిసింది. మొత్తం రూ.96,238 కోట్ల విలువైన 10 GHZ స్పెక్ట్రమ్‌ను వేలానికి ఉంచగా.. కేవలం రెండ్రోజుల్లోనే వేలం ముగిసింది. 12 శాతం స్పెక్ట్రానికి మాత్రమే బిడ్డింగులు వచ్చాయి.

* టోల్‌ ఛార్జీల వసూలు గురించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లు సరిగా నిర్వహించలేనప్పుడు టోల్‌ వసూలు చేయొద్దని ఆయా ఏజెన్సీలకు సూచించారు. గుంతలతో కూడిన రోడ్లు, టోల్‌ ప్లాజాల వద్ద రద్దీ.. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

* లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లా (Om Birla) సభలో తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎమర్జెన్సీ (Emergency)’ అంశాన్ని ప్రస్తావించారు. అత్యయిక స్థితి నాటి విషాదాన్ని గుర్తుచేసుకుంటూ సభలో మౌనం పాటించారు. అయితే, స్పీకర్‌ ప్రసంగంపై కాంగ్రెస్‌ సహా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

* నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందుకోసం అక్కడ వాడీవేడి ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు ప్రత్యక్ష చర్చకు సిద్ధమయ్యారు.

* రిలయన్స్(Reliance) ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే(Eknath Shinde)ను ఆయన నివాసంలో కలిశారు. జులై 12న జరగనున్న తన కుమారుడు అనంత్‌ అంబానీ(Anant Ambani) వివాహానికి హాజరుకావాలని ముకేశ్‌ సీఎంను ఆహ్వానించారు. ఆయనతో పాటు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్(Radhika Merchant) శిందేను కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన సీఎం కుటుంబసభ్యులు రాధికా మర్చంట్‌కు వినాయకుడి ప్రతిమను బహూకరించారు.

* ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh) కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, రాజ్యసభ ఎంపీగా ఉన్న భజ్జీ.. క్రీడలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడంపై కొందరు నెటిజన్లు విమర్శలు (Trolls) వ్యక్తం చేశారు. ఆయనపై విద్వేషపూరిత కామెంట్లు చేశారు. వీటికి ఆయన గట్టిగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే..టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup 2024)లో హర్భజన్‌ సింగ్‌ కామెంట్రీ వినడంతో చెవుల్లో నుంచి రక్తం కారిందంటూ ఇటీవల ఓ నెటిజన్‌ పోస్ట్‌ పెట్టాడు. దీనికి భజ్జీ స్పందిస్తూ కాస్త వ్యంగ్యంగా జవాబిచ్చారు. మాజీ క్రికెటర్‌ పోస్ట్‌కు మరో నెటిజన్‌ రిప్లై ఇస్తూ.. ‘‘రాజ్యసభలో మీరు మాట్లాడినట్లు ఒక్కసారి కూడా మేం వినలేదు. ఉత్త పుణ్యాన పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో జీతం తీసుకుంటున్నారు. మీరు రాజ్యసభను వీడాలి’’ అని రాసుకొచ్చాడు.

* కమల్‌ హాసన్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ (Shankar) రూపొందించిన చిత్రం ‘భారతీయుడు’. 1996లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా తాజాగా ‘భారతీయుడు 2’ (bharateeyudu 2)ను తెరకెక్కించారు. జులై 12న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో మూవీ టీమ్‌ మీడియాతో ముచ్చటించి పలు విషయాలు పంచుకుంది. కమల్ హాసన్‌ (Kamal Haasan) మాట్లాడుతూ.. ‘అవినీతి విషయంలో అందరి మైండ్‌ సెట్‌ మారాలి. ‘భారతీయుడు’ మొదటి పార్ట్‌ వచ్చినప్పటికీ, ఇప్పటికీ ఈ విషయంలో ఏం మార్పు రాలేదు. ఈ సినిమా అంతా అవినీతి నేపథ్యంలోనే తెరకెక్కించారు. ఇది చూశాక చాలామంది ఆలోచిస్తారు. నేను గతంలో నటించిన కొన్ని చిత్రాల్లోని పాత్రలతో పోలిక ఉండడంతో ‘భారతీయుడు’లో భాగం కావాలని అనుకోలేదు. అందుకే శంకర్‌ తనంతట తానుగా నన్ను తప్పించాలని కావాలనే నా రెమ్యునరేషన్‌ పెంచాను. కానీ, నిర్మాతలు నా డిమాండ్లు అంగీకరించడంతో ఆ చిత్రంలో నటించాను. శంకర్‌కు తన కథపై నమ్మకం ఎక్కువ. నాతోనే తీయాలని పట్టుబట్టి ‘భారతీయుడు’ తీశాడు. అతని పట్టుదల చూసి నేను ఆశ్యర్చపోయాను’ అని చెప్పారు. తనను ఎన్నో ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

* ‘మా ఊరు పోలవరం.. మా గ్రామానికి వెళ్లే మార్గంలో భారీ ఆర్చి కట్టి ‘జగన్మోహనపురం’ అని పేరు రాశారు. ఇన్నాళ్లూ అభ్యంతరం చెబితే వైకాపా వారు బెదిరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది.. నిగ్గదీసే ధైర్యం వచ్చింది’ అంటూ కొందరు యువత సంఘటితమై ఆర్చి ఎక్కి జగన్‌ చిత్రాలు తొలగించారు.. కాకినాడ గ్రామీణ మండలం పోలవరంలో ఇది చోటుచేసుకుంది. తమ్మవరం పంచాయతీలోని పోలవరం గ్రామానికి వెళ్లే మార్గంలో ఓ పక్కన నేమాం లేఅవుట్‌ (జగనన్న కాలనీ) ఉంది. వైకాపా ప్రభుత్వం నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా కాలనీల్లో ఆర్చిలు, పైలాన్లతో హడావుడి చేసిన విషయం తెలిసిందే. 2020 డిసెంబర్‌ 25న యు.కొత్తపల్లి మండలం కొమరగిరి లేఅవుట్‌లో రాష్ట్రవ్యాప్త ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న అప్పటి సీఎం జగన్‌ను ఆకర్షించేందుకు మార్గమధ్యలోని ఈ పోలవరం గ్రామం వద్ద భారీ ఆర్చి నిర్మించారు. దానికి జగన్మోహనపురం పేరుపెట్టి రెండువైపులా జగన్‌ చిత్రాలు పెట్టారు. ఊరు పోలవరం అయితే జగన్‌ పేరు పెట్టారేంటని ప్రశ్నించినా వైకాపా నాయకులు లెక్కచేయలేదు. దీంతో ఆగ్రహంతో ఉన్న కొందరు యువత ఆర్చి ఎక్కి పేర్లు పీకేసి తమ నిరసన తెలిపారు. అక్కడ జనసేన జెండా ఎగరవేశారు. ఇన్నాళ్లూ ఓపిక పట్టాం.. ఇక తగ్గమని తేల్చిచెప్పేశారు. ప్రశ్నించినవారికి ..‘నేమాం కాలనీ దగ్గర ఆర్చి కట్టుకుని పేరు పెట్టుకోండి.. మా ఊరికి జగన్‌ పేరేంటి.’. అని సమాధానం ఇచ్చారు.

* కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ రహదారుల ప్రాజెక్టుల విషయమై దిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘జాతీయ రహదారులకు సంబంధించి గత అయిదేళ్లలో తెలంగాణకు అతి తక్కువ నిధులు వచ్చాయి. భూసమీకరణ, ఇతర అంశాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దాంతో పనులు ఆగిపోయాయి. 2016లో ప్రకటించిన రీజినల్‌ రింగ్‌రోడ్డును మరిచిపోతే మా ప్రభుత్వం వచ్చిన తరువాత కదలిక తీసుకొచ్చాం. యుటిలిటీ ఛార్జీలను భరిస్తామని చెప్పాం. కేంద్రమంత్రి గడ్కరీ స్పందించి తామే భరిస్తామని భరోసా ఇచ్చారు. 50-50 షేరింగ్‌లో భూసమీకరణ ప్రారంభించాలని తాజా సమావేశంలో నిర్ణయించాం.

* మహారాష్ట్రలో జికా వైరస్‌ కలకలం రేపింది. పుణెకు చెందిన ఓ వైద్యుడు సహా ఆయన కుమార్తెకు ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. అయితే, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకే ఇంట్లో రెండు కేసులు నమోదుకావడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు.. ఆ ప్రాంతంలో వైరస్‌ వ్యాప్తి నివారణ చేపట్టారు. పుణెకి చెందిన ఓ వైద్యుడు ఇటీవల జ్వరం బారిన పడ్డాడు. శరీరంపై దద్దుర్లు రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. రక్త నమూనాలు సేకరించి విశ్లేషణ కోసం ఆ నగరంలోనే ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపించారు. జూన్‌ 21న వారికి జికా ఇన్‌ఫెక్షన్‌ నిర్ధరణ అయినట్లు స్థానిక మునిసిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. అనంతరం అతడి కుటుంబ సభ్యులకు రక్త పరీక్షలు నిర్వహించారు. దాంట్లో ఆయన కుమార్తె (15)కు వైరస్‌ సోకినట్లు తేలింది. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు.

* స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు. కార్పొరేషన్‌ పనితీరుపై డిప్యూటీ సీఎంకు అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. స్వచ్ఛాంధ్రకు నిధుల లభ్యత, ఖర్చుల వివరాలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. గత ఐదేళ్లలో కేంద్రం విడుదల చేసిన రూ.1,066 కోట్లు ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు. కేంద్ర నిధులను రాష్ట్ర ఆర్థికశాఖ స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదని అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరాశాఖలపై గురువారం డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.

* అగ్ర కథానాయకుడు నాగార్జునను కలవడానికి వచ్చిన ఓ అభిమానిని ఆయన సెక్యూరిటీ సిబ్బంది లాగేసిన ఘటన ఇటీవల వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. తాజాగా నాగార్జున తన అభిమానిని ముంబయి విమానాశ్రయంలో కలిశారు. ఆప్యాయంగా హత్తుకున్నారు. అతడితో ఫొటోలు దిగారు. తన సెక్యూరిటీ సిబ్బంది లాగేసిన విషయం తనకు తెలియకుండా జరిగిందన్నారు. ఈ వీడియోను ఆయన (Nagarjuna) అభిమానులు షేర్‌ చేస్తున్నారు. రియల్‌ హీరో అని కామెంట్స్‌ పెడుతున్నారు.

* పల్నాడు జిల్లా మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అరెస్టయ్యారు. ఎన్నికల సమయంలో పాల్పడిన నేరాలకు సంబంధించి హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కారణంగా పిన్నెల్లి ఇంతకాలం అరెస్టు కాలేదు. ముందస్టు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు వెంటనే ఆయన్ను నరసరావుపేటలో అదుపులోకి తీసుకుని పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

* జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిక వ్యవహారంపై పంచాయితీ దిల్లీకి చేరింది. సంజయ్‌ కుమార్ చేరికను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత మూడు రోజులుగా జీవన్‌రెడ్డి అలకబూనడంతో బుజ్జగించే కార్యక్రమం సాగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్‌, ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు బుజ్జగించారు. అయినా, జీవన్‌రెడ్డి మెట్టు దిగలేదు. తన ప్రమేయం లేకుండా జరగాల్సింది జరిగిపోయిందని జీవన్‌రెడ్డి అందోళన వ్యక్తం చేశారు. పార్టీని వీడేది లేదని స్పష్టం చేస్తున్నప్పటికీ ఇవాళ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పార్టీ అధిష్టానం, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్‌ మున్షీ జీవన్‌రెడ్డికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

* వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రతిపక్ష నేత కాదని.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమేనని ఏపీ ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడికి జగన్‌ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. అమరావతిలో మీడియాతో పయ్యావుల మాట్లాడారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు. ఆ హోదా రావడానికి ఆయనకు ఓ పదేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జగన్‌కు ఆప్తుడైన కేసీఆర్‌ కూడా గతంలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. స్పీకర్‌కు జగన్‌ లేఖ రాసి బెదిరించే ప్రయత్నం చేశారన్నారు. ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో ఆయన లేఖ రాయడమేంటని నిలదీశారు.

* వైకాపా హయాంలో రవాణా శాఖ నిర్వీర్యమైందని ఏపీ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదన్నారు. లీజుల పేరుతో ఆర్టీసీ భూములను వైకాపా నేతలు చెరబట్టారని ఆరోపించారు. లీజుకు తీసుకున్న భూములను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఛార్జీల భారం పెంచకుండానే.. బస్సు సర్వీసులు పెంచి మంచి సేవలందిస్తామని పేర్కొన్నారు. ‘ఆడుదాం ఆంధ్రా’ అక్రమాలన్నింటినీ వెలికితీస్తామని తెలిపారు. ప్రజల సొమ్ము తిన్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేది లేదని రామ్‌ప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z