NRI-NRT

తిరుమలలో అద్భుతంగా గుత్తికొండ-ఐకాల శ్రీగాయత్రి అతిథిగృహం

తిరుమలలో అద్భుతంగా గుత్తికొండ-ఐకాల శ్రీగాయత్రి అతిథిగృహం

కలియుగ వైకుంఠం తిరుమలలో ప్రవాసాంధ్ర ప్రముఖులు గుత్తికొండ శ్రీనివాస్(ఫ్లోరిడా), ఐకా రవి(బోస్టన్)ల భూరి విరాళంతో వీఐపీలతో నిత్యం రద్దీగా ఉండే పద్మావతినగర్‌లో శ్రీ గాయత్రి నిలయం పేరిట నిర్మించిన అతిథి గృహం అద్భుతంగా ఉంది. తితిదే మాజీ ఛైర్మన్ సుబ్బిరామిరెడ్డికి చెందిన ఇందిర గెస్ట్ హౌజ్, నటుడు గద్దె రాజేంద్రప్రసాద్‌కు చెందిన రాజేంద్ర ప్రసాదం, జూపల్లి రామేశ్వరరావుకు చెందిన మై హోం విష్ణు నిలయానికి, NTV చౌదరికి చెందిన శ్రీ రచన అతిథిగృహానికి సమీపంలోనే ఇది ఉండటం విశేషం. తితిదే ఛైర్మన్ క్యాంపు ఆఫీసుకు ఎదురుగా దీన్ని నిర్మించారు. 2023 సెప్టెంబరు నుండి దీన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకునివచ్చినట్లు శ్రీనివాస్ తెలిపారు.

ఏడు నక్షత్రాల హోటల్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా నిర్మించిన ఈ అతిథిగృహంలో లిఫ్ట్‌తో పాటు, పెంట్‌హౌజ్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం నాలుగు అంతస్తుల్లో 13 గదులు ఉన్న ఈ అతిథి గృహంలో 3 సూట్ గదులు, 9 సాధారణ గదులు ఉన్నాయి. వీటి అద్దె రోజుకు ₹5600 నుండి ₹7500 రూపాయిల వరకు ఉంది. దీని నిర్వహణ బాధ్యతలను గుత్తికొండ-ఐకాల కుటుంబాలే పర్యవేక్షిస్తున్నప్పటికీ అద్దె వసూళ్లు, గదుల కేటాయింపులు మాత్రం పూర్తిగా తితిదే ఆధీనంలోని పద్మావతి ఎంక్వైరీ ఆఫీసు నుండి జరుగుతుంది.

ఈ అతిథి గృహం బాల్కనీ నుండి చూస్తే తిరుమల దివ్యక్షేత్ర ప్రాకృతిక సౌందర్యాలు, ఆనంద నిలయం, వరాహస్వామి ఆలయం, స్వామివారి పుష్కరిణి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వంటివి కనువిందు చేస్తూ ఆధ్యాత్మిక అనుభూతులను పంచుతున్నాయి. సుంకు రమేష్ సారథ్యంలో నిత్యం అయిదుగురు ఉద్యోగులు ఈ అతిథి గృహంలో భక్తులకు సేవలందిస్తున్నారు. “మానవసేవే మాధవసేవ” నినాదానికి న్యాయం చేస్తూ తిరుమల వెళ్లే ప్రవాస భక్తులకు పలు విధాలుగా సాయపడుతున్న గుత్తికొండ-ఐకా కుటుంబం ఈ నూతన అతిథి గృహం ఏర్పాటు ద్వారా స్వామివారి సన్నిధికి వెళ్లే భక్తులకు మరిన్ని దివ్యానుభూతులు కలగాలని, వెంకన్న కృపతో అందరూ బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు.

—సుందరసుందరి(sundarasundari@aol.com)

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z