Business

డాలరుకు ₹83.58 – BusinessNews-June 26 2024

డాలరుకు ₹83.58 – BusinessNews-June 26 2024

* ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) యూజర్ల డేటా మరోసారి ప్రమాదంలో పడింది. వినియోగదారుల వ్యక్తిగత డేటా లీకైంది. గత ఆరు నెలల్లో కస్టమర్ల డేటా హ్యాక్‌ అవ్వడం ఇది రెండోసారి. ఈ డేటాలో సిమ్‌ కార్డ్‌ వివరాలు, అంతర్జాతీయ మొబైల్‌ చందాదారుల గుర్తింపు (IMSI), హోమ్‌ లొకేషన్‌.. వంటి సమాచారం ఉన్నట్లు అథెంటియన్ టెక్నాలజీస్‌ పేర్కొంది. బీఎస్‌ఎన్ఎల్‌కు చెందిన 278 జీబీ డేటా ఉందంటూ కిబర్‌ ఫాంటోమ్‌ అనే వ్యక్తి 5000 డాలర్లకు అమ్మకానికి పెట్టినట్లు అథెంటియన్‌ టెక్నాలజీస్‌ తన నివేదికలో పేర్కొంది. నకిలీ సిమ్‌ కార్డ్‌లను సృష్టించడానికి ఈ డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ వివరాలను ఉపయోగించి యూజర్ల వ్యక్తిగత ఖాతాలను నేరగాళ్లు అనధికారికంగా యాక్సెస్‌ చేయడం, సైబర్‌ దాడులు, మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

* ఇటీవల వెలువడిన ఊహాగానాలను నిజం చేస్తూ రిలయన్స్‌ రిటైల్‌ (Reliance Retail) క్విక్‌ కామర్స్‌లోకి ప్రవేశించింది. ముంబయి, నవీ ముంబయిలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న బ్లింకిట్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బీబీనౌ తరహాలో 10 నిమిషాల్లో ఇస్తుండగా, రిలయన్స్‌ మాత్రం గంటలో సరకులను అందించాలని నిర్ణయించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ‘హైపర్‌లోకల్‌ డెలివరీ’ పేరిట ఈ సేవలను జియోమార్ట్‌ మొబైల్‌ యాప్‌నకు అనుసంధానించారు. మరిన్ని స్టోర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత డెలివరీ సమయాన్ని 30-45 నిమిషాలకు కుదించే యోచనలో ఉన్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ (Reliance Retail) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇతర మార్కెట్లకు విస్తరించే కొద్దీ దీన్ని మరింత సమర్థంగా అమలుచేస్తామని తెలిపారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) మరోసారి రాణించాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లాయి. ఈ క్రమంలోనే సూచీలు మరోసారి జీవనకాల గరిష్ఠాలను తాకాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 78759.4 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23,889.90 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ ఉదయం 78,094.02 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో కాసేపు ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి. చివరికి 620.73 పాయింట్ల లాభంతో 78,674.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 147.50 పాయింట్ల లాభంతో 23,868.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.58గా ఉంది. సెన్సెక్స్‌లో రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సన్‌ ఫార్మా, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటాన్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ చమురు ధర 85.72 డాలర్ల వద్ద, ఔన్సు బంగారం 2326 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

* మొబైల్‌ వాయిస్‌ కాల్స్‌, డేటా కోసం కేంద్రం నిర్వహించిన టెలికాం స్పెక్ట్రమ్‌ వేలం (Spectrum auction) ముగిసింది. మొత్తం రూ.96,238 కోట్ల విలువైన 10 GHZ స్పెక్ట్రమ్‌ను వేలానికి ఉంచగా.. కేవలం రెండ్రోజుల్లోనే వేలం ముగిసింది. 12 శాతం స్పెక్ట్రానికి మాత్రమే బిడ్డింగులు వచ్చాయి. తొలిరోజు ఐదు రౌండ్ల బిడ్డింగ్‌లో రూ.11,340 విలువైన బిడ్లను టెలికాం కంపెనీలు సమర్పించగా.. బుధవారం ఎలాంటి బిడ్లూ లేకపోవడంతో ఉదయం 11.30 గంటలకే వేలం ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా ఈ వేలంలో పాల్గొన్నాయి. బుధవారం వేలం ముగిసే సమయానికి కేవలం 140-150 MHz స్పెక్ట్రానికే బిడ్లు దాఖలైనట్లు తెలుస్తోంది. దీంతో రూ.11వేల కోట్లు మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. 2022లో చివరిసారిగా నిర్వహించిన స్పెక్ట్రమ్‌ వేలం ఏడు రోజుల పాటు సాగింది. మొత్తం రూ.1.5 లక్షల కోట్ల విలువైన 5జీ స్పెక్ట్రమ్‌ను టెలికాం కంపెనీలు కొనుగోలు చేశాయి. ఇందులో జియో టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది. సుమారు రూ.88,078 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను ఆ కంపెనీ దక్కించుకుంది. ఎయిర్‌టెల్‌ రూ.43,084, వొడాఫోన్‌ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. తాజాగా నిర్వహించిన వేలం రెండ్రోజులకే ముగియడం గమనార్హం.

* టోల్‌ ఛార్జీల వసూలు గురించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లు సరిగా నిర్వహించలేనప్పుడు టోల్‌ వసూలు చేయొద్దని ఆయా ఏజెన్సీలకు సూచించారు. గుంతలతో కూడిన రోడ్లు, టోల్‌ ప్లాజాల వద్ద రద్దీ.. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలుపై నిర్వహించిన గ్లోబల్‌ వర్క్‌షాప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు మంచి సేవలు అందించలేనప్పుడు టోల్‌ ఛార్జీ వసూలు చేయొద్దు. రోడ్లు బాగా లేకపోతే ప్రజలు హర్షించారు. చాలామంది ఇప్పటికే సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాబట్టి మంచి రోడ్లు అందివ్వలేనప్పుడు టోల్‌ వసూలు చేయకూడదు. ఒకవేళ గుంతలతో కూడిన రోడ్లపై టోల్‌ వసూలు చేస్తే రాజకీయ నాయకులుగా మేం ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది’’ అని గడ్కరీ అన్నారు. టోల్‌ ప్లాజాల వద్ద ఆలస్యం కాకుండా చూడాలని నేషనల్‌ హైవే ఫీల్డ్‌ ఆఫీసర్లకు సూచించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z